ఖలీల్‌వాడి, ఫిబ్రవరి 8 : రెండున్నర సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన తప్ప, చేసింది ఏమీలేదని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అన్నారు. నిజామాబాద్ నగరం మురికి కూపంగా తయారైందని మండిపడ్డారు.
ఆదివారం ఆయన జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ర్టాభివృద్ధిని పక్కనబెట్టి సీఎం రేవంత్‌రెడ్డి తన బావ మరిదిపై ఆరోపణలు వస్తే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, సంతోష్‌రావును విచారణ పేరిట ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. కల్యాణలక్ష్మి ద్వారా పేద ఆడబిడ్డలకు అండగా నిలిచిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు.
నిజామాబాద్ పర్యటనకు వచ్చిన రేవంత్‌రెడ్డి మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలకు ఎన్ని కోట్ల నిధులు మంజూరు చేశారో చెప్పాలని రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ డిమాండ్ చేశారు. నిధులపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిధులు తీసుకువచ్చి జిల్లాను అభివృద్ధి చేశామని తెలిపారు. నూతన కలెక్టరేట్, ఐటీ హబ్, కళాభారతి నిర్మాణాలు చేపట్టినట్లు వివరించారు.
రెండున్నరేండ్లలో రూ. 3లక్షల కోట్లు అప్పు తీసుకువచ్చి ఏం చేశారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కల్యాణలక్ష్మి ద్వారా ఇప్పటివరకూ తులం బంగారం ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రపంచంలోనే నంబర్ వన్ లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజక్టును కట్టిన ఘనత తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు.
-రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
తెలంగాణ జాతిపిత బరాబర్ కేసీఆరేనని, సీఎం రేవంత్‌రెడ్డి రోత వ్యాఖ్య లు ఆంధ్రోళ్లను ఆనందపర్చేలా, తెలంగాణ సమాజాన్ని గాయపర్చే లా ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. సర్కా ర్ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ డైవర్షన్ పోలిటిక్స్ చేస్తున్నదని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగేది కాదన్నారు.
ఆయనపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తెలంగాణ ప్రజలే రేవంత్ నాలుక చీరేస్తారని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి బూత్, రోత భాషను ప్రజలంతా అసహ్యించుకుంటున్నారని తెలిపారు. హామీల అమలును ప్రశ్నిస్తే రేవంత్‌రెడ్డికి అసహనం పొడుచుకొస్తున్నదని మండిపడ్డారు. అన్ని మున్సిపాలిటీలతోపాటూ కార్పొరేషన్లో కూడా గులాబీ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు నీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, జగన్, సుజిత్‌సింగ్ ఠాకూర్, సత్యప్రకాశ్, జగత్‌రెడ్డి, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
ఖలీల్‌వాడి, ఫిబ్రవరి 8 : రెండున్నరేండ్లలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ నగరానికి చేసిందేమీ లేదని అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అన్నారు. నగరాన్ని అంధకారంగా మార్చారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నగరంలో రోడ్లను నిర్మించినట్లు తెలిపారు. ఆదివారం ఆయన నగరంలోని పలు డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాలనీల్లో వీధి దీపాలు లేవని ఎమ్మెల్యే ధన్పాల్ వద్దకు వెళ్తే, తన పార్టీ అధికారంలోలేదని, ఇంటికి రూ. 500 వేసుకుని పెట్టుకోండని సమాధానం ఇస్తున్నారని మండిపడ్డారు. నగరంలో 25 కిలోమీటర్ల సెంట్రల్ లైటింగ్ తన హయాంలో వేసినట్లు తెలిపారు. ధన్పాల్ చేతగానితనంతో నగరాన్ని అంధకారం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో 20, 44,47వ డివిజన్ల అభ్యర్థులు శ్రీలతా నివాస్, నీలగిరి రాజు, ఉల్లెంగ భూపతి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.