సిటీబ్యూరో, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్ ఇన్చార్జ్ డైరెక్టర్‌గా నిమ్స్ వైద్యుడిని నియమించడంపై ఆ దవాఖాన వైద్యులు, సిబ్బంది భగ్గుమంటున్నారు. ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖాన ఉస్మానియా వైద్య కళాశాల పరిధిలోని పూర్తిస్థాయి ప్రభుత్వ దవాఖాన అని, ఇక్కడ దాదాపు 15 నుంచి 20 ఏండ్లుగా పనిచేస్తున్న సీనియర్ ప్రొఫెసర్లు ఉన్నారని, వారిపై సెమీ గవర్నమెంట్ సంస్థ అయిన నిమ్స్‌కు చెందిన జూనియర్ స్థాయి వైద్యుడిని డైరెక్టర్‌గా ఎలా నియమిస్తారని ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ దశబ్దాలుగా సేవలందిస్తున్న సీనియర్ ప్రొఫెసర్లు, విభాగాధిపతులు ఉండగా వారి సీనియార్టీ, అనుభవాన్ని పక్కన పెట్టి, బయటి సంస్థకు చెందిన వైద్యుడిని తమ సంస్థకు డైరెక్టర్‌గా నియమించడం తమను అవమానించినట్లేనని ఎంఎన్‌జే వైద్య సిబ్బంది తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎంఎన్‌జే డైరెక్టర్‌గా నిమ్స్ అంకాలజీ ప్రొఫెసర్ డా.సదాశివుడిని నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం రాత్రి జారీచేసిన ఉత్తర్వులను ఖండిస్తూ ఎంఎన్‌జే వైద్యాధికారులు, సిబ్బంది శనివారం దవాఖానలో కొంత సేపు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంస్థ పరిపాలన, వైద్య సేవలు, వైద్య విద్య, పరిశోధన తదితర కార్యక్రమాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉన్న ఎంఎన్‌జే సీనియర్లను విస్మరించడం తమ మనోభావాలను దెబ్బతీసే చర్యగా భావిస్తున్నట్లు వైద్య సిబ్బంది వాపోయారు. నిమ్స్ సంస్థ అన్నా, అక్కడి వైద్యాధికారులన్నా తమకు పూర్తి స్థాయి గౌరవం ఉందని అయితే తమ సంస్థలో ఏండ్ల తరబడి సీనియార్టీ ఉన్న అధికారులను కాదని ఇతరులను నియమించడం వల్ల తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వాపోయారు.
ఎంఎన్‌జే దవాఖాన అక్కమార్కులకు అడ్డాగా మారింది. కొందరు అక్రమార్కులు దవాఖానకు వచ్చే నిధులను నొకేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మందుల కొనుగోళ్లు తదితర అంశాల్లో కొందరు ఇంటి దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తున్నది. ఓ ఇంటి దొంగ ఎంఎన్‌జేను హస్తగతం చేసుకునే క్రమంలో తన లలిత కళలను ప్రదర్శిస్తూ ..నిమ్స్ వైద్యుడిని ఇన్చార్జ్ డైరెక్టర్‌గా నియమించడంలో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. నిబద్ధతతో రోగులకు సేవలందించే నిమ్స్ అంకాలజీ వైద్యుడిని పావులా వాడుకుంటూ తన పబ్బం గడుపుకొనేందుకు స్కెచ్ వేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్వలాభం కోసం సొంత సంస్థకు చెందిన సిబ్బందిని వెన్నుపోటు పొడిచి ఇతర సంస్థకు చెందిన వ్యక్తిని ఎంఎన్‌జేకు ఇన్చార్జ్ డైరెక్టర్‌గా తీసుకువచ్చే ప్ర యత్నం చేస్తున్నట్లు సిబ్బంది మండిపడుతున్నారు. ఇతరులను అడ్డుపెట్టుకుని చక్రం తి ప్పుతానంటే ఊరుకునేది లేదని ఎంఎన్‌జే సిబ్బంది ఇంటిదొంగను ఘాటుగానే హెచ్చరించారు. ఎంఎన్‌జే డైరెక్టర్ నియామకంపై ప్రభుత్వం పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు.