పొతంగల్, జూన్ 28: రెండేండ్ల క్రితం ప్రారంభించిన వంతెన నిర్మాణ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డుపై వానకాలంలో నీరు ప్రవహిస్తున్నది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్నది. దీం తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని కొల్లూరు నుంచి దేమలేడ్గి వెళ్లే దారిలో దారిలో హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.255 లక్షల అంచనా వ్యయంతో పనులకు శంకుస్థాపన చేశారు.
దీంతో 2023 సంవత్సరంలో పనులను ప్రారంభించారు. పనులు ప్రారంభించి రెండేండ్లు గడుస్తున్నా.. ఇంకా పిల్లర్ల దశలోనే ఉన్నాయి. ఇప్పటికీ బ్రిడ్జి పక్కన తాత్కాలింగా ఏర్పాటుచేసిన మట్టిరోడ్డుపై ప్రయాణాలు సాగిస్తున్నారు. వానకాలంలో ఈ మట్టి రోడ్డుపై నీరు ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వానలు కురిస్తే.. ప్రయాణికులు ఇతర మార్గాల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ఇప్పటికైనా పనులు త్వరగా పూర్తిచేసి వంతెనను అందుబాటులోకి తీసుకురావాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఇందుకోసం ప్రజా ప్రతినిధులు, నాయకులు, ఉన్నతాధికారులు చొరవ చూపాలని వేడుకుంటున్నారు.
బీఆర్ఎస్ హయాంలో వంతెన నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో ఎంతో సంతోషించాం. అయితే అటు తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. వర్షాలు అధికంగా కురిస్తే.. మా గ్రామం నుంచి కొల్లూరు మీదుగా పొతంగల్కు వెళ్లడం ఇబ్బందిగా మారింది. ఎత్తొండ నుంచి కోటగిరి మీదుగా పొతంగల్కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. విద్యార్థులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తున్నది.
– పోతురాజు ఆంజనేయులు, దోమలేడ్గి