పోతంగల్ ఆగస్టు 17 : కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి–షాదీ ముబారక్ పథకాలను నీరుగార్చేందుకు కుట్ర చేస్తోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు నిజామాబాద్ జిల్లా పొతంగల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న పథకాలను ఎలాంటి కోతలు, ఆంక్షలు లేకుండా యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా స్థానిక బీఆర్ఎస్ నాయకుడు సుధం నవీన్ మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కల్యాణ లక్ష్మీ–షాదీ ముబారక్ పథకాలను అమలు చేశారని తెలిపారు.
పథకం ద్వారా వేలాది నిరుపేద కుటుంబాలకు ప్రయోజనం చేకూరిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తులం బంగారం హామీని వెంటనే అమలు చేయాలని, కల్యాణ లక్ష్మి–షాదీ ముబారక్ పథకాలకు నిధులు సకాలంలో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పేదల సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే ప్రజల తరఫున మరిన్ని ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆరిఫ్, ఎజాజ్, సాగర్, సుదం సాయిలు, సిద్ధప్ప, బిక్య నాయక్, పట్నం సాయిలు, ప్రవీణ్, రాములు, అఫ్రోజ్, రసూల్,ఇబ్రహీం, సింహాద్రి, ఇమ్రాన్, ఖలీల్ , మహిళ లు పాల్గొన్నారు.