ఉద్యమ పార్టీగా పురుడు పోసుకున్న బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు ఉమ్మడి జిల్లాలోని గులాబీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. భారత రాష్ట్ర సమితి 24 ఏండ్ల ప్రస్థానం ముగించుకుని రజతోత్సవం వైపునకు పరుగులు పెడుతున్నది. ఈ నేపథ్యంలో ఈనెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభను పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. ఇందుకోసం అక్కడ ముమ్మర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. 25 ఏండ్ల బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంలో పాలుపంచుకునేందుకు పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. కాంగ్రెస్ పాలనతీరుపై విసుగెత్తి పోతున్న ప్రజలు, బీఆర్ఎస్ అభిమానులు కేసీఆర్ సభకు హాజరుకావడానికి ఆసక్తి చూపుతున్నారు.
-నిజామాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
బీఆర్ఎస్ 25 ఏండ్ల ప్రస్థానం నేపథ్యంలో ఈ ప్రత్యేక దినోత్సవాన్ని చరిత్రలో గుర్తుండి పోయేలా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కనీవినీ ఎరుగని రీతిలో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితి రెండున్నర దశాబ్దాల కాలంలో అనేక అద్భుత ఘట్టాలకు సాక్షాత్కారమై నిలిచింది. ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన బీఆర్ఎస్ దేశంలోనే ఒక ప్రత్యేకతను సాధించింది. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాతో పురుడు పోసుకున్న టీఆర్ఎస్ నేడు బీఆర్ఎస్గా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.
ఉద్యమ సమయంలో గులాబీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో అనేక సభలు, సమావేశాలు నిర్వహించారు. ప్రతి జిల్లాలో ధూంధాం కార్యక్రమాలతో ప్రజల్లో రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను తెలియజేశారు. చారిత్రాత్మకమైన సభలతో ప్రపంచ రికార్డులను సైతం తిరగరాసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీకే దక్కింది. మలి దశ ఉద్యమంలో అలుపెరగని పోరాటాల ద్వారా ప్రాణాలను పణంగా పెట్టి ఆమరణ నిరాహార దీక్షతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కేసీఆర్ సాధ్యం చేశారు. సమైక్యాంధ్ర పాలకుల కుట్రలను ఛేదిస్తూ, నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంటి దొంగల భరతం పడుతూ కేసీఆర్ సాగించిన
ఉద్యమ కాలం చిరస్థాయిగా నిలిచిపోతుంది.
తెలంగాణ తెచ్చిన పార్టీగా దేశంలోనే అత్యధిక సభ్యత్వాలు కలిగిన ప్రాంతీయ పార్టీగా రికార్డుకెక్కిన భారత రాష్ట్ర సమితి 25ఏండ్ల వసంతోత్సవాలను జరుపుకొంటున్న వేళ..గులాబీ శ్రేణుల్లో సంబురం కనిపిస్తున్నది. గులాబీ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రజతోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ ఆవిర్భావం రోజున అంతటా జెండా ఆవిష్కరణలు చేపట్టనున్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ కార్యాలయాల్లో గులాబీ నేతలంతా సంబురాలు నిర్వహించి, అనంతరం ఎల్కతుర్తికి బయలుదేరనున్నారు. సాయంత్రం కేసీఆర్ హాజరయ్యే భారీ బహిరంగ సభకు శ్రేణులంతా హాజరవుతారు. చారిత్రక సభకు రవాణా సౌకర్యం కోసం బీఆర్ఎస్ కేంద్ర నాయకత్వం చొరవ తీసుకున్నది.
ఆర్టీసీ బస్సులను ప్రత్యేకంగా అద్దెకు తీసుకున్నది. ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేని చోట ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను సైతం అందుబాటులో ఉంచనున్నారు. కేసీఆర్ సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఉండేందుకు ముందస్తుగా కట్టుదిట్టమైన సౌకర్యాలను కల్పించనున్నారు. కొట్లాడి తెచ్చుకున్న స్వరాష్ట్రంలో నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ పార్టీకే 2014, 2018లో జై కొట్టారు. అరవై ఏండ్ల ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్‌కు తొలి ముఖ్యమంత్రిగా ప్రజలంతా పట్టం కట్టారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బొటాబొటి ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయినప్పటికీ బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్రను విజయవంతంగా పోషిస్తూ తెలంగాణ రాష్ట్రం, ప్రజల కోసం అలుపెరగని పోరాటాలను చేస్తున్నది.
ఉద్యమాల గడ్డ వరంగల్ జిల్లాలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే గులాబీ శ్రేణులతో సన్నాహక సమావేశాలు జోరుగా జరిగాయి. తొమ్మిది నియోజకవర్గాల్లో స్థానిక మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీల సమక్షంలో సమన్వయ సమావేశాలు నిర్వహించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఉభయ జిల్లాల్లో పర్యటించి ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంత్ షిండే, ఆశన్నగారి జీవన్ రెడ్డి, బిగాల గణేశ్ గుప్తా, జాజాల సురేందర్‌తో చర్చించి రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు ప్రణాళికలను రూపొందించారు. ఈ నెల 27న ఎల్కతుర్తికి రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గులాబీ శ్రేణులకు సూచనలు, సలహాలు సైతం అందించారు.