పదేండ్లపాటు వ్యవసాయాన్ని పండుగగా చేసుకొని ఆనందంగా ఉన్న రైతన్న, ఏడాది కాలంగా కష్టాలను ఎదుర్కొంటున్నాడు. అడ్డగోలు హామీలు ఇచ్చి అన్నదాతల ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా దగా చేసింది. ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం, సాయం అందక దిగులుపడుతున్న రైతన్నలకు బీఆర్ఎస్ రైతు అధ్యయన కమిటీ అండగా ఉంటామని భరోసా ఇచ్చింది.
నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్‌లో శనివారం రైతు ఆత్మహత్యలు, వ్యవసాయ సంక్షోభంపై మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన రైతు అధ్యయన కమిటీ పర్యటన రైతుల్లో ధైర్యాన్ని నింపింది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కమిటీ సభ్యులు తెలుసుకున్నారు. ఒక్క బుస్సాపూర్ గ్రామ రైతులే కాకుండా చుట్టు పక్కల గ్రామాల నుంచి రైతులు తరలివచ్చి తమ గోడును వెళ్లబోసుకున్నారు. రైతుల పక్షాన పోరాడుతామని, రైతాంగం సమస్యలను పరిష్కరించేవరకూ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తేలేదని అధ్యయన కమిటీ స్పష్టంచేసి, కర్షకుల్లో భరోసా నింపింది.
-నిజామాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దేశంలోనే మేటిగా నిలిపేందుకు గులాబీ దళపతి కేసీఆర్ ఎంతో కృషి చేశారు. కొత్త రాష్ర్టాన్ని నంబర్ వన్‌గా తీర్చిదిద్దడంతోపాటు వ్యవసాయాన్ని పండుగలా మార్చారు. మరెక్కడా అమలు కానటువంటి రైతు అనుకూల పథకాలను తెలంగాణలో ప్రవేశ పెట్టి కేసీఆర్ చిరస్థాయిగా చరిత్రలో నిలిచి పోయారు. రైతుల నుంచి పన్నులు, సెస్సుల రూపంలో డబ్బు లు గుంజుకోవడమే ప్రభుత్వాలకు తెలుసు. కానీ దేశంలోనే తొలిసారిగా రైతులకు పెట్టుబడి సాయంగా డబ్బులు అందించి పంటల సాగును ప్రోత్సహించడం ప్రపంచంలో మరెక్కడా జరగలేదు.
అలాంటి ఆదర్శవంతమైన రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో రైతుల పరిస్థితి అయోమయంగా మారింది. ఏడాది కాంగ్రెస్ పాలనలో రైతుకు అండదండలు కోల్పోయినట్లుగా మారింది. అన్నదాతలకు గతంలో కాలికి ముల్లు గుచ్చుకున్నా… నేనున్నానంటూ కేసీఆర్ రూపంలో ధైర్యం దక్కేది. ఇప్పుడు అలాంటి అండదండలేవీ కనిపించడం లేదు. కేసీఆర్ అమలు చేసిన పెట్టుబడి సాయం రైతుబంధు పథకం పత్తా లేకుండా పోయింది. సాగుకు 24గంటల కరెంట్ ఎక్కడా కానరావడం లేదు.
సకాలంలో ఎరువులు, విత్తనాలు అందడం లేదు. పండించిన పంటలకు గిట్టుబాటు కరువైంది. రైతుల శ్రమను దోచుకునే వ్యవస్థ కాంగ్రెస్ పాలనలో పురుడు పోసుకున్నది. సంతోషంగా జీవిస్తున్న రైతుకు అనేక విధాలుగా సమస్యలు చుట్టుముడుతుండడంతో ఉరి కొయ్యకు వేలాడాల్సిన దౌర్భాగ్యం ఇప్పుడు ఏర్పడింది. దీంతో ఆత్మహత్యల పరంపర రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. ఉమ్మడి జిల్లాల్లోనూ రైతు బలవన్మరణాలు పెరుగుతున్నాయి.
