మోర్తాడ్, జనవరి 28: ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి రైతులు మోస పోయారు. రైతుభరోసా కింద రూ.15వేలు ఇస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు రూ.12వేలు మాత్రమే ఇస్తామని చెప్పి రైతులను వంచించారు. జిల్లాలో అరకొర మంది రైతులకు రుణమాఫీ చేసి రైతాంగాన్ని విస్మరించారని రైతులు మం డిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదికాలంగా వ్యవసాయరంగాన్ని నిర్లక్ష్యం చేయడంతో రైతులు ఆగమాగమవుతున్నారు. ఓ వైపు బ్యాంకర్ల వేధింపులు, మరోవైపు సాగుకు సకాలంలో పంటపెట్టుబడి సాయం అందక నానా కష్టాలు పడుతున్నారు.
వ్యవసాయం భారమై, సర్కారు చేయూత కరువై రైతులు ఉమ్మడి జిల్లా లో బలవన్మరణాలకు పాల్పడుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం, సాయం అందక ఆవేదన చెందుతున్న అన్నదాతలకు బీఆర్ఎస్ రైతు అధ్యయన కమిటీ అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. రైతు ఆత్మహత్యలు, వ్యవసాయ సంక్షోభంపై మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన రైతు అధ్యయన కమిటీ ఈ నెల 25న నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్‌లో పర్యటించింది. రైతులతో ముఖాముఖి ఏర్పాటు చేసి వారి కష్ట, నష్టాలను తెలుసుకున్నది. అండగా ఉంటామని భరోసా ఇచ్చి, బాధిత కుటుంబాల్లో ఆత్మైస్థెర్యం నింపింది. రైతుల పక్షాన పోరాడుతామని, రైతాంగం సమస్యలను పరిష్కరించేవరకూ రేవంత్ సర్కార్‌ను వదిలిపెట్టే ప్రసక్తేలేదని కమిటీ సభ్యులు స్పష్టం చేశారు.
సర్పంచ్ ఎన్నికల్లో బుద్ధి చెప్తాం..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రూ. రెండు లక్షల రుణమాఫీ చేస్తానని రేవంత్‌రెడ్డి గద్దెనెక్కిండు. కానీ రుణమాఫీ అందరికీ చేయలే. ఆయనను నమ్మిన రైతులు అప్పులు కట్టలేక ఆత్మహత్య చేసుకుంటున్నరు. ఇచ్చిన మాట నిలబెట్టుకోక తప్పుచేశాడు. వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో రైతులందరం కలిసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతాం.
-అనిల్, రైతు, సావెల్
రేవంత్‌రెడ్డిది పూటకోమాట..
సీఎం రేవంత్‌రెడ్డి పూటకోమాట చెబుతున్నారు. ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. ఓట్లు పడేదక ఒక మాట, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకోమాట మాట్లాడుతూ తప్పించుకొని తిరుగుతున్నరు. త్వరలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కచ్చితంగా గుణపాఠం చెబుతాం.
– రాము, బాల్కొండ
కేసీఆర్ సర్కార్ కంటికి రెప్పల కాపాడుకున్నది..
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుల ఆత్మహత్యలు లేకుండే. రైతులను కంటికి రెప్పలా కాపాడుకున్నరు. రైతుల అవసరాలను తెలుసుకొని ముందే అన్ని సౌకర్యాలు కల్పించారు. కరెంటు, ఎరువులు, రైతుబంధు డబ్బులు సమయానికి అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏ ఒక్కటి కూడా మంచి చేయడంలేదు. వ్యవసాయరంగాన్నే పట్టించుకుంటలేదు.
– ఉమాశంకర్, రైతు, కొత్తపల్లి
బ్యాంకులో మాకెంత రుణముంటే మీకెందుకు?
మోర్తాడ్, జనవరి 28: బ్యాంకులో నాకు రూ. 4లక్షల రుణం ఉన్నది. మాకు ఎంతలోన్ ఉంటే మీకెందుకు.. మీరు చేస్తమన్న రూ. రెండులక్షల రుణమాఫీ చేయండి. రూ. రెండులక్షల కన్నా ఎక్కువున్నదని కట్టుకోమంటూ మీరెందుకు చెబుతున్నరు. మీరు ఇస్తానన్న రూ. రెండులక్షలు ఇచ్చేస్తే మిగతా బాకీ సంగతి మేము, బ్యాంకు వాళ్లం చూసుకుంటం. ఇచ్చుడు చేతగాకపోతే కేసీఆర్లెక్క రూ. లక్ష అందరికిచ్చినా సంతోషపడుతుండిరి.
