ఆర్మూర్టౌన్, అక్టోబర్16: కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించక పోవడంతో రైతులు దళారులకు అమ్మి నష్టపోతున్నారని రైతు జేఏసీ నేత, బీఆర్ఎస్ నాయకుడు లింగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆలూరులో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. రేవంత్ సర్కారుకు రైతు సమస్యలపై చిత్తశుద్ధి లేదన్నారు. రైతులందరికీ రుణమాఫీ చేయకుండా, రైతుబంధు ఇవ్వకుండా మోసం చేసిందన్నారు.
చివరకు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర దక్కకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదని విమర్శించారు. వరికి రూ.500 బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఇప్పుడు కేవలం సన్నరకాలకే అని చెప్పడం మోసం చేయడమేనన్నారు. బోనస్ సంగతి దేవుడెరుగు ముందు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకే దిక్కు లేకుండా పోయిందని విమర్శించారు.
అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ధాన్యం తడుస్తుందనే భయంతో రైతులు తక్కువ ధరకే దళారులకు అమ్ముకుంటున్నారన్నారు. అటు మద్దతు ధర దక్కక, ఇటు బోనస్ రాక రైతులు నష్టపోతుంటే రేవంత్ ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. రైతులపై కాంగ్రెస్కు ఏమాత్రం ప్రేమ ఉన్నా వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దళారుల నుంచి రైతులను కాపాడాలని కోరారు. రైతులు సోమ ఎర్రన్న, మగ్గిడి నర్సయ్య, భూమరెడ్డి, చిన్నయ్య, శీను పాల్గొన్నారు.