వేల్పూర్, మార్చి 25: వరంగల్ డిక్లరేషన్ పేరిట ఎన్నికలకు ముందు అన్నదాతలకు ఎన్నో హామీలిచ్చి వాటిని అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ రైతు విభాగం నాయకులు అన్నారు. రైతాంగానికి ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం వేల్పూ ర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో బీఆర్ఎస్ రైతు నాయకులు నాగంపేట్ శేఖర్‌రెడ్డి, బద్దం నర్సారెడ్డి, ప్రతాప్‌రెడ్డి, రాజారెడ్డి విలేకరులతో మాట్లాడారు. రైతు డిక్లరేషన్ పేరిట అన్నదాతల ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రెండున్నరేండ్లలో రైతాంగాన్ని దారుణంగా మోసగించిందన్నారు.
మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టిన రేవంత్ సర్కారు.. రైతులకు, వ్యవసాయ రంగానికి తగిన న్యాయం చేయలేదన్నారు. అంకెల గారడీ చేస్తూ అన్నదాతలను బురిడీ కొట్టిస్తున్నదన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. సుమారు రూ.47 వేల కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉంటుందని లెక్కలు వేసి, చివరికి రూ.17 వేల కోట్లు మాత్రమే చేసి చేతులు దులుపుకుందన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు కింద రూ.10 వేలే ఇస్తోంది. మేము అధికారంలోకి వచ్చాక రైతుభరోసా కింద రూ.15 వేలు ఇస్తామన్న రేవంత్‌రెడ్డి.. మూడుసార్లు ఇవ్వకుండా ఎగ్గొట్టారని మండిపడ్డారు. బడ్జెట్లో నిధులు కేటాయించడమే తప్పితే రైతులకు రైతుభరోసా ఇవ్వడం లేదన్నారు. అన్ని పంటలకు బోనస్ అని చెప్పి, ప్రతి పంటకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ కేవలం సన్నవడ్లకు మాత్రమే బోనస్ అని చెప్పి రాష్ట్రంలో అత్యధికంగా దొడ్డు వడ్లు పండించే వరి రైతన్నలను తీరని మోసం చేసిందన్నారు. సన్న వడ్లు పండించిన వారికీ సైతం బోనస్ ఎగ్గొట్టారన్నారు.
పంటల బీమాను అందుబాటులోకి తెస్తామని చెప్పి దాన్నీ పట్టించుకోలేదన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ పనులకు అనుసంధానం చేస్తామని చెప్పి, దాన్ని కూడా అటకెక్కించారన్నారు. పోడు భూముల రైతులకు, అసైన్డ్ భూమి కలిగిన రైతులకు పట్టా భూములతో సమానంగా అన్ని యాజమాన్య హక్కులు ఇస్తామని చెప్పి ఇప్పటివరకూ ఒక్కమాట మాట్లాడలేదని విమర్శించారు. ధరణి రద్దు చేసి భూ వివాదాలు తీరుస్తామని చెప్పి ఇప్పుడు సరికొత్త రెవెన్యూ వ్యవస్థ పేరిట 22 లక్షల భూముల నిషేధిత జాబితాను కోటి ఎకరాలకు పెంచి అనేక భూ అక్రమాలకు పాల్పడుతున్నదన్నారు.
గతంలో బీఆర్ఎస్ హయాంలో నకిలీ విత్తనాలు, నకిలీ పురుగుల మందులపై, దానికి కారణమైన వ్యక్తులపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేశారని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అదేమీ చేయడం లేదన్నారు. దీంతో నకిలీ విత్తనాల వ్యాపారులు మరింత రెచ్చిపోతున్నారన్నారు. ప్రతి ఎకరాకు సాగునీరందించేలా ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పి ఇప్పటిదాకా అదనంగా ఒక్క ఎకరాకూ నీళ్లు ఇవ్వలేదన్నారు. రైతుబీమా పథకాన్ని కొనసాగిస్తామని చెప్పి, ఈ బడ్జెట్లో ఒక్క రూపాయీ కేటాయించకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. కౌలు రైతులకూ ఏటా రూ.15 వేల రైతు భరోసా ఇస్తామని చెప్పినా, ఇప్పటివరకూ ఏ ఒక్కరికీ ఆర్థిక సాయం చేయలేదన్నారు.
వ్యవసాయ రంగానికి భారీగా బడ్జెట్ కేటాయించాల్సిన చోట ప్రతి బడ్జెట్లో కోత విధిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 800 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం వంటి పెండింగ్ ప్రాజెక్టుల నిధుల కేటాయింపులో మొండిచేయి చూపించారన్నారు. కాంగ్రెస్ చెప్పిన ‘అభయ హస్తం’ ఇప్పుడు రైతన్నల పాలిట ‘రిక్త హస్తం’గా మారిందని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు జాగిరపు మోహన్‌రెడ్డి, ఏలేటి రమేశ్‌రెడ్డి, లింబారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, బుస్సాపూర్ గంగారెడ్డి, ఎల్కటూర్ గంగారెడ్డి, మిట్టాపల్లి మహిపాల్ పాల్గొన్నారు.