ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా పురుడుపోసుకున్న బీఆర్ఎస్ 25వ వసంతంలోకి అడుగిడింది. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా ఎల్కతుర్తి వేదికగా బీఆర్ఎస్ రజతోత్సవం ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభకు పార్టీ అధినేత, తెలంగాణ తొలిముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకాగా..రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిమంది నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. రజతోత్సవ సభ కనీవిని ఎరుగని రీతిలో విజయవంతం కావడం, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. బీఆర్ఎస్పై ప్రజలు ఎనలేని ఆదరాభిమానాలు చూపడంతో నాయకులు, కార్యకర్తల్లో సరికొత్త జోష్ కనిపిస్తున్నది. పార్టీ అధినేత ప్రసంగాన్ని ఉమ్మడి జిల్లాలోని ప్రజలు, అభిమానులు టీవీలు, మొబైల్లో ఆద్యంతం ఆసక్తిగా వీక్షించారు.
-నిజామాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
తెలంగాణ రాష్ర్టాన్ని ముందుకు తీసుకు పోవడంలో రేవంత్ రెడ్డి సర్కారు ఘోరంగా విఫలమైంది. ఇచ్చిన ఏ ఒక్కహామీని కూడా అమలుచేయకపోవడంపై సబ్బండ వర్ణాలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ పాలనతీరుపై అసహనం వ్యక్తంచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సర్కారుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జనాలు బీఆర్ఎస్ నిర్వహించిన రజతోత్సవ సభకు స్వచ్ఛందంగా తరలివచ్చి కేసీఆర్‌కు జై కొట్టారు. ఎల్కతుర్తి సభా వేదిక నుంచి కేసీఆర్ అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. అశేష జన వాహిని సాక్షిగా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కుండబద్దలు కొట్టడంతో బీఆర్ఎస్ నాయకత్వంలో జోష్ కనిపిస్తున్నది. అంచనాలకు మించి సభ విజయవంతం కావడంతో గులాబీ శ్రేణులు విజయోత్సవాలు నిర్వహించుకుంటుండగా.. కాంగ్రెస్, బీజేపీలో వణుకు మొదలైంది.
ఖలీల్‌వాడి, ఏప్రిల్ 28 : వరంగల్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేసిన పార్టీ శ్రేణులు, జిల్లా ప్రజలకు నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా కృతజ్ఞతలు తెలిపారు. రజతోత్సవ సభకు అర్బన్ నుంచి 52 బస్సులు, 252 కార్లు, 3,500మందికిపైగా కార్యకర్తలు, ప్రజలు తరలివెళ్లారని పేర్కొన్నారు. పార్టీ శ్రేణులకు భోజనం, తాగునీటితోపాటు మజ్జిగ అందించినట్లు తెలిపారు. పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని పేర్కొన్నారు.
-నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా
మోర్తాడ్, ఏప్రిల్ 28: బీఆర్ఎస్ రజతోత్సవ సభ భారీసక్సెస్ కావడం, అనుకున్న దానికన్నా ఎక్కువ జనం రావడం కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతున్నదని, అందుకే మంత్రులు, నాయకులు అడ్డగోలుగా వాగుతున్నారని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సభకు లక్షలాదిగా జనం తరలిరావడం, కేసీఆరే మళ్లీ రావాలి అంటూ నినాదాలు చేస్తూ నిండు మనసుతో మద్దతు తెలపడం చూసి జీర్ణించుకోలేని కాంగ్రెస్ నాయకులు.. ఆగమేఘాల మీద సభ సక్సెస్ కాలేదని ప్రెస్మీట్లు పెడుతూ స్వీయ ఆనందం పొందుతున్నారని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ సభ గ్రాండ్ సక్సెస్ అని అన్ని పత్రికలు, టీవీలు రాశాయని, అందులో బీఆర్ఎస్కు మద్దతు తెలపని పత్రికలు టీవీలు కూడా ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు మాత్రం కండ్లు ఉండి చూడలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 17 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్‌రెడ్డిపై వచ్చిన వ్యతిరేకత, సభకు లక్షలాదిగా తరలివచ్చిన ప్రజల్లో స్పష్టంగా కనిపించిందని, అందరూ మళ్లీ కేసీఆర్ రావాలని అంటున్నారని తెలిపారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని సభను విజయవంతం కాకుండా కుట్రలు చేయాలని చూశారని ఆరోపించారు.
ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజల నుంచి తప్పించుకోలేదని, ప్రభుత్వ వైఫల్యాలను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గ్రామాల్లో ఎక్కడికక్కడ ప్రజల పక్షాన నిలబడి నిలదీస్తారని స్పష్టం చేశారు. రజతోత్సవ సభకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని 9 నియోజకవర్గాల నుంచి 40 వేలమందికిపైగా ప్రజలు హాజరయ్యారని తెలిపారు.సభ విజయవంతానికి కృషి చేసిన పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్చార్జిలు, మండల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే వేముల కృతజ్ఞతలు తెలిపారు.
-మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి
ఖలీల్‌వాడి/నందిపేట్, ఏప్రిల్ 28: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జిల్లానుంచి సబ్బండ వర్గాలతోపాటు పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలివచ్చారని పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి పేర్కొన్నరు. వేలాదిగా తరలివచ్చిన జిల్లా ప్రజలు, సబ్బండ వర్గాలకు పార్టీ నేతలు శ్రేణులకు పాదాభివందనాలు అని, రజతోత్సవ సభ విజయవంతంలో భాగస్వాములైన వారందరికి ధన్యవాదాలు తెలిపారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభలో విస్కీ బాటిళ్లే కనిపించాయని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ చేసిన వ్యాఖ్యలపై జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు విస్కీ బాటిళ్లా ?, సభా ప్రాంగణమంతా ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిన లక్షలాది మంది ప్రజలు కనిపించలేదా ? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ సభ సక్సెస్‌పై కాంగ్రెస్‌కు ఎందుకంత అక్కసు ? అని మండిపడ్డారు. పీసీసీ చీఫ్ వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పాలన చేతకాక విపక్షంపై నోరు పారేసుకుంటున్నారని, సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ను విమర్శించే స్థాయి లేదని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ అని సంతోషం వ్యక్తం చేశారు. సభ జరగకుండా సర్కారు పెద్దలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా సబ్బండ వర్గాలు, బీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చి గులాబీ జెండా పవర్ చూపించాయన్నారు. ఎన్నికలెప్పుడు జరిగినా ఇందిరమ్మ హింసా రాజ్యానికి ప్రజలు చరమగీతం పాడడం, ముచ్చటగా మూడోసారి కేసీఆర్ సంక్షేమ రాజ్యానికి స్వాగతం పలుకడం ఖాయమని వరంగల్ సభ చాటి చెప్పిందని పేర్కొన్నారు.
-బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి
బాన్సువాడ, ఏప్రిల్ 28: కేసీఆర్‌ను మించిన నాయకుడు లేడని ప్రజలు గమనిస్తున్నారని, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ సభకు లక్షలాదిమంది స్వచ్ఛందంగా తరలివచ్చారని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనతి కాలంలోనే అట్టర్ ప్లాప్ అయ్యిందని విమర్శించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు బాన్సువాడ నియోజకవర్గం నుంచిపెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు, ప్రజలకు ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు.
సభ సక్సెస్ కోసం కృషి చేసిన పార్టీ నాయకుడు జుబేర్‌తోపాటు కార్యకర్తలను అభినందించారు. రాబోయే రోజులు బీఆర్ఎస్ పార్టీవే అని, కాబోయే సీఎం కేసీఆర్ అని బాజిరెడ్డి ధీమా వ్యక్తంచేశారు. స్వలాభం కోసం పార్టీ మారిన పోచారం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్లే మోసగాడు పోచారం శ్రీనివాసరెడ్డి అని విమర్శించారు. మళ్లీ బీఆర్ఎస్లోకి రావడానికి ప్రయత్నాలు సాగిస్తున్నాడని పలువురు అంటున్నారని, కానీ ఎట్టి పరిస్థితిల్లో ఆయనను పార్టీలోకి రానిచ్చే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. బాన్సువాడలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిలిచే వారికే భవిష్యత్తు ఉంటుందని చెప్పారు.