రైతు ఆత్మహత్యల నివారణకు బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ముందుకు వచ్చింది. బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏర్పాటు చేశారు. ఇప్పుడీ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నది. తొలి పర్యటన ఆదిలాబాద్‌లో ఈ నెల 24న జరిగింది. రెండో పర్యటన ఈ నెల 25న బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండలం బుస్సాపూర్‌లో నిర్వహించారు. రైతులతో అధ్యయన కమిటీ సభ్యులంతా ముఖాముఖి నిర్వహించగా అద్భుతమైన స్పందన వచ్చింది. ఇందులో తమ గోడును అన్నదాతలంతా వెళ్లబోసుకున్నారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. సర్కారు మారడంతో రైతులకు అందాల్సిన సంక్షేమ పథకాలకు గ్యారెంటీ లేకుండా పోయింది. పథకాలు మంజూరు చేయకపోయినా పంట పండించేందుకు అవసరమైన విద్యుత్, నీళ్లు కూడా అందించలేని పరిస్థితి దాపురించింది. కాంగ్రెస్ ఇస్తానని చెప్పిన ఆరు గ్యారెంటీలు పత్తా లేకుండా పోయాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులకు ఏ విషయంలోనూ గ్యారెంటీ లేకుండా పోయింది. 24గంటల కరెంట్‌పైనా నమ్మకం లేదు. పంట పెట్టుబడి సాయానికి అతీగతీ లేదు.
రుణమాఫీ అందరికీ అయితదనే నమ్మకం కూడా లేదు. కాంగ్రెస్ చెప్పిన రూ.500 బోనస్ బోగస్ అని తేలిపోయింది. పంటకు మద్దతు ధర వస్తదన్న నమ్మకం లేదు. సంక్షేమ పథకాల ప్రయోజనాలు సమయానికి అందకపోవడమే రైతుల బలవన్మరణానికి కారణాలుగా నిలుస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 15 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయంలో ఏర్పడిన ఇబ్బందులు, అప్పుల బాధలతో ఏర్పడిన చిక్కుముడులకు బలి అవుతున్నారు. రైతుకు సాయం చేయాల్సిన సర్కారు మొద్దు నిద్ర పోతుండడంతో రైతులు దిక్కు లేక ఉరి తాళ్లను ఆశ్రయిస్తున్నారు.
కేసీఆర్ పాలనలో ప్రధానమైన వ్యవసాయ రంగాన్ని దశల వారీగా అద్భుతంగా తీర్చిదిద్దారు. దండుగ అని చెప్పిన సాగును పండుగలా మార్చారు. సాగునీరు, విద్యుత్‌కు ఇబ్బంది లేకుండా చూశారు. పంటకు పెట్టుబడి సాయం అందించారు. పండిన పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేశారు. వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులకు కొండంత అండగా నిలిచారు. నేడు కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత 13 నెలల్లో ఎవరూ ఊహించని విధంగా వ్యవసాయ రంగంలో పరిస్థితులు తారుమారు అయిపోయాయి. రైతుల బలవన్మరణాలు తెలంగాణలో మళ్లీ మొదలయ్యాయి. 24గంటల కరెంట్ సరఫరా జరగడం లేదు. కరెంట్ కష్టాలు వచ్చి పడుతున్నాయి. రైతుబంధుకు మంగళం పాడారు. ఏడాది క్రితం అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలపై రైతుల్లో అసంతృప్తి భగ్గుమంటున్నది.
బాల్కొండ నియోజకవర్గానికి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంతో అనేక అనుభవాలు ముడిపడి ఉన్నాయి. ఇందులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో అవినాభావ సంబంధం ఉంది. వేల్పూర్ మండలం మోతె గ్రామ మట్టిని ముడుపు కట్టి ఉద్యమ కాలంలో కేసీఆర్ చేసిన శపథం నెరవేర్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఆ ముడుపు విప్పుతానని మాటిచ్చి నిలబెట్టుకున్నారు. మెండోరా మండలం బుస్సాపూర్ గ్రామానికి ఉద్యమంతో విడదీయరాని అనుబంధం ఉంది.
రాష్ట్రం ఏర్పడక ముందు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న బుస్సాపూర్లోనే ధూం ధాం కార్యక్రమాన్ని రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సమైక్య పాలకులకు వ్యతిరేకంగా గొంతెత్తి గర్జించిన రసమయి బాలకిషన్ మరోమారు అదే తీరులో తన గొంతు విప్పి కాంగ్రెస్ పాలనపై నిరసన గళం వినిపించారు. బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ ముఖాముఖి కార్యక్రమానికి బుస్సాపూర్ వేదికగా మారడంతో ఈ విషయాన్ని స్వయంగా రసమయి బాలకిషన్ గుర్తు చేసుకోవడం స్థానిక రైతులను సంతోష పరిచింది. నాడు సమైక్య పాలనలో రైతుల దుస్థితిపై పాడిన పాటలనే తిరిగి సొంత రాష్ట్రంలో అదే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పాటలు పాడుకుంటుండడాన్ని రసమయి బాలకిషన్ తనదైన శైలిలో రైతులకు వివరించారు.
