శక్కర్‌నగర్, మే 6: జిల్లాలో అవినీతి అధికారుల తీరు మారడంలేదు. ముఖ్యంగా పోలీసుశాఖలో కొందరు అవినీతికి పాల్పడుతూ ఏసీబీకి చిక్కుతున్నా వారిలో ఇసుమంతైనా మార్పు రావడంలేదు. తాజాగా బోధన్ ఎస్సై చితన్నోజు భాస్కరాచారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కడం కలకలం రేపింది. ఓ వ్యక్తిని కేసు నుంచి తప్పించేందుకు రూ.7వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. కొంతకాలంగా బోధన్ పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. పోలీసుల తీరుపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నది.
గతంలో సీఐగా విధులు నిర్వహించిన పల్లె రాకేశ్ ఓ వ్యక్తి నుంచి ఆయుధం కొనుగోలు విషయంలో ఏసీబీ అధికారులకు చిక్కగా, తాజాగా ఎస్సై భాస్కరాచారి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఓ ప్రజాప్రతినిధి కుమారుడిని డబ్బుల కోసం వేధించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో కేవలం ఎస్సై ప్రమేయమే ఉన్నదా లేదా ఇతర అధికారుల పాత్ర ఉందా అనేది తేలాల్సి ఉన్నది. మార్చి నెలలో నమోదు చేసిన ఓ సివిల్ కేసులో కొంతమందికి నోటీసులు అందజేశారు.
ఇందులో భాగంగానే ఓ ప్రజాప్రతినిధికి చెందిన సోదరుడి కుమారుడి పేరు ఈ కేసు నుంచి తొలగించేందుకు ఎస్సై భాస్కరాచారి రూ.10వేలు డిమాండ్ చేయగా, చివరికి రూ. 7వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. లంచం ఇవ్వడం ఇష్టంలేదని బాధితుడు ఏసీబీ అధికారులు ఆశ్రయించాడు. దీంతో బుధవారం రూ. 7వేలు తీసుకుంటుండగా ఎస్సై భాస్కరాచారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ వెల్లడించారు. ఈ కేసు వివరాలు చట్ట ప్రకారం వెల్లడించలేమని పేర్కొన్నారు. అధికారులు ఎవరైనా పనులు చేయడానికి డబ్బుల కోసం ఇబ్బంది పెడితే 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు గాని, 94404 46106 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.