స్వరాష్ట్రం కోసం మలిదశ ఉద్యమంలో పాల్గొన్నాం. ఉద్యమనేత కేసీఆర్ అడుగుజాడల్లో పనిచేశాం. అంతా అనుకున్నట్లుగానే తెలంగాణ ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకున్నాం. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి పరచడంలోనూ అంతే శ్రద్ధ వహించాం. 50ఏండ్ల సమైక్య పాలనలో జరగని అభివృద్ధిని.. బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో చేసి చూపించాం. తాగునీటి గోస తీర్చాం. రోడ్లను విస్తరించాం. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాం. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే బిగాల కృషితో ఇందూరును అభివృద్ధిలో నంబర్ వన్‌గా తీర్చిదిద్దాం. ప్రజలకు తెలుసు.. అభివృద్ధి ప్రదాతలకే పట్టం కడతారని అంటున్నారు నుడా మాజీ చైర్మన్, తెలంగాణ ఉద్యమకారుడు చామకూర ప్రభాకర్‌రెడ్డి. నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూ ఆయన మాటల్లోనే..
చామకూర ప్రభాకర్ రెడ్డి: బీఆర్ఎస్ అంటేనే అభివృద్ధి. పదేండ్లలో నిజామాబాద్ నగరం చాలా అందంగా తయారైంది. 2001 నుంచి ఉద్యమంలో ఉన్నాను. రాష్ట్రం కోసం ఎన్నో పోరాటాలు చేశాం. సీఎం కేసీఆర్ దీక్షతో తెలంగాణని సాధించుకున్నాం. సాధించుకున్నట్టే తెలంగాణతోపాటు నిజామాబాద్‌ను అభివృద్ధి చేశాం. గత ప్రభుత్వాలు చేసిందేమీ లేదు. నగరంలో చేసిన అభివృద్ధి కండ్లకు కట్టినట్లు కనబడుతున్నది. నిజామాబాద్‌కు ఐటీ హబ్ వస్తుందని కలలో కూడా ఊహించలేం. అలాంటి ఐటీ హబ్ నిజామాబాద్‌లో ఏర్పాటు చేసి 700 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. బిగాల గణేశ్ గుప్తా నిజామాబాద్ ప్రజలకు సేవా చేయాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యేగా వచ్చి నగర రూపురేఖలు మార్చారు. గత ప్రభుత్వాలు 40ఏండ్లు పాలించాయి. ఏ ప్రభుత్వమైనా ఇంత అభివృద్ధి చేసిందా? ఇందూరుని మణిమాణిక్యంగా మార్చిన ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే బిగాలకు ప్రత్యేక కృతజ్ఞతలు.
రోడ్లను విస్తరించాం. డివైడర్లు ఏర్పాటు చేసి, మధ్యలో మొక్కలు నాటి ఆహ్లాదకర వాతావరణం ఏర్పడేలా చేశాం. వీధులన్నీ ఎల్ఈడీ లైట్ల వెలుగులు విరజిమ్ముతున్నాయి. గత పాలకులు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను మధ్యలోనే వదిలేస్తే… అధికారంలోకి వచ్చిన తర్వాత బిగాల గణేశ్ గుప్తా పట్టువదలని విక్రమార్కుడిలా పనులను పూర్తిచేశారు. సీఎం కేసీఆర్ సహకారంతో నూతన సమీకృత కలెక్టర్ భవనాన్ని నిర్మించాం. మున్సిపల్ కార్యాలయం, విద్యుత్ భవన్, ఐటీ హబ్, న్యాక్ బిల్డింగ్ ఇలా ప్రభుత్వ కార్యాలయాలన్నీ సొంత భవనాల్లో ఉండేలా చేశాం. మినీట్యాంక్ బండ్, మాడ్రన్ వైకుంఠధామాలు, ఆర్యూబీ పనులను పూర్తి చేసి ట్రాఫిక్ కష్టాలను తీర్చాం.
పథకాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి చరిత్ర సృష్టించనున్నది. సంక్షేమ పథకాల్లో దేశంలోనే నంబర్ వన్ అయిన కల్యాణలక్ష్మి , షాదీముబారక్ పథకం ఏ పార్టీలకు రాని ఆలోచన. మా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వచ్చింది. ఆడబిడ్డకు రూ.లక్షా116 అందించి ఆదుకుంటున్న మహనీయుడు. రైతుబంధు ద్వారా రైతులని, దళితబంధు ద్వారా దళితులని, బీసీబంధు, మైనార్టీ బంధు ఇలా అన్నివర్గాలకూ సమన్యాయం చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీకి అర్బన్‌లో అభ్యర్థులు దొరకడంలేదని కామారెడ్డి నుంచి తీసుకువచ్చారు. బీజేపీ నామినేషన్ల ముందు అభ్యర్థులను ప్రకటించుకునే పరిస్థితి వచ్చింది. గతంలో ఓటమిపాలైన అభ్యర్థిని మళ్లీ నిలబెడుతున్నారు. బీఆర్ఎస్ మాత్రం నెలరోజుల ముందే అభ్యర్థులను ప్రకటించుకొని ప్రచారంలో దూసుకుపోతున్న దమ్మున్న పార్టీ. మా నాయకుడు దమ్మున్న నాయకుడు.
బీఆర్ఎస్కి పోటీ అనేదే లేదు. మా నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కటౌట్ ఒక్కటి చాలు. ఇతర పార్టీలు గల్లంతు అవ్వాల్సిందే. గత 50ఏండ్లలో ఇతర ప్రభుత్వాలు చేయనిది, సీఎం కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత తొమ్మిదేండ్లలో చేసి చూపించాడు. అందుకే ప్రతిపక్షాలకు భయం పుట్టింది. నీళ్లు, నిధులు ఇంటింటికీ తీసుకువచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం నిర్మించి రైతుల పొలాలకు నీళ్లను అందించి బీడు భూములను సస్యశ్యామలం చేశారు. ఒక్కసారి ఇందూరు చుట్టూ ఉన్న భూములను చూస్తే తెలుస్తుంది. గతంలో ఎట్లుండే…ఇప్పుడు ఎలా ఉన్నాయి. పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయి.
నిజామాబాద్ నగరంలో 60డివిజన్లు ఉన్నాయి. అందులో నూడా ఉన్నది. గతంలో నేను నుడా చైర్మన్‌గా పనిచేశాను. ప్రతి డివిజన్లో సీసీ రోడ్లు వేశాం. గతంలో ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకువచ్చేవాళ్లు.. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చాం. బొడ్డెమ్మ చెరువు ఇప్పుడు మినీ ట్యాంక్‌బండ్ గా తయారైంది. ప్రభుత్వ దవాఖానలో సిటీ స్కాన్, టీహబ్ ద్వారా రోగ నిర్ధారణ పరీక్షలు, క్యాథ్ ల్యాబ్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చాం. ఇలా ప్రతి రంగంలో అభివృద్ధి చేశాం. వీటన్నింటినీ చూస్తున్న ప్రజలు కేసీఆర్ అంటే మాకు, మా జీవితాలకు భరోసా అని చెబుతున్నారు.