సీఎం కేసీఆర్ విజన్‌తో తెలంగాణ పల్లెలు కొత్త రూపు సంతరించుకున్నాయి. ‘పల్లెప్రగతి’తో దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ సీమలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. దేశానికి వెన్నెముకగా భావించే గ్రామ పాలనకు జవసత్వాలు వచ్చాయి. ఇటీవల కేంద్రం ప్రకటించిన 20 ఉత్తమ గ్రామాల్లో సగానికి పైగా తెలంగాణ పల్లెలే ఉండడం నిదర్శనం. అదే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, స్వార్థ రాజకీయాలతో దేశం అన్ని రంగాల్లో వెనుకబడి పోయింది. పల్లెల్లో అభివృద్ధి పడకే సింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ మోడల్ పాలనను యావత్ దేశం కోరుకుంటున్నది. తెలంగాణలో అమలవుతున్న పథకాలు తమకూ కావాలని బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లోని ప్రజల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరమనే భావన వ్యక్తమవుతున్నది.
కమ్మర్పల్లి, సెప్టెంబర్ 14: తెలంగాణలో అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలను దేశమంతా ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నది. తెలంగాణలో చేపడుతున్న పథకాలు తమకూ కావాలని ఇతర రాష్ర్టాల ప్రజలు కోరుతున్నారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి సాధించిన తెలంగాణను అనతికాలంలోనే దేశమంతా ఆదర్శంగా చూసేలా తీర్చిదిద్దిన కృషిని చూస్తూ అబ్బుర పడుతున్నారు. పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారిపోతుంటే.. కనీస సదుపాయాలు అంది వస్తుంటే.. తెలంగాణ పల్లెలు అభివృద్ధితో అలరారుతున్నాయి. కేసీఆర్ విజన్‌తో దేశ అభివృద్ధికి మూలమైన పల్లె అభివృద్ధిలో, పరిపాలనలో తొలిమెట్టయిన గ్రామ పంచాయతీలు అసలు సిసలైన భూమిక పోషిస్తుండగా సర్పంచులు విధి నిర్వహణలో క్రియాశీలపాత్ర పోషించగలుగుతున్నారు. ఈ విజన్‌నే నేడు ఇతర రాష్ర్టాల ప్రజలు కోరుకుంటున్నారు. అందుకు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని, జాతీయ స్థాయిలో పార్టీని స్థాపించాలని ఆకాంక్షిస్తున్నారు. కేసీఆర్ అందిస్తున్న ఫలాలు దేశమంతా అందాలని తెలంగాణలోని సకలవర్గాలు కోరుకుంటున్నాయి.
దేశాన్ని ఆకర్షించిన హరితహారం..
స్వరాష్ట్రం సిద్ధించక ముందు తెలంగాణ ప్రాంతంలో గ్రామాల అభివృద్ధి కోసం పల్లె ప్రజలు ఎదురు చూసేవారు. చిన్న మురికి కాలువ కావాలన్నా, ఓ సీసీ రోడ్డు వేయాలన్నా ప్రజలు సర్పంచుల చుట్టూ, సర్పంచులు ముఖ్యమైన ప్రజా ప్రతినిధుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా మంజూరయ్యేవి కావు. రాష్ట్రం వచ్చాక పల్లెకు కావాల్సిందేమిటో మనసుతో చూసిన నాయకుడిగా గ్రామాల అభివృద్ధికి కేసీఆర్ పెద్దపీట వేశారు. ఒక గ్రామం కోసం గ్రామ పంచాయతీకి ఆర్థిక సంఘ నిధులు ఎన్ని వస్తే దానికి సమానమైన నిధులను నెలనెలా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిస్తూ గ్రామ పంచాయతీలను బలోపేతం చేశారు. పల్లె ప్రకృతి కార్యక్రమాన్ని చేపట్టి గ్రామాలకు అవసరమైన కీలకమైన అభివృద్ధి పనులకు నిధులు అందే మార్గం సుగమం చేశారు. పల్లెల్లో పారిశుద్ధ్య నిర్వహణను కొత్త పుంతలు తొక్కించారు. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ సమకూర్చేలా చేశారు. డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు నిర్మింపజేశారు. మనిషి చనిపోతే పెంట కుప్పల పక్కన, దుర్గంధాల మధ్య, బొందల గడ్డల కాడ ధీనాతిదీనంగా అంత్యక్రియలు చేసే దుస్థితిని వైకుంఠధామాలు నిర్మించి తప్పించారు. పచ్చదనాన్ని పెంపొందించడంలో దేశమంతా ఆకర్షిస్తున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీలకు అప్పగించి దేశానికే ఆదర్శంగా మన పల్లెలను నిలుపుతున్నారు.
కేసీఆర్ విజన్..
