MP Arvind | ఆధిపత్య పోరుతో బీజేపీ పరువు రోడ్డున పడుతున్నది. అంతర్గత కుమ్ములాటలతో కమల దళం రోజురోజుకూ ప్రభ కోల్పోతున్నది. ఎంపీ ధర్మపురి అర్వింద్ ఒంటెద్దు పోకడలపై సొంత పార్టీలోనే అసమ్మతి వెల్లువెత్తుతున్నది. బీజేపీలో పట్టు కోసం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న తీరుపై సీనియర్లతోపాటు దిగువ శ్రేణి నాయకులు కూడా మండిపడుతున్నారు. నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చి పెత్తనం చెలాయించడంపై గుర్రుగా ఉన్నారు. తాజాగా 13 మండలాల అధ్యక్షులను మార్చిన వ్యవహారం బీజేపీలో చిచ్చు రేపింది. అర్వింద్‌కు వ్యతిరేకంగా ఏకమైన పార్టీ నేతలు ఏకంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనే ధర్నాకు దిగారు. ఎంపీ తీరు మార్చుకోక పోతే తమ దారి తాము చూసుకుంటామని అల్టిమేటం జారీ చేయడం పార్టీలో కలకలం రేపింది.
– నిజామాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నిజామాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) కాషాయ దళంలో కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. ఆధిపత్య పోరు, అంతర్గత విభేదాలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. పార్టీపై పట్టు కోసం ఎంపీ అర్వింద్ పాకులుడుతుండడాన్ని బీజేపీ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నాయి. ఇప్పటికే తన వ్యవహార శైలితో ప్రజల్లో పార్టీని చులకన చేసిన అర్వింద్‌పై నాయకులు, కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నది. తాజాగా ఎవరికీ సమాచారం లేకుండా 13 మండలాల పార్టీ అధ్యక్షులను ఏకపక్షంగా మార్చడం బీజేపీలో చిచ్చు రాజేసింది. దీంతో సీనియర్లంతా కలిసి ఏకంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనే ధర్నాకు దిగారు. అర్వింద్ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఇకనైనా తీరు మార్చుకోవాలని, లేదంటే మాదారి మేము చేసుకుంటామని అల్టీమేటం జారీచేశారు.
ఎంపీ అర్వింద్‌కు వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్న అసంతృప్తి ఇన్నాళ్లు ఇందూరు జిల్లాకే పరిమితమైంది. అయితే, తాజాగా మండలాధ్యక్షుల మార్పు అంశంతో నాయకుల్లో ఒక్కసారిగా అసహనం వెల్లివెత్తింది. దీంతో హైదరాబాద్‌కు వెళ్లి పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనే ధర్నాకు దిగారు. బోధన్, ఆర్మూర్ నియోజకవర్గాల్లో బీజేపీ మండల అధ్యక్షుల మార్పు కొద్ది రోజుల క్రితం జరిగింది. ఈ విషయంపై స్థానిక నియోజకవర్గ ఇన్చార్జిలకు సమాచారమే లేదు. కేవలం ఎంపీ అర్వింద్ ఒత్తిడితో జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య నియామకాలు చేపట్టారు. దీంతో బీజేపీలో ఆది నుంచి పని చేస్తున్న నాయకులంతా ఒక్కసారిగా భగ్గుమన్నారు. నాలుగున్నరేళ్లుగా అర్వింద్ చేష్టలను భరిస్తూ చూస్తున్నామని, ఇకపై సహించేది లేదంటూ తాడోపేడో తేల్చుకునేందుకు ఏకంగా హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని కలిసి జిల్లా పార్టీలో జరుగుతున్న తంతును వివరించాలని ప్రయత్నించగా, పార్టీ బాధ్యుల నుంచి సరైన స్పందన కరువైంది. దీంతో అక్కడే బైఠాయించి ఎంపీ అర్వింద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిత్యం మైకుల ముందు నీతులు వల్లించే బీజేపీ ఎంపీ అర్వింద్‌ను సొంత పార్టీలోనే కింది స్థాయి లీడర్లు పట్టించుకోకపోవడంతో సోషల్ మీడియాలో సెటైర్లు మొదలయ్యాయి. బీజేపీలో అర్వింద్ దుకాణం బంద్ అయిపోతుందంటూ పోస్టులు వైరల్ అయ్యాయి.
