జిల్లాలోని బోధన్ షుగర్ ఫ్యాక్టరీ పునః ప్రారంభంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఫ్యాక్టరీ తెరిపిస్తామని ప్రస్తుత సీఎం.. పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. జిల్లాకేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో ఏర్పాటుచేసిన సభలో సెప్టెంబర్17 లోపే చక్కెర కర్మాగారాన్ని పునఃప్రారంభిస్తామని చెప్పారు. అంతేగాకుండా ఈ అంశాన్ని పార్టీ మ్యానిఫెస్టోలోనూ చేర్చారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటుతున్నా.. షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభ ప్రక్రియపై ఎలాంటి ముందడుగు పడిన దాఖలాలు లేవు. ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ కేవలం చుట్టపుచూపునకు పరిమితమైంది. ఫ్యాక్టరీ పునః ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నప్పటికీ, ప్రజలకు ఎలాంటి వివరాలను ప్రభుత్వం తెలుపకపోవడం గమనార్హం.
-నిజామాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
బోధన్ షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభించడానికి అనేక సంక్లిష్టమైన అంశాలు ముడి పడి ఉండగా వాటిపైనా దృష్టి సారించలేదు. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ కేవలం ఒకేసారి బోధన్‌కు వచ్చి వాస్తవ పరిస్థితులను పరిశీలించింది. ఆ తర్వాత ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం తూతూ మంత్రంగా సమీక్షలు నిర్వహించి వెళ్లి పోయారు. ఏడాది తర్వాత ప్రభుత్వం తరపున బోధన్ డివిజన్ ప్రాంతంలోని రైతులతో కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నేడు (శనివారం) ఎడపల్లిలో సమావేశం కానున్నారు. ఈ భేటీలో రైతుల సందేహాలను నివృత్తి చేస్తారా? ప్రభుత్వ ఉద్దేశాలను వివరిస్తారా? లేదా? అన్నది వేచి చూడాల్సి ఉంది.
ఎన్నికల సమయంలో పంటలకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ప్రస్తుతం వరిలో సన్న రకాలకే రూ.500 చెల్లిస్తుండగా.. చెరుకు సాగుకు కూడా బోనస్ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. లాభాలు దక్కాలంటే బోనస్ ఒక్కటే మార్గమని చెబుతున్నారు. ప్రైవేటు యాజమాన్యం పరిధిలో చెరుకు ఫ్యాక్టరీని తెరిపిస్తారా? లేదంటే ప్రభుత్వమే నడుపుతుందా? ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చక్కెర కర్మాగారానికి పాత రోజులు తీసుకు వస్తారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రైవేటు భాగస్వామ్యమైతే రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. సకాలంలో చెల్లింపులు, విత్తన సాయం, సాంకేతిక సహకారం వంటి అంశాలపై సందేహాలున్నాయి. బోధన్ డివిజన్ పరిధిలో చాలా మంది చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. వీరి భూ కమతాలు ఎక్కువగా ఎకరం నుంచి రెండు ఎకరాల్లోపే ఉన్నాయి. చిన్న కమతాలను కలిగి ఉన్న రైతులకు చెరుకు సాగు గిట్టుబాటు అవుతుందా? అలాంటి వారికి ఎలాంటి తోడ్పాటు అందిస్తారో నేడు నిర్వహించనున్న సమావేశంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరుకుంటున్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఇదే అంశంపై పార్టీ నాయకుల వెంట పడుతున్నారు. ఏడాది కాలంగా జాప్యం చేస్తుండడంతో స్థానికుల్లో నిరాశ అలుముకున్నది. ఫ్యాక్టరీ తెరుస్తామంటున్నా.. ఇందుకు కావాల్సిన ప్రధాన ముడి సరుకు చెరుకు పంట సాగుపై ఇప్పటి వరకు ప్రభుత్వం ఆలోచన చేయలేదు. తొలిసారిగా రైతులతో భేటీ అవుతున్న నేపథ్యంలో చెరుకు సాగుపైనే ఎక్కువగా చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. స్వరాష్ట్రం సిద్ధించాక బోధన్ డివిజన్లో సాగు నీటి వసతి భారీగా పెరిగింది. గోదావరి జలాలను ఎత్తిపోతల ద్వారా పంట పొలాలకు మళ్లించడం, కాలువల ఆధునికీకరణ ద్వారా రైతులంతా చెరుకు పంటను వదిలేసి వరి పంట సాగుకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో తిరిగి దీర్ఘ కాలిక పంట చెరుకును సాగు చేసేందుకు ముందుకు వస్తారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ ముందుకు వచ్చినప్పటికీ వారికి ఎలాంటి ప్రోత్సాహకాలు అందజేయనున్నదనే దానిపై ఆసక్తి నెలకొన్నది.