ఇటీవల నియోజకవర్గానికి ఎమ్మెల్సీ కవితతో కలిసి వచ్చి స్థానికంగా చేసిన అభివృద్ధి పనులు, మంజీరపై నిర్మించిన చెక్‌డ్యాంలను సందర్శించామని, అవన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు వివరించారు. పోచారం కష్టకాలంలో బీఆర్ఎస్కు మోసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన పార్టీ మారడంపై ఇతర పార్టీ నాయకులు కూడా ఇంత పెద్ద మోసమా అని జీర్ణించుకోలేకపోతున్నారని తెలిపారు. నియోజకవర్గంలో ఆయన తప్ప మరో నాయకుడిని ఎదగనివ్వలేదని విమర్శించారు.
-నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
బిచ్కుంద, ఏప్రిల్ 28: బీఆర్ఎస్ రజతోత్సవ సభను ఎలాగైనా అడ్డుకోవాలని దుష్టపన్నాగం పన్ని, రహదారులను దిగ్బంధం చేసినా పార్టీ కార్యకర్తలు,ప్రజలు తండోప తండాలుగా తరలివెళ్లి విజయవంతం చేశారని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. సోమవారం ఆయన మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో మళ్లీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమని అన్నారు. వరంగల్ సభకు పార్టీ శ్రేణులు, ప్రజలు వెళ్లకుండా ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, బెదరకుండా వారి కుట్రలను పటా పంచలు చేసి తరలివెళ్లారని తెలిపారు. రజతోత్సవ సభకు భారీగా తరలివెళ్లి విజయవంతం చేసిన జుక్కల్ నియోజక వర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
– జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే
ఖలీల్‌వాడి, ఏప్రిల్ 28: బీఆర్ఎస్ రతజోత్సవ సభ జయప్రదం కావడంపై జడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, పార్టీ నాయకులు మురళి, రాజు, శంకర్ సంతోషం వ్యక్తంచేశారు. సోమవారం వారు జిల్లాకేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభను అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ సభకు పెద్ద సంఖ్యలో విచ్చేసి, విజయవంతం చేసిన జిల్లా ప్రజలు, ఉద్యమకారులు, నాయకులు, కార్యకర్తలకు వారు కృతజ్ఞతలు తెలిపారు ఆలోచింపజేసిన అధినేత ప్రసంగం భారీ బహిరంగ సభలను నిర్వహించడంలో బీఆర్ఎస్ ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తున్నది. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకూ అనేక సభలను నిర్వహించిన చరిత్ర గులాబీ పార్టీకి ఉంది.
స్వరాష్ట్ర సాధనలో భాగంగా భారీ బహిరంగ సభలను నిర్వహిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేసిన కేసీఆర్… సరిగ్గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేతుల్లో చిక్కిన తెలంగాణను రక్షించేందుకు నడుం బిగించారు. ఏడాదిన్నర దాటుతున్నా, ఇచ్చిన హామీలను అమలు చేయలేక చతికిల పడిన హస్తం పార్టీ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రజతోత్సవ సభలో గులాబీ బాస్ ప్రసంగం ఆలోచింపజేసింది. తనదైన శైలిలో వాగ్బాణాలు సంధిస్తూనే అధికార కాంగ్రెస్, బీజేపీ తీరును ఎండగట్టారు. తెలంగాణకు కలుగుతున్న నష్టాన్ని సూటిగా ఎత్తి చూపారు. రైతుభరోసా, రుణమాఫీ, సాగు, తాగునీరు, నిరంతర విద్యుత్, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుతున్నాయా? అంటూ కేసీఆర్ ప్రశ్నించగా, సభకు హాజరైనవారితోపాటు టీవీల్లో కేసీఆర్ ప్రసంగాన్ని వీక్షిస్తున్న వారు కూడా ప్రతిస్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తిని వెళ్లగక్కారు.