pending double bedroom bills | కోటగిరి, సెప్టెంబర్ 22 : నిజామాబాద్ జిల్లా కోటగిరి లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల బిల్లు చెల్లింపులో జాప్యం జరుగుతోందని ఆరోపిస్తూ కోటగిరి లో సోమవారం బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి స్థానిక అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మోరే కిషన్, తెల్ల రవికుమార్, బీజేపీ నాయకులు ఏముల నవీన్, సీపీఐ మండల కార్యదర్శి విఠల్ గౌడ్ మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ కోసం బిల్లు కోసం పేదలు ఎన్నిసార్లు అధికారులకు అడిగిన అధికారులు స్పందించడం లేదని మండిపడ్డారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ బిల్లు చెల్లించకుండా లబ్ధిదారులను అప్పులు ఊబిలోకి నెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు సంవత్సరాలుగా బిల్లు లేక లబ్ధిదారులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉందని వాపోయారు. ఒకరి బిల్లును మరొకరికి ఇచ్చి డబుల్ బెడ్ రూమ్ బిల్లులో అవినీతికి పాల్పడ్డారని ఈ వ్యవహారం పై సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు.
కొందరు ప్రజాప్రతినిలో తమ పార్టీ అధికారం లేదని బిల్లుల కోసం వెళ్ళిన వారికి చెప్పడం పై వారు మండిపడ్డారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కొందరు ప్రజాప్రతినిధులు కేవలం 23 మందికే బిల్లులు రావాల్సి ఉందని చెప్పడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సుమారు 100 మంది వరకు లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ బిల్లు రావాల్సి ఉందని, బిల్లు ఇవ్వకుండా మాయమాటలు చెబుతున్నారని కొందరు ప్రజాప్రతినిధులు బెదిరింపులకు గురి చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో బెదిరింపులు గురి చేస్తే ఊరుకునేది లేదని, అలాంటి వారిపై కార్యచరణ చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు.
వారం రోజుల్లో బిల్లులు చెల్లించకపోతే ప్రత్యక్షంగా ఆందోళనకు పార్టీలకు అతీతంగా అందరం సిద్ధమవుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు మోరే కిషన్, తెల్ల రవికుమార్, బీజేపీ నాయకులు ఏముల నవీన్, సీపీఐ మండల నాయకులు విఠల్ గౌడ్ తో పాటు తెల్ల చిన్న అరవింద్, గంగప్రసాద్ గౌడ్, కప్ప సంతోష్, సమీర్,శంకర్ గౌడ్, మహేష్ రెడ్డి, నజీర్, సందీప్, మోహనరావు, మామిడి శ్రీనివాస్, మామిడి సాయి, నల్ల గంగాధర్, రాములు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.