నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో బీజేపీ వరుసగా రెండోసారి గెలుపొందింది. జహీరాబాద్‌లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఎన్నికల ముందర బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరిన సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్‌కు ఓటర్లు షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్కార్‌కు పట్టం కట్టారు. ఇక ఇందూరులో సిట్టింగ్ ఎంపీ అర్వింద్ మోదీ హవాలో వరుసగా రెండోసారి విజయతీరాలకు చేరారు. 1.09 లక్షల ఓట్ల మెజార్టీతో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డిపై విజయం సాధించారు.
డిచ్పల్లి/ఖలీల్‌వాడి, జూన్ 4: నిజామాబాద్ పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ నిలబెట్టుకున్నది. సిట్టింగ్ ఎంపీ అర్వింద్ లక్షకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ రెండు, బీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితమయ్యాయి. నిజామాబాద్, జహీరాబాద్ లోక్‌సభ స్థానాలకు గత నెల 13న ఎన్నికలకు జరిగిన సంగతి తెలిసిందే. నిజామాబాద్‌కు సంబంధించి డిచ్పల్లిలోని సీఎంసీలో మంగళవారం కౌంటింగ్ నిర్వహించారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ నిర్వహించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.
నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ధర్మపురి అర్వింద్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. సమీప ప్రత్యర్థి జీవన్‌రెడ్డిపై 1,09,241 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అర్వింద్‌కు 5,92,318 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డికి 4,83,077 ఓట్లు వచ్చాయి. 1,02,406 ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మూడో స్థానంలో నిలిచారు. బీజేపీ గెలుపుతో పార్టీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి. వాస్తవానికి ఎన్నికల ముందర అర్వింద్‌పై ప్రజల్లోనే కాదు, సొంత పార్టీలోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కానీ, మోదీ చరిష్మాతో ఆయన గట్టెక్కారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రెండో స్థానానికే పరిమితమైంది. ఈవీఎంలతో పాటు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు సైతం బీజేపీకే ఎక్కువగా పడ్డాయి. మొదటి నుంచీ ఆ పార్టీకి మెజార్టీ కనిపించినా, కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు ఎక్కువగా ఓట్లు రావడంతో ఉత్కంఠ నెలకొన్నది. మధ్యాహ్నం తర్వాత స్పష్టత రావడంతో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి కౌంటింగ్ మధ్యలోనే వెళ్లిపోయారు.
నిజామాబాద్‌లో బీజేపీ గెలవడం మోదీ కుటుంబ విజయమని ఆ పార్టీ అభ్యర్థి అర్వింద్ అన్నారు. గెలుపొందిన అనంతరం ఆయన కౌంటింగ్ కేంద్రం వద్ద విలేకరులతో మాట్లాడారు. తన విజయం మోదీ టీమ్ విజయమని, భారతమాత గెలుపని అన్నారు. మోదీ గెలుపు కోసం కష్టపడిన బూత్ స్థాయి కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు. వెంట నిలిచిన యువతకు, మహిళలకు, రైతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సంగారెడ్డి జూన్ 4(నమస్తే తెలంగాణ): జహీరాబాద్ పార్లమెంట్‌ను కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్కార్ 47,896 ఓట్ల మెజార్టీతో సమీప బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్‌పై విజయం సాధించారు. జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్కార్‌కు 5,23,919 ఓట్లు వచ్చాయి. బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్‌కు 4,76,023 ఓట్లు సాధించారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌కు 1,71,412 ఓట్లు వచ్చాయి. సమీప బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్‌పై కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేశ్ షెట్కార్ 47,896 ఓట్ల మెజార్టీతో ఎంపీగా గెలుపొందారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన మొదటి రౌండ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అధిక్యతను కనబరుస్తూ వచ్చారు. ఎన్నికల్లో ఆశించిన ఫలితం రాకపోవడంతో బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ఓట్ల లెక్కింపు పూర్తికాకముందే పోలింగ్ కేంద్రం నుంచి అసంతృప్తిగా వెళ్లిపోయారు. ఉదయం 8గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు రాత్రి 7గంటల వరకు కొనసాగింది. 7గంటల తర్వాత ఎన్నికల అధికారి వల్లూరు క్రాంతి కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్కార్ గెలుపొందినట్లు ప్రకటించారు. సురేశ్ షెట్కార్ తన కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి వల్లూరు క్రాంతి నుంచి ఎంపీ ఎన్నికల్లో గెలుపు ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో చివరి అంకమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. నిజామాబాద్ లోక్‌సభ పరిధిలోని ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పోలైన ఓట్లను సీఎంసీ మంగళవారం లెక్కించారు. రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు నేతృత్వంలో జగిత్యాల కలెక్టర్ యాస్మిన్ భాషా, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, ట్రైనీ కలెక్టర్ సంకేత్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులు కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎలిస్ వజ్ ఆర్, లలిత్ కుమార్ ఓట్ల లెక్కింపును పరిశీలించారు. ఉదయం 5 గంటల నుంచే కౌంటింగ్ కోసం సన్నాహాలు చేపట్టారు. ఎన్నికల పరిశీలకులు, అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో కలెక్టర్ నేతృత్వంలో కౌంటింగ్ సిబ్బంది 3వ ర్యాండమైజేషన్ నిర్వహించి ఆ జాబితా ప్రకారంగా సిబ్బందికి ఆయా టేబుళ్ల వద్ద ఓట్ల లెక్కింపు బాధ్యతలు కేటాయించారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించగా, అనంతరం ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కిస్తూ రౌండ్ల వారీగా ఫలితాలను వెల్లడించారు. బీజేపీ అభ్యర్థి అర్వింద్ 1,09,241 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు కలెక్టర్ ప్రకటించారు. నోటాకు 4440 ఓట్లు పోల్ అయ్యాయన్నారు. మొత్తం 7,780 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 414 ఓట్లు వివిధ కారణాలతో చెల్లుబాటు కాలేదని వివరించారు. మధ్యాహ్నం 3గంటల వరకు ఓట్ల లెక్కింపు పూర్తి కాగా..గెలుపొందిన ధర్మపురి అర్వింద్‌కు పరిశీలకుల సమక్షంలో కలెక్టర్ ధృవీకరణ పత్రాన్ని అందజేశారు.
కౌంటింగ్ కేంద్రంతోపాటు పరిసర ప్రాంతాల్లో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి 144 సెక్షన్ నిషేధాజ్ఞలు అమలు చేశారు. కౌంటింగ్ కేంద్రంలోనికి ఇతరులెవరినీ అనుమతించలేదు. కౌంటింగ్ సిబ్బందితోపాటు వివిధ బాధ్యతలు నిర్వర్తించిన సిబ్బందికి ఎంట్రీ పాసులు జారీ చేసినప్పటికీ వారిని సైతం క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి పంపించారు. సెల్ఫోన్లు, వీడియోలు, కెమెరాలను నిషేధించారు. పోలీసు బందోబస్తును సీపీ కల్మేశ్వర్ సింగేనవార్ పర్యవేక్షించారు. ఎన్నికలు సాఫీగా ముగించడంలో సహకరించిన వారికి రిటర్నింగ్ అధికారి రాజీవ్‌గాంధీ హన్మంతు కృతజ్ఞతలు తెలిపారు.