నిజామాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వరంగల్ జిల్లా ఎల్కతుర్తి వేదికగా బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్భవించిన ఉద్యమ పార్టీ 25వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా బీఆర్ఎస్ ఈ సభను కనీవినీ ఎరుగని రీతి లో నిర్వహించనున్నది. కాంగ్రెస్ పాలనలో ఆగమైన తెలంగాణ రాష్ర్టానికి ఈ సభ దశ, దిశా నిర్దేశం చేయనున్నది.
ఆవిర్భావం నుంచి పార్టీకి అండగా నిలిచిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి వేలాదిగా కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా తరలి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో వారికోసం బీఆర్ఎస్ నాయకత్వం 5 వేల వాహనాలు ఏర్పా టు చేసింది. సభా ప్రాంగణంలో ప్రత్యేక పార్కింగ్ వసతి కల్పించింది. ఉమ్మడి జిల్లా నుంచి వెళ్లే వారి కోసం రూట్‌మ్యాప్ సిద్ధం చేయడంతో పాటు జోన్-5లో పార్కింగ్ కేటాయించింది.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని 9 నియోజకవర్గాల నుంచి ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఎల్కతుర్తి సభకు తరలి వెళ్లనున్నారు. ఇందుకోసం ఇప్పటికే 250 ఆర్టీసీ బస్సులు, 260 ప్రైవేటు బస్సులను సిద్ధం చేశారు. అలాగే, కార్లు, ఇతరత్రా వాహనాలు సైతం అందుబాటులో ఉంచా రు. నిజామాబాద్ జిల్లా నుంచి దాదాపుగా 2 వేలు, కామారెడ్డి జిల్లా నుంచి వేయి వాహనాలను సిద్ధం చేశారు. అవసరమైతే మరిన్ని వాహనాలు కూడా ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. రైతులు, మహిళలు, యువత ఎవరికి వారే ఎల్కతుర్తి సభ కోసం రెడీ అవుతున్నారు. ఉద్యమ కాలం మాదిరిగా కేసీఆర్‌ను చూసేందుకు, కేసీఆర్ సభకు హాజరయ్యేందుకు జనం సిద్ధమవుతుండడంతో బీఆర్ఎస్లో కొత్త జోష్ కనిపిస్తోంది.
సభకు తరలి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ మాజీ విప్ గంప గోవర్ధన్, బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల అధ్యక్షులు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ముజీద్దీన్, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్ గుప్తా, షకీల్ అహ్మద్, హన్మంత్ షిండే, జాజాల సురేందర్ ఇప్పటికే సన్నాహక సమావేశాలు నిర్వహించారు. శ్రేణులను సమాయత్తం చేశారు. పార్టీ శ్రేణులతో పాటు స్వచ్ఛందంగా తరలివచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఆయా నేతలు సమన్వయంతో పని చేస్తున్నారు.
హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలోని బీఆర్ఎస్ రజతోత్సవ సభా ప్రాంగణానికి సులువుగా చేరుకునేలా జోన్ల వారీగా రూట్ మ్యాప్‌లను సిద్ధం చేశారు. లక్షలాదిగా తరలి వచ్చే గులాబీ బంధుగణం కోసం ఐదు జోన్లను ఏర్పాటు చేశారు. ఆయా జోన్ల వారీగా ప్రత్యేకంగా ఐదు పార్కింగ్ జోన్లను సైతం సిద్ధం చేశారు. సభా ప్రాంగణానికి మొత్తం నాలుగు రహదారుల మీదుగా వాహనాలు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. అందులో మూడు జాతీయ రహదారులు (వరంగల్, సిద్దిపేట, కరీంనగర్) సహా సభ జరిగే చింతలపల్లికి చేరుకునేలా ధర్మసాగర్ నుంచి వచ్చే మరో రూట్‌ను కూడా సిద్ధం చేశారు. ఉమ్మడి జిల్లా నుంచి వెళ్లే వారు సిద్దిపేట జాతీయ రహదారి 765 మీదుగా సిద్దిపేట, హుస్నాబాద్, ముల్కనూర్, గోపాల్పూర్ క్రాస్ రోడ్డు, ఇందిరానగర్ మీదుగా పార్కింగ్ జోన్-5కు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.
మరో రూట్లో వేలేరు, కొత్తకొండ, ముత్తారం వైపు నుంచి పార్కింగ్ జోన్-5కు చేరుకునే అవకాశం ఉంది. మరో రూట్ కరీంనగర్ మీదుగా వచ్చే వాహనాలను కోతులనడుమ మీదుగా దారి మళ్లించుకుని గోపాల్పూర్, గోపాల్పూర్ క్రాస్ రోడ్డు, సిద్దిపేట జాతీయ రహదారి మీదుగా ఇందిరానగర్ నుంచి పార్కింగ్ జోన్-5కు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. సిద్ద్ధిపేట – హుస్నాబాద్ మార్గం నుంచి ఉమ్మడి నిజామాబాద్, మెదక్ జిల్లాలతో పాటు నిర్మల్, ఖానాపూర్, ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు, ప్రజలు వెళ్లాల్సి ఉంటుంది.