నవీపేట, అక్టోబర్ 31: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ప్రజలకు మరోసారి కష్టాలు తప్పవని బోధన్ బీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ షకీల్ అన్నారు. మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఎన్నికల కార్యాలయాన్ని స్థానిక నాయకులతో కలిసి మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం మండల కేంద్రంలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సభలో షకీల్ మాట్లాడుతూ.. 60 ఏండ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. గతంలో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఐదేండ్లు మంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి బోధన్ నియోజకవర్గాన్ని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా కొనసాగిన సుదర్శన్‌రెడ్డి .. నవీపేట మండలంలో ఒక్క చెక్‌డ్యామ్ చేపట్టిన దాఖలాలు లేవని మండిపడ్డారు.
తాము తొమ్మిదేండ్లలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. రూ. 10 కోట్ల వ్యయంతో నిజాంపూర్, లింగాపూర్ చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపట్టి నాళేశ్వర్, తుంగిని తదితర ఎన్నో గ్రామాలకు సాగునీటిని అందిస్తున్నామని తెలిపారు. ఇటీవల రూ. 80 కోట్లతో బినోలా లిప్టును మంజూరు చేసినట్లు చెప్పారు. కరోనా సమయంలో నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటే ఒక నీటి బాటిల్ సైతం అందజేయని సుదర్శన్‌రెడ్డికి ఓట్లు అడిగే హక్కులేదన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రస్ అధిష్టానం రెడ్డిలకే ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి, బీసీలను విస్మరించిందన్నారు. కాంగ్రెస్‌కు దమ్ముం టే బీసీ వ్యక్తిని సీఎం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు బీజేపీ బోధన్ నుంచి అభ్యర్థిని ప్రకటించలేదని, ఆ పార్టీ పరిస్థితి ఏంటో తెలుస్తోందన్నారు. బోధన్ నియోజక వర్గంలో బీఆర్ఎస్కు పోటీ లేదని, ఒకవేళ ఉంటే బీజేపీతోనే అని అన్నారు. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్కు ఓటు వేయాలని ఆయన అభ్యర్థించారు.