సారంగాపూర్, మే 14: ఎంపీగా తాను భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నట్లు బీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ధీమా వ్యక్తంచేశారు. నిజామాబాద్‌లోని తన నివాస ప్రాంగణంలో రూరల్ నియోజకవర్గంలోని నిజామాబాద్, మోపాల్, డిచ్పల్లి, ధర్పల్లి, ఇందల్వాయి, జక్రాన్‌పల్లి, సిరికొండ మండలాలకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం బాజిరెడ్డి గోవర్ధన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియ ఎలా జరిగిందన్న విషయమై బాజిరెడ్డి గోవర్ధన్ మండలాల వారీగా సమీక్షించారు. గ్రామాల వారీగా ఓట్ల వివరాలతోపాటు తమకు అనుకూలంగా పోలైన ఓట్ల అంచనా వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాజిరెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు రాత్రింబవళ్లు శ్రమించి తన విజయసాధన కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించారన్నారు. బీఆర్ఎస్ శ్రేణులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
\అబద్ధపు మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలను అమలుపర్చడంలో పూర్తిగా విఫలమైందన్న విషయాలను ఇంటింటా వెళ్లి ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేయడంలో బీఆర్ఎస్ శ్రేణులు సఫలీకృతులయ్యారని తెలిపారు. బస్సు యాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు అనుసరించిన ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టారని, ఫలితంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపిందన్నారు. భవిష్యత్తులో తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ శ్రేణులందరికీ ఎల్లప్పుడూ అండగా ఉంటానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో కొందరు నాయకులు స్వార్థంతో కాంగ్రెస్, బీజేపీలోకి వెళ్లడం సరికాదన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఈగ సంజీవ్‌రెడ్డి, బాజిరెడ్డి జగన్, మీసాల మధుకర్‌రావు, బొల్లెంక గోపాల్‌రెడ్డి, ప్రేమ్‌దాస్, అన్నం సాయిలు, శ్రీనివాస్‌రావు, ముత్యంరెడ్డి, రాము, శక్కరికొండ కృష్ణ, దాసరి లక్ష్మీనర్సయ్య, హన్మంత్‌రెడ్డి, రమేశ్‌నాయక్, కుంచాల రాజు, నట్ట భోజన్న పాల్గొన్నారు.