బాన్సువాడ రూరల్/నస్రుల్లాబాద్, జనవరి 5: రైతు భరోసాపై మాట మార్చిన కాంగ్రెస్ సర్కార్‌పై రైతులు, బీఆర్ఎస్ నాయకులు భగ్గుమంటున్నారు. రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేయడం సిగ్గు చేటన్నారు. ప్రతి ఏడాది రెండు పంటలకు ఎకరాకు రూ.15వేల చొప్పున రైతులకు ఇస్తామన్న ‘రైతుబంధు ఏమాయే… ఎగ్గొట్టిన రైతుబంధు ఎప్పుడిస్తారూ సీఎం సారూ..’ అంటూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వాల్ పోస్టర్లతో వినూత్న ప్రచారం నిర్వహించారు.
ఆదివారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బోర్లం, నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో రైతులకు కాంగ్రెస్ సర్కారు చేసిన మోసాలను వివరిస్తూ ఇంటింటికీ గోడ పత్రులను అంటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ. 15వేలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులు, ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మోచి గణేశ్, మమ్మాయి లక్ష్మణ్, మన్నె అనిల్, శివ, సూరి, రాజ్‌కుమార్, దిలీప్, రమేశ్, సాయి, హన్మాండ్లు, రజినీకాంత్, రాజశేఖర్, నర్సింహులు గౌడ్, సాయిలు పాల్గొన్నారు.