భీమ్‌గల్, అక్టోబర్ 14: స్కూల్ బస్సు కింద పడి ఓ మూడేండ్ల బాలుడు మృతిచెందాడు. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటూ గ్రామస్తులు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ ఘటన మండలంలోని రాహత్‌నగర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకున్నది. వివరాలు.. మండల కేంద్రంలోని కృష్ణవేణి పాఠశాలలో చదివే విద్యార్థులను తీసుకువెళ్లేందుకు స్కూల్ బస్సు ఉదయం 8 గంటల సమయంలో గ్రామానికి చేరుకున్నది. అదే గ్రామానికి చెందిన జాదవ్ శిరీష తన పెద్ద కుమారుడు విశాల్‌ను స్కూల్ బస్సులో పంపించేందుకు చిన్న కుమారుడు శ్రీకాంత్(3)ను చంకలో ఎత్తుకొని బస్సు స్టాప్నకు వచ్చింది.
చిన్న కుమారుడిని కింద దింపి, పెద్ద కుమారుడిని బస్సు ఎక్కించి జాగ్రత్తలు చెబుతుండగా.. శ్రీకాంత్ ఆడుకుంటూ బస్సు ముందు భాగంలోకి వెళ్లాడు. ఇంతలో డ్రైవర్ మధు అజాగ్రత్తగా బస్సును ముందుకు కదపడంతో బస్సు ముందుభాగంలో ఉన్న బంపర్ శ్రీకాంత్‌ను గట్టిగా ఢీకొనగా అక్కడే స్పృహ తప్పిపడి పోయాడు. స్థానికులు కేకలు వేసి బస్సును ఆపి, బాలుడిని హుటాహుటిన జిల్లా కేంద్రంలోని దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.
బాలుడి మృతదేహంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు భీమ్‌గల్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు. స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో తమ కుమారుడు మృతిచెందాడని ఆవేదన వ్యక్తం చేశారు. వారితో ఎస్సై సందీప్ మాట్లాడి సముదాయించారు. కేసు నమోదు చేస్తామని, మృతుడి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇవ్వడంతో వారు శాంతించారు. ఆందోళన కార్యక్రమం లో బీఆర్ఎస్ నాయకుడు బాదావత్ శర్మానాయక్, రాహత్‌నగర్ మాజీ సర్పంచ్ బాదావత్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. కుటుంబసభ్యు ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు స్థానిక ఎస్సై తెలిపారు.