– రెంజర్ల మహేందర్, రైతు, కమ్మర్పల్లి
రైతుబంధు ఎగ్గొట్టిండ్రు..
కేసీఆర్ సారు ఉన్నప్పుడు రైతుబంధు అస్తుండే. ఎరువులకు, కూలీలకు, ఖర్చులకు సరిపోతుండే. కాంగ్రెసోళ్లు అచ్చుడుతోటి ఎగ్గొట్టిండ్రు. ఇప్పుడు రైతుబంధు రాక సేటు దగ్గరికి పొయి బాకీ తెచ్చుకుంటున్నం. పండించిన పంట ఈన్నే అమ్మాలంటుండ్రు. పండించినంక పోతే పంట మంచిగ లేదని ధర తక్కువ ఇస్తుండ్రు. అదే రైతుబంధు అస్తే బాకీ తెచ్చుకోకపోతుంటిమి కదా?
– మనోహర్‌రెడ్డి, రైతు, మోతె, వేల్పూర్ మండలం
గతంలో రైతులకు అన్ని సౌకర్యాలుండేవి
బీఆర్ఎస్ హయాంలో పంట మొదలుపెట్టే సమయంలోనే అన్ని సౌకర్యాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచేది. పంట మొదలు పెట్టే సమయం నుంచి పంట కోతకు వచ్చే వరకు అధికారులు అందుబాటులో ఉంటూ సలహాలు, సూచనలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అధికారులెవరూ పట్టించుకోవడంలేదు.
-కన్న పోశెట్టి, బాల్కొండ
మళ్లీ కరెంట్ కష్టాలు మొదలైనయ్
బాల్కొండ, జనవరి 28: పదేండ్ల కేసీఆర్ పాలనలో ఏ ఒక్కరోజు కూడా కరెంట్ కష్టాలు లేకుండే. కానీ ఇప్పుడు రేవంత్‌రెడ్డి సర్కార్ వచ్చాక కరెంట్ సరిగా ఉంటలేదు. ఏడాది నుంచి ఇబ్బందులుపడుతున్నం. ఎప్పుడు పోతదో తెలియని పరిస్థితి. కేసీఆర్ ప్రభుత్వానికి ముందు తెలంగాణ ఎట్ల ఉండేనో..ఇప్పుడు మళ్లీ అట్లనే మారిందని రైతులు బాధపడుతున్నారు. రానురాను ఇంకెట్లుంటదో కరెంట్ పరిస్థితి.
– ఫయాజ్, బాల్కొండ
కాంగ్రెస్ సర్కార్‌కు బుద్ధి చెబుతాం
కాంగ్రెస్ చేసిన మోసపూరిత వాగ్దానాలకు ఆకర్షితులై కేసీఆర్‌ను వద్దనుకున్నారు. ఇప్పుడు అందరూ మళ్లీ కేసీఆర్ కావాలనుకుంటున్నరు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇస్తమని హామీ ఇచ్చి రైతులను మోసం చేసింది. ఇప్పుడు వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డికి అందరం కలిసి బుద్ధి చెప్తాం.
-ప్రసాద్, రైతు, బాల్కొండ
ఏక కాలంలో రుణమాఫీ చేయాలి
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రైతులందరికీ ఏకకాలంలో రుణమాఫీ చేయాలి. రుణమాఫీ కూడా బ్యాంకులో ఎంత లోన్ ఉన్నా సంబంధం లేకుండా రూ. రెండు లక్షల రుణమాఫీ చేయాలి. ఎన్నికల్లో రైతులకిచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి.
– ఎనుగందుల శ్రీనివాస్, రైతు, ఇత్వార్‌పేట్, బాల్కొండ మండలం
కేసీఆర్ కంటికి రెప్పలాగా కాపాడిండు
కేసీఆర్ సారు రైతును కంటికి రెప్పలా కాపు కాసిండు. ఠంచన్‌గా రైతుబంధు డబ్బులు అందుతుండే. వ్యవసాయానికి నిరంతరంగా కరెంట్, ఎరువులు కూడా సకాలంలో ఇచ్చిండు.
-కుమ్మరి సాయన్న, రైతు, బుస్సాపూర్