అంతే కాకుండా ఉద్యమ పాటలను, రైతుల దుస్థితికి అద్ధం పడుతున్న పలు గేయాలను ఆలపించడంతో రైతన్నలంతా చప్పట్ల వర్షం కురిపించారు. రైతుల్లో దేవుడిని చూసిన ఏకైక వ్యక్తి కేసీఆర్ అంటూ గుర్తు చేస్తూనే రైతులెవ్వరూ ఆత్మహత్యలు చేసుకోవద్దంటూ చేతులెత్తి వేడుకున్నారు. మేమున్నామంటూ సందేశాన్ని రైతులకు అందించారు. ఇలా సుమారు మూడున్నర గంటల పాటు సాగిన రైతులతో బీఆర్ఎస్ ఆత్మహత్యల అధ్యయన కమిటీ సమావేశం ప్రతి ఒక్కరినీ కూలంకషంగా ఆలోచింపజేసింది. ఏడాది పాలనకే రైతులు ఇంతగా ఆపసోపాలు పడుతుండడంపైనా ప్రతి ఒక్కరూ రేవంత్ పాలనను నిందించారు. కేసీఆర్ పాలనను గుర్తు చేసుకున్నారు.
అప్పుల బాధలకు తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ కొండంత ధైర్యాన్ని అందించింది. నిజామాబాద్ జిల్లాకు వచ్చిన నేపథ్యంలో బుస్సాపూర్ రైతు ముఖాముఖి వేదికపై నవీపేటకు చెందిన గిరిజన రైతు కేతావత్ పీర్చంద్ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించి మేమున్నామంటూ చాటి చెప్పారు. బాధిత రైతు సతీమణి కళావతితో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ భుజం తట్టి ధైర్యం నూరి పోశారు.
గుండెల నిండా దుఃఖంతో కుమిలి పోతున్న రైతు భార్యను ఓదార్చిన సమయంలో ప్రతి ఒక్కరినీ ఉద్వేగానికి గురి చేసింది. ఆత్మహత్య చేసుకున్న బాధిత కుటుంబాలతో పాటు యావత్ తెలంగాణ సమాజానికి, ముఖ్యంగా రైతాంగానికి మేం ఉన్నామనే సందేశాన్ని రైతు అధ్యయన కమిటీ కల్పించింది. ఏడాది పాలనలో కాంగ్రెస్ అనాలోచిత నిర్ణయాలతో వ్యవసాయ రం గంలో ఏర్పడిన సంక్షోభాన్ని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సాంస్కృతిక సారథి మాజీ చైర్మన్ రసమయి బాలకిషన్ తమదైన శైలిలో సర్కారుపై వాగ్బాణాలు సంధించి ఆలోచింపజేశారు.
వేల మంది అమరులై పోరాటాలు చేసి, వెలకట్టలేని త్యాగాలు చేసి రాష్ర్టాన్ని తెచ్చింది మనం సచ్చిపోయేందుకు కాదంటూ అన్నదాతల్లో ఆత్మైస్థెర్యాన్ని కమటీ నింపింది. మనం అజాగ్రత్తగా ఉండడంతోనే… దుష్ప్రచారాలు, దుష్ప్రభావాల కారణంగానే రాష్ట్రం దుర్మార్గుల చేతుల్లోకి పోయిందంటూ వాస్తవ పరిస్థితులను వారంతా వివరించారు. మనం ధైర్యం వీడకుండా బతకాలని, మన బిడ్డలకు బతికించుకోవాలంటూ గట్టి సందేశాన్ని అధ్యయన కమిటీ అందించింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో సమైక్య పాలకులపై జిద్దుగా పిడికిలి బిగించి కొట్లాడిన చందంగానే కాంగ్రెస్ పాలకులపై పోరాడాల్సిన ఆవశ్యకతను వారంతా వివరించారు.
కేసీఆర్ హయాంలో దేశంలోని చాలా రాష్ర్టాల్లో పలు కారణాలతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పటికీ తెలంగాణలో క్రమంగా రైతు ఆత్మహత్యలు తగ్గాయి. ఈ విషయాన్ని పార్లమెంట్లో మోదీ సర్కారే ప్రకటించిన విషయాన్ని నేతలు గుర్తు చేశారు. రైతులు బతకడానికి కేసీఆర్ దారి చూపించారు. కరెంట్, నీళ్లు , పెట్టుబడి సాయం, పండిన పంటలకు మార్కెట్ ధర, రైతుబీమా, పింఛన్, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ ఇచ్చారని గుర్తుచేశారు. తెలంగాణలో ఉండే ఏ కుటుంబానికైనా ప్రభుత్వ చేయూతను అందించే పరిస్థితి కేసీఆర్ హయాంలో రైతులు చూశారు. కానీ ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో కంటతడి పెట్టని కుటుంబం లేకుండా పోయింది.