బాన్సువాడ రూరల్, నవంబర్ 27 : రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతున్నదని, కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, దీక్షా దివస్ కామారెడ్డి జిల్లా ఇన్చార్జి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ బెదిరింపులకు బీఆర్ఎస్ శ్రేణులు భయపడాల్సిన అవసరం లేదని, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టంచేశారు. ఈ నెల 29న నిర్వహించనున్న దీక్షా దీవస్ నేపథ్యంలో బాన్సువాడలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు కేసీఆర్ చేపట్టిన మలిదశ ఉద్యమం పునాది అని, తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణలోని సబ్బండ వర్ణాలను ఏకం చేసి రాష్ట్ర సాధనకు తోడ్పడిందన్నారు.
తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర సాధనలో అత్యంత కీలకమైన ఘట్టంగా దీక్షా దివస్ నిలుస్తుందన్నారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తిన ఎగిసి, స్వరాష్ట్ర సాధనకు బలమైన పునాదులు వేసిందన్నారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో అప్పటి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. కేసీఆర్ త్యాగాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని, అందుకే దీక్షా దివస్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
కేసీఆర్ పాలనతో సుభిక్షంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం, కాంగ్రెస్ పాలనలో అరాచక పాలన కొనసాగిస్తున్నదని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై అనవసర కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, కార్యకర్తలకు పార్టీ అండగా
నిలుస్తుందని భరోసా ఇచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పని చేయకుండా, కేవలం తన కుటుంబసభ్యుల కోసమే పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. లగచర్లలో అమాయక గిరిజన మహిళలపై కేసులు నమోదు చేస్తే వారికి అండగా ఉంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌తో పాటు మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారని తెలిపారు.
బీఆర్ఎస్తో పదవులు పొందిన కొందరు తమ స్వలాభం కోసం పార్టీ మారారన్న ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్.. నాయకులు పార్టీ మారినా, కార్యకర్తలు మాత్రం అండగా ఉన్నారన్నారు. పార్టీ కార్యకర్తలకు ఏ నష్టం జరిగినా ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్పై ఇతర పార్టీలు చేస్తున్న విమర్శలను నాయకులు, కార్యకర్తలు తిప్పికొట్టాలని సూచించారు. వచ్చేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కార్యకర్తలు సైనికుల్లా పని చేస్తూ పార్టీని ముందుండి నడిపించాలని కోరారు. 29న కామారెడ్డిలో జరిగే దీక్షాదివస్‌కు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.
బాన్సువాడ గడ్డ బీఆర్ఎస్ పార్టీకి అడ్డా అని, త్వరలో జరిగే మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో బాన్సువాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని పార్టీ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్ అన్నారు. జిల్లాలో గులాబీ జెండా ఎగురవేసి, కేసీఆర్‌కు కానుకగా ఇస్తామన్నారు. ప్రభుత్వం లేదని నాయకులు, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దన్నారు.
కొందరు వెన్నుపోటు పొడిచి ఇతర పార్టీలలో చేరారని, వచ్చే ఎన్నికల్లో కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి, వారే ప్రజాప్రతినిధులుగా ఎన్నిక అవుతారని అన్నారు. కేసీఆర్ సారథ్యంలో, కేటీఆర్ ఆధ్వర్యంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తామన్నారు. బాన్సువాడ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, నేతలు మోచి గణేశ్, సాయిబాబా, అశోక్, గణేశ్, నాగరాజు, అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు.