నిజామాబాద్, సెప్టెంబర్ 16(నమస్తే తెలంగాణ ప్రతినిధి): సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులకు సీఎం కేసీఆర్ దసరా కంటే ముందే పండుగ కానుక ప్రకటించారు. ఖాళీ కడుపుతో విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టలేరనే ఉద్దేశంతో ఇప్పటికే ఉదయం రాగిజావ, మధ్యాహ్నం భోజనాన్ని పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నది. ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ పేరిట ఉదయం టిఫిన్ పెట్టాలని నిర్ణయించింది. దసరా నుంచి ప్రారంభం కానున్న ఈ పథకం ద్వారా ఉమ్మడి జిల్లాలోని 2 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నది. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులు పనుల హడావుడిలో ఉదయం వంట ఆలస్యమవుతుంది. ఖాళీ కడుపుతోనే బడికి వస్తున్న పిల్లలు పాఠాలపై శ్రద్ధ పెట్టడం లేదని గుర్తించిన ప్రభుత్వం.. ఉదయం అల్పాహారం పెట్టాలని నిర్ణయించింది. సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంతో తల్లిదండ్రులు, విద్యార్థులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
ప్రభుత్వ బడుల బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ సర్కారు మరో కీలక పథకాన్ని తీసుకువచ్చేందుకు నిర్ణయించింది. ఇప్పటికే ఇంగ్లిష్ మీడియం విద్యను అందిస్తుండగా ‘మన ఊరు – మన బడి’ పేరుతో ఆధునికీకరణకు నడుం బిగించింది. వందలాది స్కూళ్లను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మార్చడంతోపాటు డిజిటల్ విద్యా బోధనకు బాటలు వేసింది. ఇదిలా ఉండగా సర్కారు స్కూళ్లలో మెరుగైన విద్యాబోధన, వసతుల కల్పన ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారెందరికో బాసటవుతున్నది. ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకంలో సన్నబియ్యంతో కూడిన భోజనాన్ని అందిస్తున్న సీఎం కేసీఆర్ ఇప్పుడేకంగా ఉదయం పూట ఆకలితో స్కూళ్లకు వచ్చే వారి బాధలను అర్థం చేసుకొని అల్పాహారాన్ని అందించేందుకు నిర్ణయించారు. గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో పేద కుటుంబాల్లో తల్లిదండ్రులు వివిధ వృత్తి పనుల్లో నిమగ్నం కావడంతో వారి పిల్లలు అర్ధాకలితో లేదంటే ఆకలితోనే స్కూళ్లకు వస్తున్నారు. అలాంటి బాధలను తెలుసుకున్న సీఎం కేసీఆర్ దసరా నుంచి అల్పాహార పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఉమ్మడి జిల్లాలో ఒకటి నుంచి 10వ తరగతి చదువుతున్న దాదాపు 2లక్షల మంది పిల్లలకు ఈ పథకం వర్తించనున్నది.
అల్పాహారం పసందుగా..
ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని దసరా నుంచి అమల్లోకి తీసుకురానున్నారు. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో అందుకు తగిన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం అవుతున్నారు. ఇప్పటికే మధ్యాహ్న భోజనం విజయవంతంగా అమలవుతున్నది. దీనికి తోడుగా ఉదయం అల్పాహారం అందించడంతో పేద కుటుంబాలకు చెందిన వారందరికీ మేలు చేకూరనున్నది. ప్రస్తుతం మధ్యాహ్న భోజన పథకం నిజామాబాద్ జిల్లాలో 1180 ప్రభుత్వ స్కూళ్లలో, కామారెడ్డి జిల్లాలో 1011 ప్రభుత్వ బడుల్లో అమలవుతున్నది. ప్రస్తుతం మధ్యాహ్న భోజన పథకం అమలవుతున్నట్లే ఒకటి నుంచి పదో తరగతి వరకు అల్పాహారం పథకాన్ని ప్రభుత్వం అమలు చేయబోతున్నది. సర్కారు స్కూల్‌కు వెళ్లే వారందరికీ అల్పాహారం, మధ్యాహ్న భోజనం చదువుతోపాటే ఉచితంగానే అందుతుండడంతో తల్లిదండ్రుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది.
ఎంతో మేలు..
సాధారణంగా ప్రైవేటు బడులకు వెళ్లే విద్యార్థులకు భోజన వసతికి ఢోకా ఉండదు. వేలల్లో ఫీజులు చెల్లించే కుటుంబాలు తమ పిల్లలకు మధ్యాహ్న భోజనానికి సరిపడా ఏర్పాట్లు చేసి పంపిస్తుంటారు. స్థోమత ఉన్నోళ్లే ఎక్కువగా ప్రైవేటు విద్యాసంస్థల్లో పిల్లలను చదివించుకుంటుండడంతో వారికి అంతగా భారం కూడా పడడం లేదు. కాకపోతే ప్రభుత్వ బడుల్లో చదువుకునే వారి పరిస్థితి కాసింత భిన్నం. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలకు చెందిన వారి పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం నుంచి స్కూల్ ముగిసే సమయానికి ఉపాధ్యాయులే అన్నీ తామై జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంటి భోజనం అక్కర్లేకుండా మధ్యాహ్నం ప్రభుత్వమే పౌష్టికాహారాన్ని అందజేస్తున్నది. దీంతో డ్రాపౌట్ సమస్యలు కూడా తగ్గాయి. ఇప్పుడేకంగా ఉదయం అల్పాహారం కూడా అందుబాటులోకి వస్తే పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసినట్లు అవుతున్నదంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. ఆకలితో అలమటించకుండా విద్యనభ్యసించే పిల్లలకు తోడునీడగా తెలంగాణ సర్కారు నిలవడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
బడుల బలోపేతం..
ప్రభుత్వ విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. గడిచిన తొమ్మిదేండ్లలో కీలకమైన నిర్ణయాలతో సర్కారు స్కూళ్లకు ఊపిరిపోశారు. మన ఊరు- మన బడి కార్యక్రమం తో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తొలిదశలో వందలాది స్కూళ్లను ప్రభుత్వం మెరుగుపర్చింది. నిజామాబాద్ జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 217, ప్రాథమికోన్నత పాఠశాలలు 40, ఉన్నత పాఠశాలలు 150 కలిపి మొత్తం 407 స్కూళ్ల ను, కామారెడ్డి జిల్లాలో 185 ప్రాథమిక, 42 ప్రాథమికోన్నత, 124 ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 351 స్కూళ్లలో మౌలిక సదుపాయాలను కల్పించింది. ఉభయ జిల్లాలో 758 ప్రభుత్వ బడుల్లో వందల కోట్ల రూపాయలతో పనులు చేపట్టింది. రెండు దశాబ్దాలుగా చాలా మంది గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పిల్లలు ప్రైవేటు స్కూళ్ల వైపు ఆసక్తి చూపుతున్నారు. ఆంగ్ల మాధ్యమ బోధన, కార్పొరేట్ స్థాయి వసతులు ఉండడంతో ఇప్పుడేకంగా ప్రభుత్వ బడుల వైపు తల్లిదండ్రులు మొగ్గుచూపుతున్నారు. తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలోనే చేర్పించేందుకు నిర్ణయించి విద్యాభ్యాసానికి చొరవ చూపుతున్నారు. ప్రైవేటు దోపిడీ నుంచి విముక్తి పొందుతున్నారు.
రెండు పూటలూ ఇక్కడే..
ఏర్గట్ల, సెప్టెంబర్ 16: మా అమ్మనాన్నలు పొద్దున్నే పనికి పోతరు. చాలా సార్లు పొద్దున అన్నం తినకుండా స్కూల్‌కు వస్తున్నం. దసరా పండుగ తర్వాత స్కూల్‌కి రాంగనే టిఫిన్ పెడ్తరంట.. చాలా సంతోషంగా ఉన్నది. ఇక నుంచి స్కూల్లో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం.. రెండు పూటలూ ఇక్కడే తిని చక్కగా చదువుకుంటాం. మా కడుపు నిండా బువ్వ పెట్టి.. చక్కని చదువు అందిస్తున్న సీఎం కేసీఆర్ తాతకు థ్యాంక్స్..
– ఎం అక్షర, 5వ తరగతి, ఎంపీపీఎస్ గ్రా.మం ఏర్గట్ల.
చాలా సంతోషంగా ఉన్నది..
ఏర్గట్ల, సెప్టెంబర్ 16: మా అమ్మనాన్నలు పొద్దుగాళ్లనే ఆగమాగం పొలం పనికి పోతరు. మేం ఏం తినకుండా బడికి వస్తున్నం. మధ్యాహ్నం వరకు ఆకలి అవుతుంది. మా బాధలు తెలుసుకున్న సీఎం కేసీఆర్.. ఈ దసరా పండుగ తర్వాత పొద్దుగాళ్ల బడికి రాంగనే టిఫిన్ పెట్టిస్తడంట. ఈ విషయం తెల్వంగనే చాలా సంతోషమైంది. సీఎం కేసీఆర్ సార్ నిజంగా దేవుడు.
– ఎన్.వైష్ణవి, పదో తరగతి, జడ్పీహెచ్ఎస్, తడ్పాకల్
చక్కగా చదువుకుంటాం..
రోజూ ఉదయం ఇంట్లో వంట ఆలస్యమవుతుంది. మేము స్కూల్‌కు ఖాళీ కడుపుతోనే వస్తున్నం. మొన్నటి నుంచి రాగి జావ ఇస్తుండడంతో కొద్దిగా ఆసరా అవుతున్నది. దసరా పండుగ నుంచి సీఎం కేసీఆర్ ఉదయమే స్కూల్‌కు వచ్చే మాకు టిఫిన్ పెడ్తారని అంతా చెబుతున్నారు. సొంత బిడ్డలకు పెట్టినట్లే మాకూ ఉదయం టిఫిన్ పెట్టిస్తుండడం సంతోషకరమైన విషయం. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
– నందీశ్వర్, ఏడో తరగతి, జడ్పీహెచ్ఎస్, ఏర్గట్ల