అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఉమ్మడి జిల్లాల్లో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఆరు గ్యారెంటీల పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. వాటిని అమలు చేయడంలో విఫలమైందని విమర్శలు వెల్లువెత్తాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు బడ్జెట్ కేటాయింపుల్లో అన్యాయం జరిగిందంటూ మండల కేంద్రాల్లో రాష్ట్ర ప్రభుత్వ, సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను శుక్రవారం దహనం చేశారు.
విద్యార్థి, కార్మిక సంఘాలతోపాటు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. నిరుద్యోగ భృతి, రైతు కూలీలకు రూ.12వేలు, 18ఏండ్లు నిండిన యువతులకు స్కూటీలు, రైతుభరోసా రూ.15వేలు తదితర అంశాలపై బడ్జెట్లో కేటాయింపులను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు.
ఆర్మూర్‌టౌన్, జూలై 26: ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద యూఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. విద్యారంగానికి కేంద్రం 2.3శాతం బడ్జెట్ కేటాయించడంపై మండిపడ్డారు. రాష్ట్రంలో మెస్ చార్జీలు ఒక్కో విద్యార్థికి రూ.30 ఇస్తున్నారని, జైల్లో ఉండే ఖైదీకి మాత్రం రూ.150 ఖర్చు చేస్తున్నట్లు విమర్శించారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఖలీల్‌వాడి, జూలై 26: జీవనభృతిపై బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంతో ఆటో డ్రైవర్లు మండిపడ్డారు. నిజామాబాద్ నగరంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు నిరసన తెలిపారు. మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణంతో ఆటో కార్మికుల ఉపాధి దెబ్బతిన్నదని, ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ.12వేల భృతిని అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కటారి రాములు, సభ్యులు ముజీబ్, ప్రభాకర్, లక్ష్మణ్, అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు.
డిచ్పల్లి, జూలై 26: బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 7.3శాతం నిధులు కేటాయించడంపై నిరసన తెలుపుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో టీయూ బస్టాండ్ ఆవరణలో బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. యూనివర్సిటీలన్నీ రూ.500కోట్లతో ఎలా అభివృద్ధి చెందుతాయని ఆవేదన వ్యక్తంచేశారు. టీయూకు నామమాత్రపు నిధులు కేటాయించడం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్యే భూపతిరెడ్డి కలుగజేసుకొని తెలంగాణ యూనివర్సిటీకి రూ.200కోట్ల నిధులను తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ టీయూ ఉపాధ్యక్షుడు చిత్రు, మధు, రఘు, శ్రీనివాస్ పాల్గొన్నారు
వినాయక్‌నగర్, జూలై 26: రాష్ట్ర బడ్జెట్లో ఇందూరుకు తీవ్ర అన్యాయం జరిగిందని బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దినేశ్ మాట్లాడుతూ గల్ఫ్ దేశాలకు వెళ్లిన వలస కార్మికుల కోసం ఎలాంటి నిధు లు కేటాయించలేదన్నారు. జిల్లాలోని నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వ ఇచ్చింది గాడిద గుడ్డేనని విమర్శించారు. కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు, కార్పొరేటర్స్, నగర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి రూరల్/ బాన్సువాడ, జూలై 26: కామారెడ్డి జిల్లాకు, ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడంపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎల్లారెడ్డి పట్టణంలోని గాంధీచౌక్‌లో, బాన్సువాడలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లాలో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నా అభివృద్ధికి మాత్రం ఏమాత్రం నిధులు రాలేదన్నారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్‌రావ్, మండల అధ్యక్షుడు పెద్దెడ్ల నర్సింహులు, పట్టణ అధ్యక్షుడు సతీశ్, కన్వీనర్ లింగారావ్ పాల్గొన్నారు. బాన్సువాడలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ నాయకులు శ్రీనివాస్, కోనాల గంగారెడ్డి, సాయికిరణ్, హన్మాండ్లు, గోపాల్ పాల్గొన్నారు.