ఎడపల్లి, నవంబర్ 18 : చెట్టుపై ఉన్న గాలిపటాన్ని తీసే క్రమంలో హైటెన్షన్ వైర్లు తగిలి ఓ బాలుడు అక్కడికక్కడే మృతిచెందిన విషాదకర ఘటన ఎడపల్లి మండలంలోని కుర్నాపల్లిలో సోమవారం చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కుర్నాపల్లి గ్రామానికి చెందిన షేక్ మతిన్ (13) గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు.
ఉదయం వీధిలో ఉన్న ఓ చెట్టుపై గాలిపటం ఉండడాన్ని గమనించి, చెట్టుపైకి ఎక్కాడు. గాలిపటం తీసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ హైటెన్షన్ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. హైటెన్షన్ వైర్లు చెట్టు కొమ్మలను ఆనుకొని ఉండడం, అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం చోటుచేసుకున్నదని బాధిత కుటుంబీకులు, గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న ఎడపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. న్యాయం చేస్తామని సముదాయించడంతో ఆందోళన విరమించారు. గాలిపటం కోసం బాలుడు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.