నిజామాబాద్, డిసెంబర్ 17, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితికి అడుగడుగునా ప్రజాభిమానం వెల్లువెత్తింది. బీఆర్ఎస్ మద్ధతు ఇచ్చిన సర్పంచ్ అభ్యర్థులకు జనాలంతా అండగా నిలిచారు. అధికారాన్ని అడ్డం పెట్టి కాంగ్రెస్ పార్టీ కుయుక్తులకు పాల్పడినప్పటికీ గులాబీ పార్టీ నేతలకు జనం పట్టం కట్టారు. మూడు విడుతల్లో జరిగిన సర్పంచ్ పోరులో గులాబీ జోరు చూపించింది. కాంగ్రెస్ పార్టీకి ధీటుగా విజయాలను సాధించింది. బీఆర్ఎస్ మద్ధతుదారుల విజయంతో కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా కుంగుబాటుకు గురైంది. జీపీ ఎన్నికల్లో ఎదురైన ఫలితాలతో వెన్నులో వణుకు పుట్టినట్లు అయ్యింది. కాంగ్రెస్ గెలిచిన చోట బీఆర్ఎస్ మద్ధతుదారులు కేవలం స్వల్ప ఓట్లతోనే ఓటమి చెందారు.
అంతటా గట్టి పోటీ ఇచ్చారు. సర్పంచ్ ఎన్నికలతో కాంగ్రెస్ పార్టీపై జనాల్లో ఉన్న వ్యతిరేకత స్పష్టమైందంటూ సర్వేలు, విశ్లేషణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. చాలా చోట్ల బీఆర్ఎస్ మద్ధతుతో అభ్యర్థులు గెలిచినప్పటికీ అవకాశవాద రాజకీయాలతో అధికార కాంగ్రెస్ నేతల బెదిరింపులకు లొంగి కండువా కప్పుకున్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలు కావడంతో గెలిచిన సర్పంచ్‌లను సులువుగా తమవైపు తిప్పుకుని సంఖ్యాబలాన్ని పెంచుకునేందుకు హస్తం పార్టీ అనేక చోట్ల పాకులాడింది. అనేక చోట్ల అధికార పార్టీ నేతల బెదిరింపులకు, డబ్బుల ఆశకు లొంగకుండా గులాబీ కండువా కప్పుకుని ధీటైన జవాబును ఇచ్చారు.
కనిపించని బీజేపీ…
కేంద్రంలో అధికారం చలాయిస్తోన్న భారతీయ జనతా పార్టీ జాడ కనిపించలేదు. మూడు విడతల్లోనూ అక్కడక్కడ పదుల సంఖ్యలోనే మద్ధతుదారులను గెలిపించుకుంది. కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలతో చేతులు కలిపి ఏకగ్రీవాలకు సపోర్ట్ చేసినట్లుగా ఆరోపణలు వినిపించాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 9 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ మద్ధతుదారులకు వచ్చిన ఓట్లతో జాతీయ పార్టీలు రెండూ కంగుతినాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రజల నుంచి వస్తోన్న మద్ధతును చూసి అవాక్కు అయ్యాయి.
బీజేపీ పార్టీ గ్రాఫ్ అమాంతం పడిపోవడంతో కమలం పార్టీలో నిస్తేజం అలుముకుంది. బీఆర్ఎస్ మద్ధతుదారులు చాలా చోట్ల విజయం సాధించడంతో గులాబీ శ్రేణుల్లో కొంగొత్త జోష్ కనిపిస్తోంది. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ గుర్తుతో అత్యధిక స్థానాలు గెలిచి సత్తా చాటేందుకు బీఆర్ఎస్ సిద్ధం అవుతోంది. ఎన్నికల్లో విజయం సాధించిన చోట్ల కాంగ్రెస్ పార్టీకి చెందిన సానుభూతిపరులు, నేతలంతా అధికార దర్పాన్ని ప్రదర్శించారు. ఎల్లారెడ్డి మండలం సోమారిపేట గ్రామంలో కాంగ్రెస్ నేతల అరాచకమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. పలు చోట్ల వార్డు మెంబర్లను, సర్పంచ్‌గా గెలిచిన బీఆర్ఎస్ మద్ధతుదారులను భయభ్రాంతులకు గురి చేసిన ఘటనలు వెలుగు చూశాయి. ఉప సర్పంచ్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఆశాజనకమైన స్థానాలతో ముందంజలో నిలిచింది. సర్పంచ్‌గా కాంగ్రెస్ మద్ధతుదారులు గెలిచిన చోట ఉప సర్పంచ్‌లను బీఆర్ఎస్ పార్టీ మద్ధతుదారులే విజయం సాధించారు.