మోర్తాడ్/ఖలీల్‌వాడి/ఆర్మూర్ టౌన్, డిసెంబర్ 6 : బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై కాంగ్రెస్ సర్కారు దమనకాండకు పాల్పడుతున్నది. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసనలు చేపట్టకుండా ముందస్తు పేరుతో అక్రమంగా నిర్బంధిస్తున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డి అక్రమ అరెస్టులకు నిరసనగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై శుక్రవారం నిర్వహించనున్న ధర్నా కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా నుంచి ఎవరూ వెళ్లకుండా పోలీసులతో అడ్డగించింది.
గులాబీ శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. మాజీ ప్రజాప్రతినిధులు, నేతలను అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్లకు తరలించారు. నిజామాబాద్ జడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావుని హౌస్ అరెస్టు చేశారు. ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను అరెస్టు చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన చేసే హక్కు లేకుండా చేసిన పోలీసులు, ప్రభుత్వ తీరుపై గులాబీ శ్రేణులు మండిపడ్డాయి. పోలీసు బలగాలతో ఆందోళనలు అణచాలని చూస్తే తిరుగుబాటు తప్పదని హెచ్చరించాయి.