వినాయక్‌నగర్, నవంబర్ 20: అధిక లాభాలంటూ ప్రజలను మోసం చేసిన బీఎంబీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ చైన్ సిస్టం నిందితులను అరెస్టు చేసినట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు. కమిషనరేట్‌లోని కమాండ్ కంట్రోల్ హాల్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను సీపీ వెల్లడించారు. నగరానికి చెందిన తోకల బక్కన్న అక్టోబర్ 13వ తేదీన కోటగల్లీలోని కెనరా బ్యాంకు పక్కన ఉన్న బీఎంబీ కంపెనీని చూసి లోనికి వెళ్లి ప్రతినిధులను కలిశాడు.
ప్రతినిధి చంద్రశేఖర్ ప్రసాద్ బీఎంబీ కంపెనీ ఇంగ్లాండ్ దేశానికి చెందినదని, ఇందులో పెట్టుబడులు పెట్టి.. కంపెనీ యాడ్స్‌కు రేటింగ్ ఇవ్వడంతో తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందవచ్చని నమ్మించాడు. అధిక లాభాలతోపాటు ఆకర్షణీయమైన బహుమతులు వస్తాయని తెలిపాడు. దీంతో తోకల బక్కన్న కంపెనీకి సంబంధించిన యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని, అందులో దశల వారీగా రూ.84వేల వరకు పెట్టుబడులు పెట్టాడు. తనకు వచ్చిన లాభాలు వాలెట్లో చూపినా.. అవి అకౌంట్లో జమ కాలేదు. దీంతో అది ఫేక్ ఎమౌంట్ అని, తాను మోస పోయినట్లు గ్రహించి బాధితుడు నాల్గో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీపీ తెలిపారు.
సదరు నిందితుడు ఇదే తరహాలో సుమారు 22మందిని మోసం చేసినట్లు తెలిసిందని, బీఎంబీ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన సుమారు 750 మంది రూ.కోటిన్నర వరకు మోసపోయినట్లుగా సమాచారం ఉందన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని సీపీ తెలిపారు. ప్రజలు ఇలాంటి వాటిలో పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని, ఎవరైనా బాధితులు ఉంటే సంబంధిత పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని సూచించారు. విలేకరుల సమావేశంలో ఫోర్త్ టౌన్ ఎస్‌హెచ్‌వో సతీశ్, ఎస్సై శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.