నిజామాబాద్, మే 9, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నిత్యం నోటికి ఏది వస్తే అది వాగి రాజకీయంగా ప్రధాన శీర్షికల్లో నిలిచే బండి సంజయ్ ఇప్పుడు మరోమారు వార్తల్లో నిలిచాడు. తన కుమారుడు వ్యవహారంలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాడు. అభం శుభం తెలియని ఓ మైనర్ బాలికలను మద్యం తాగించి అత్యాచారం చేసిన ఘటనలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడిపై హైదరాబాద్‌లో పోక్సో కేసు నమోదైంది. మూడు నెలల క్రితం జరిగిన ఈ అంశంలో కేసు కాకుండా అధికార దుర్వినియోగానికి బండి సంజయ్ పాల్పడ్డట్లుగా తెలుస్తోంది.
బాధితులు మొక్కవోని దీక్షతో న్యాయం కోసం పోరాటం చేయడంతో సరిగ్గా ప్రధాని నరేంద్ర మోడీ సభకు ఒక రోజు ముందు ఎట్టకేలకు కేసు నమోదు చేయాల్సిన దుస్థితి తెలంగాణ పోలీసులకు ఏర్పడింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన కుమారుడిపై కేసు కాకుండా ప్రయత్నాలు సాగించినట్లుగా బాధిత వర్గాలు ఇప్పటికే ఆరోపిస్తున్నాయి. మోడీ సభలో ప్రాణ త్యాగానికైనా సిద్ధమని బాధిత కుటుంబం ప్రకటన చేయడంతో పోలీసులు దిగొచ్చి బండి సుపుత్రుడిపై పక్కా ఆధారాలతో కేసు నమోదు చేశారు.
ఈ వ్యహారంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్, కాంగ్రెస్ ముఖ్య నేతలు మోనం వహించారు. సంబంధం లేని అంశాల్లో తలదూర్చే నిజామాబాద్ లోక్‌సభ సభ్యుడు అర్వింద్ కనీసం ఈ విషయం స్పందించలేదు. మీడియాకు కంట పడకుండా జాగ్రత్త పడుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్ నేతలు సైతం బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యవహారంపై నోరు విప్పేందుకు సాహసించడం లేదు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బద్ధ శత్రువులుగా చలామణి అవుతున్నప్పటికీ రాష్ట్రంలో వింత పరిస్థితిలో కొనసాగుతున్నాయి. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ములాఖత్ అయ్యాయని ఎప్పటి నుంచో భారత రాష్ట్ర సమితి ఆరోపిస్తోంది.
అందుకు తగ్గట్లుగానే కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవ్వరూ కేంద్ర మంత్రి కుమారుడి అరాచకంపై మాట్లాడకపోవడంపై విస్మయం వ్యక్తం అవుతోంది. కేసీఆర్ కుటుంబంపై అనాగారికంగా, అనైతికంగా విమర్శలు గుప్పించి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం మోనమే వహించడం చర్చనీయాంశం అవుతోంది. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా శత్రు పార్టీ బీజేపీపై విమర్శలు గుప్పించాల్సి ఉన్నప్పటికీ ప్రకటన చేయకపోవడంపై ప్రజలు చర్చించుకుంటున్నారు. కేసీఆర్, కేటీఆర్, హారీశ్ రావుతో పాటుగా బీఆర్ఎస్ పార్టీపై సంబంధం లేని అంశాల్లో ఆధారాల్లేకుండానే నోటికొచ్చిన విమర్శలు చేసేందుకు పీసీసీ చీఫ్‌తో పాటుగా కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఎప్పుడూ ముందుంటారు. బీజేపీ నేతల విషయానికి వచ్చే సరికి వెనుకడుగు వేయడంపై అనుమానాలు కలుగుతున్నాయి.
భారత రాష్ట్ర సమితి పార్టీపై నిత్యం అసత్య ఆరోపణలతో కాలం వెళ్లదీసే భారతీయ జనతా పార్టీకి మింగుడు పడని అంశంగా బండి సంజయ్ కుమారుడి వ్యవహారం దాపురించింది. ప్రధాని మోడీ పర్యటనకు సరిగ్గా ఒక రోజు ముందే ఈ వ్యవహారం రచ్చ జరగడంతో కాషాయ పార్టీలో కలవరం రేగుతోంది. బండి సంజయ్‌కు బీజేపీ నుంచి సపోర్ట్ కూడా లభించడం లేదు. బీజేపీ అధిష్టానం నుంచి కనీసం మద్ధతుగా ప్రకటన కూడా రాలేదు.
మరోవైపు మోడీ సభకు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను దూరం పెట్టినట్లుగా వార్తలు గుప్పుమంటున్నాయి. మొత్తానికి నరేంద్ర మోదీ పర్యటన ద్వారా ఏదో సాధిద్దామని భావించినప్పటికీ బండి సంజయ్ కుమారుడి ఘటనతో కమలం పార్టీలో ఒక్క సారిగా కుంగుబాటు మొదలైంది. దేశం కోసం… ధర్మం కోసం… అంటూ నినదించే బీజేపీ పార్టీలో కేంద్ర మంత్రిపై వేటు పడుతుందా? చట్ట ప్రకారం కేంద్ర హోంశాక సహాయ మంత్రి కుమారుడిపై చర్యలు తీసుకుంటారా? అన్నది వేచి చూడాల్సి ఉంది.