నాగిరెడ్డిపేట, జూలై 7: నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థినులకు ఆదివారం ఉదయం అల్పాహారం అందకపోవడంతో ఆకలితో ఇబ్బందులు పడ్డారు. ఉదయం 8గంటల వరకు అల్పాహారం అందించాల్సి ఉండగా సిబ్బంది 9గంటలకు వంట పనులు ప్రారంభించారు. ఉదయం 11గంటలు దాటినా వారికి అల్పాహారం అందించలేదు. ఆదివారం సందర్శన సమయం కావడంతో పాఠశాలకు వెళ్లిన విద్యార్థినుల తల్లిదండ్రులు గుర్తించి స్థానిక విలేకరులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెళ్లి చూడగా ఆరు, ఏడు, ఎనిమిదో తరగతుల విద్యార్థినులకు అల్పాహారం అందగా తొమ్మిది, పదో తరగతి విద్యార్థినులకు అందక వరుసలో నిల్చున్నారు. వంట మనుషులు ఆలస్యంగా వస్తుండడంతో ప్రతి రోజూ అల్పాహారం సమయానికి అందడం లేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తంచేశారు.
ఆదివారం చికెన్ వండితే..ఒక ముక్క వేసి రసం వేస్తున్నారని..తిరిగి అడిగితే తిడుతున్నారని వాపోయారు. అన్నానికి సరిపడా కూరలు వేయడం లేదని తెలిపారు. ఈ విషయమై ఇన్చార్జి ఉపాధ్యాయిని రాధికను వివరణ అడుగగా..తాను ఉదయం 10 గంటలకు వచ్చానని తెలిపారు. రాత్రి డ్యూటీలో ఉన్న ఉపాధ్యాయిని స్వర్ణ అల్పాహారం పూర్తి చేయించి వెళ్లాలన్నారు. కానీ ఈ రోజు వంట సిబ్బంది ఆలస్యంగా రావడంతో విద్యార్థులకు సమయానికి అల్పాహారం అందించలేదని తెలిపారు. విషయాన్ని ప్రత్యేక అధికారిణి వీణకు తెలియజేశామన్నారు. పాఠశాల ప్రత్యేక అధికారిణి వీణను ఫోన్లో సంప్రదించగా అరగంటలో ప్రతి విద్యార్థినికి అల్పాహారం అందిస్తామన్నారు. నిర్లక్ష్యానికి కారణమైన వంట మనుషులపై చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని ఆమె తెలిపారు.