బాధ్యత గల పదవిలో ఉన్న వారు ప్రజలకు పారదర్శకమైన, కచ్చితత్వంతో కూడిన విషయాలను చేరవేయాలి. రాజకీయంగా ప్రకటనలు చేసినా అందులోనూ వాస్తవాలు ఉండాలి. అవేవి పట్టకుండా మసిపూసి మారెడు కాయ చేయడంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మాత్రం దిట్ట. సిద్ధ్దాంతాలకు విరుద్ధంగా వ్యవహరించడంలో ఆయన ఆది నుంచి ముందు వరుసలోనే నిలుస్తున్నాడు. నిత్యం ప్రత్యర్థి పార్టీలపై బురద రాజకీయాలు చేయడం తప్ప ఎంపీ హోదాలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతానికి చేసిన మేలు ఒక్కటంటే ఒక్కటీ లేకపోవడం అర్వింద్‌కే చెల్లిందంటూ ప్రజలు మండిపడుతున్నారు. జిల్లా పర్యటనకు వచ్చినప్పుడల్లా బీఆర్ఎస్ పార్టీపై, కేసీఆర్ సర్కారుపై నోరు పారేసుకోవడం మినహా చేసిందేమీ లేదంటూ సొంత పార్టీ నాయకులే విమర్శిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఎమ్మెల్సీ కవితపై ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేయడంతో ఆమె తీవ్రంగా స్పందించారు. ఆరోపణలను నిరూపించాలని, లేకపోతే ముక్కునేలకు రాసి క్షమాపణలు చెప్పాలని సవాల్ విసిరారు. కానీ ఇప్పటివరకు అర్వింద్ నుంచి స్పందన కరువైంది. ఇకపై కవిత సహా ఇతర నాయకులపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదంటూ బీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరించారు. సొంత పార్టీ నాయకులపైనే పట్టు కోల్పోయిన వ్యక్తి… ఇతర పార్టీలపై విమర్శలు చేయడం సిగ్గుచేటంటూ ప్రజలు సైతం ఎంపీ అర్వింద్ తీరును తప్పుపడుతున్నారు.
ఎంపీ అర్వింద్ తీరుపై సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు. జిల్లా పార్టీలో పట్టు కోసం అర్వింద్ ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తుండడంపై సీనియర్లు గుర్రుగా ఉన్నారు. తొలి నుంచి కాషాయ జెండాను మోస్తున్న వారిపైనా 2019లో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఎంపీ పెత్తనం చెలాయించడాన్ని నేతలు, కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారు. ఒంటెద్దు పోకడలకు పోతున్న అర్వింద్‌కు వ్యతిరేకంగా సీనియర్లు తిరుగుబాటు చేస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ వర్సెస్ ధర్మపురి అర్వింద్ మధ్య అంతర్గత పోరు నడుస్తున్నది. పార్టీలో, అనుబంధ సంఘాల కార్యవర్గాల కూర్పులో, పార్టీ సమావేశాల్లో పైచేయి సాధించేందుకు అర్వింద్ ప్రయత్నించి కార్యకర్తల ముందు నవ్వుల పాలవుతున్నారు. ఇలా ఓ వైపు పార్టీలో, మరోవైపు ప్రజల్లో చులకన అయిన అధర్మపురి.. ఎలాగైనా పార్టీలో పట్టు నిలుపుకోవాలనే ఆలోచనతో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నట్లుగా సొంత పార్టీ నేతలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. పాత తరం నాయకులకు పెత్తనం ఇస్తే తనకు ప్రాధాన్యత తగ్గుతుందనే ఆలోచనతోనే సోషల్ మీడియాలో సొంత పార్టీ నేతలపైనే దుష్ప్రచారం చేయిస్తున్నారని మండిపడుతున్నారు. ఎంపీ అర్వింద్ ఆగడాలను గమనిస్తున్న పాత తరం నాయకులంతా ఏకతాటిపైకి వస్తున్నారు. సరైన సమయంలో తగిన బుద్ధి చెప్పాలని ఇటీవల జరిగిన అంతర్గత సమావేశాల్లోనూ నిర్ణయం తీసుకున్నారు.