ఆర్మూర్‌టౌన్, ఏప్రిల్ 26: వరంగల్ జిల్లా ఎల్కతుర్తితో నేడు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జిల్లా నుంచి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లేందుకు ఏర్పాట్లు చేసినట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మండలంలోని అంకాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ నాయకులతో సమీక్ష నిర్వహించారు.
జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి వరంగల్ బాట పట్టాలని సూచించారు. గులాబీ దండు కదం తొక్కుతున్న తీరు చూస్తుంటే ఉద్యమ కాలం నాటి జోష్ కనిపిస్తున్నదని పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడ చూసినా ఒక పండుగ వాతావరణం కనిపిస్తుందని అన్నారు. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు తరలివెళ్లేందుకు వాహనాలను సిద్ధం చేశామని వెల్లడించారు.