మోర్తాడ్, జూన్ 22: ఎవరో ఆందోళనకు పిలుపునిస్తే.. వారిని కాకుండా బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా నిర్బంధించి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. తెల్లవారుజామున ముందస్తు అరెస్టు చేసి పోలీసుస్టేషన్లకు తరలించారు. యూరియా యాప్‌ను రద్దు చేయాలని, నిరంతర విద్యుత్ సరాఫరా చేయాలని డిమాండ్ చేస్తూ కమ్మర్‌పల్లిలో సోమవారం రాస్తారోకో చేపట్టాలని ఉప్లూర్ గ్రామకమిటీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈవిషయం తెలుసుకున్న పోలీసులు సోమవారం తెల్లవారు జామున ఉప్లూర్‌లోని బీఆర్ఎస్ కమ్మర్పల్లి మండల అధ్యక్షుడు రేగంట దేవేందర్, రాష్ట్ర నాయకుడు బద్దం చిన్నారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మురళీ, దశరథ్, నరేశ్, అశోక్, సంతోష్‌తోపాటు మరో వ్యక్తి నవీన్‌ను ముందుస్తు అరెస్ట్ చేసి, ముప్కాల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
అక్కడి నుంచి మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో కమ్మర్పల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించగా, పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ముందస్తు అరెస్టుపై ఎస్సై సతీశ్‌తో వాగ్వాదానికి దిగారు. ఉప్లూర్ గ్రామకమిటీ రాస్తారోకో చేయాలని నిర్ణయం తీసుకుంటే, తమకేం సంబంధమని, తమను ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. అరెస్టయిన బీఆర్ఎస్ నాయకులకు మద్దతుగా కమ్మర్పల్లి నాయకులు పోలీస్‌స్టేషన్‌కు తరలివచ్చారు. చివరకు రెండుగంటల ప్రాంతంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు విడిచిపెట్టారు.
బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల కనుసన్నల్లో పోలీసులు నడుచుకుంటూ, బీఆర్ఎస్ పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకుని కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారని పార్టీ కమ్మర్పల్లి మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్ ఆరోపించారు. విడుదలైన అనంతరం ఆయన కమ్మర్‌పల్లిలో విలేకరులతో మాట్లాడారు.
ఉప్లూర్ గ్రామ రైతులు యూరియా యాప్‌తో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రభుత్వానికి నిరసన తెలియజేయడానికి సోమవారం ధర్నాకు పిలుపునిచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎలాంటి సంబంధం లేని ఉప్లూర్ బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులపై ఎన్ని కేసులు పెట్టినా భయపడబోమని స్పష్టం చేశారు.