మాక్లూర్, డిసెంబర్ 12 : బీఆర్ఎస్ అంటే వికాస్ అని, బీజేపీ, కాంగ్రెస్ అంటే బక్వాస్ అని బీఆర్ఎస్పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులనే గెలిపించాలని కోరుతూ జీవన్‌రెడ్డి శుక్రవారం మాక్లూర్‌లో పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మాట్లాడారు.ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి వినయ్‌కుమార్‌రెడ్డి (పీవీఆర్) కు అవినీతి తప్ప అభివృద్ధి పట్టదన్నారు.
స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డికి తెలంగాణ అనే మాటే గిట్టదని విమర్శించారు. దొందుదొందే అని, ఆర్మూర్ నియోజకవర్గానికి పట్టిన అష్ట దరిద్రాలని, ఒకరు బ్రోకర్ కాగా మరొకరు జోకర్ అని ఎద్దేవా చేశారు. రెండేండ్లు గడిచినా ఇచ్చిన హామీ లు అమలు చేయకుండా మళ్లీ ఓట్లు అడగడానికి ఏ మొహం పెట్టుకుని వచ్చారంటూ ప్రతి గ్రామంలో ప్రజలు కాంగ్రెస్ నేతల గల్లాలు పట్టి నిలదీయాలని పిలుపునిచ్చారు.
రేవంత్ పాలన అట్టర్ ప్లాప్ కాగా కాంగ్రెస్ గ్రాఫ్ పూర్తిగా అడుగంటిపోయిందన్నారు. కాంగ్రెస్ సాగిస్తున్నది ప్రజాపాలన కాదని, పిచ్చి తుగ్లక్ పాలన అని జీవన్‌రెడ్డి మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యమంటే మీ ఇష్టారాజ్యమా ? మీరు ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ అయినా అమలు జరిగిందా ? అని ఆయన నిలదీశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద ఒక్కరికైనా తులం బంగారం ఇచ్చారా అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ఏ ఊరికి పోదామో చెప్పాలని, పీసీసీ చీఫ్ సొంతూరుకు పోదామా ? హామీలన్ని అమలు జరిగాయని ప్రజలు చెబితే తాను ఏ శిక్షకైనా సిద్ధమని, అమలు జరగలేదని చెబితే కాంగ్రెస్ నేతలు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెబుతారా ? అని సవాల్ విసిరారు. ఆర్మూర్ తుగ్లక్ రాకేశ్‌రెడ్డి, నిజామాబాద్ జిల్లా తుగ్లక్ అర్వింద్ అని విమర్శించారు.
కేసీఆర్ మళ్లీ సీఎం అయితేనే తెలంగాణకు స్వర్ణయుగమని అన్ని గ్రామాల ప్రజలకు అర్థమైందన్నారు. కాంగ్రెస్ పాలన, రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 13 హామీలు, 420 వాగ్దానాలు, మహిళలకు నెలకు రూ.2500, తులం బంగారం బోగస్ అని, అసలు కాం గ్రెస్సే అతి పెద్ద బోగస్ అని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలోనే మాక్లూర్ అభివృద్ధి జరిగిందన్నారు. కేసీఆర్ ఇచ్చిన నిధులతోనే గుడి, బడి కట్టుకున్నామని తెలిపారు. రూ.5. 70 కోట్లతో ప్రభుత్వ పాఠశాల నిర్మించినట్లు చెప్పారు.
భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన నీటి సరఫరా జరుగుతోందన్నారు. అన్ని కులసంఘాల భవనాలకు నిధులు విడుదల చేసినట్లు గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేండ్లలోనే ఇవన్నీ కనుమరుగై గ్రామాలన్ని కళ తప్పాయన్నారు. కేసీఆర్ హయాంలో ప్రతి ఇంట్లో సంక్షేమం, ప్రతి కంట్లో సంతోషం కనిపించిందని, ఇప్పుడు ఎక్కడ చూసినా విషాదమే కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులనే గెలిపించాలని జీవన్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.