ఖలీల్‌వాడి, జూన్ 28: జిల్లాకు మంజూరైన పసుపు బోర్డును ఎన్నిసార్లు ప్రారంభిస్తారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ఇదివరకే రెండుసార్లు ప్రారంభించారని, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముచ్చటగా మూడోసారి ఆదివారం ప్రారంభించనున్నారని తెలిపారు. పసుపు బోర్డు ప్రారంభోత్సవంపై ఆమె శనివారం మాట్లాడారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పసుపు బోర్డుకు చట్టబద్ధత కల్పించాలన్నారు.
ఇప్పటికే పసుపు బోర్డును ప్రారంభించిన విషయం నిజామాబాద్ ఎంపీ అర్వింద్.. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు చెప్పకపోయి ఉండవచ్చన్నారు. పసుపు క్వింటాలుకు రూ.15వేల మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. పసుపు బోర్డుకు చట్టబద్ధత లేనందునే బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. పసుపునకు మద్దతు ధర విషయంలో అమిత్‌షా స్పష్టత ఇచ్చి రైతులు సంతోషపడేలా చేయాలని కోరారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్రం పాస్ చేయాలన్నారు. విద్యార్థులు, యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.