కేసీఆర్ తనదైన విజన్‌తో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ దేశమంతా ఆకర్షిస్తున్నాయి. ఇటీవల దేశంలోనే అభివృద్ధి చెందిన గ్రామాల జాబితాను కేంద్రం ప్రకటించింది. అందులో మొదటి 20 గ్రామాల్లో తెలంగాణకు చెందినవే ఎక్కువగా ఉండడం..కేంద్రంతోపాటు ఇతర రాష్ర్టాలను ఆలోచింపజేసింది. కేంద్రం అందిస్తున్న ప్రోత్సాహంతో మిగతా రాష్ర్టాలకు చెందిన గ్రామాలు, ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ర్టాల్లోని గ్రామాలు ఉత్తమ జాబితాలో ఎందుకు నిలువ లేదనే ప్రశ్నలు వినిపించాయి. తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పల్లెప్రగతి, పారిశుద్ధ్యం కోసం ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ అందించడం..గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేయడంతోనే దేశంలోనే మొదటి 20 గ్రామాల జాబితాలో తెలంగాణ పల్లెలు నిలిచాయి. తెలంగాణలో చిన్నచిన్న గిరిజన తండాలను మా తండా.. మా పాలన అని సంబురపడేలా పంచాయతీలుగా మార్చి గిరిజనులకు స్వపరిపాలనా సాధికారతను అందించిన వైనం దేశమంతా గమనించింది. ఇలా ఎన్నో కార్యక్రమాలు తెలంగాణ ఇంటా.. బయటా కేసీఆర్ దేశానికి నాయకత్వం వహించాలనేలా చేశాయి.
దేశం కోసం గొంగళి పురుగునైనా ముద్దాడ గల నేత కేసీఆర్
దేశంలో కొందరు నేతల పర మతద్వేషాన్ని చూస్తున్నాం. అధికారం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చే నేతలను చూస్తున్నాం. కానీ దేశం కోసం, దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లేందుకు గొంగళి పురుగునైనా ముద్డాడే నాయకుడి కోసం సకల వర్గాలు ఎదురుచూస్తున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆరే వారందరికీ సరైన నాయకుడిగా కనిపిస్తున్నారు. అందుకే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని దేశం కోరుకుంటున్నది.
– రాజారెడ్డి, సర్పంచ్, రెంజర్ల, సర్పంచుల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు, ముప్కాల్
దేశానికి కేసీఆర్ సేవలు అందాలి
మనకు అందుతున్నట్లే కేసీఆర్ సేవలు దేశమంతా అందాలి. అందు కు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి. టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారి గులాబీ వెలుగులు దేశమంతా అందించాలి. దేశమంతా ఇదే కోరుకుంటున్నది. అరవై ఏండ్ల సుదీర్ఘ ఆకాంక్షను నెరవేర్చిన ఘనచరిత్ర కేసీఆర్‌దని దేశమంతా తెలుసు. విప్లవాత్మక రాజకీయ పరిణామం కేసీఆర్ వల్లే సాధ్యం కానున్నదనే ఆలోచన దేశ ప్రజల మస్తిష్కాల్లో ఉన్నది.
– వనజ, సర్పంచ్, చిట్టాపూర్, బాల్కొండ మండలం
కేసీఆర్‌తోనే దేశంలో సాధికారత సాధ్యం
పల్లె నుంచి ఢిల్లీ దాకా పాలనలో ప్రజల సాధికారత కోరుకునే నేత కేసీఆర్. తెలంగాణలో గ్రామ పంచాయతీలను బలోపేతం చేసి, అభివృద్ధి, సేవలు అందించేలా సంస్కరించారు. కొత్త జిల్లాలు, మండలాలను ఏర్పాటు చేసి పరిపాలనను వికేంద్రీకరించి ప్రజల దరికి చేర్చారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలు చేసి వారికే పాలనాపగ్గాలు అందించారు. కేసీఆర్‌తోనే దేశంలో ప్రజాసాధికార స్వయం పాలన అందుతుందనడానికి ఇది నిదర్శనం.
– గుగులోత్ భాస్కర్, సర్పంచ్, డీసీ తండా, కమ్మర్పల్లి మండలం
కేసీఆర్ జాతీయ పార్టీ రావాలి
కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టాలి. దేశ రాజకీయాల్లో మేలి మలుపు తేవాలి. ఇదే ప్రస్తుతం హాట్‌టాపిక్. నేషనల్ పాలిటిక్స్ అనేకన్నా నేషన్ నీడ్ కేసీఆర్ విజన్ అనే ఆలోచనలు,ఆశలు ఉన్నాయి. అందుకే కేసీఆర్ సార్ జాతీయ పార్టీ పెట్టుడే. తెలంగాణ అంతా కేసీఆర్‌కు మద్దతుగా నిలుచుడే.
– తోట శంకర్, సర్పంచుల ఫోరం భీమ్‌గల్ మండల అధ్యక్షుడు
మహిళల సంక్షేమానికి మంచి తరుణం
తెలంగాణలో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మానవీయ పథకాలు దేశానికే మోడల్ పథకాలు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఒంటరి మహిళలకు పింఛన్ లాంటి పథకాలే ఇందుకు నిదర్శనం. ఇలాంటి పథకాలు అవసరం లేని రాష్ట్రం ఉందా? ఇలాంటి పథకాలు అందించే నాయకుడు దేశానికి అవసరం లేదా ? అందుకే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉన్నది.
– బోగ ధరణి, సర్పంచ్ మోర్తాడ్, సర్పంచుల ఫోరం జిల్లా సభ్యురాలు,
కేడీ పాలిటిక్స్‌కు చరమగీతం పాడేది కేసీఆరే..
దేశాన్ని కార్పొరేట్ల పరం చేసే కేడీ రాజకీయాలు ఆగాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిందే. కేడీ రాజకీయాలకు బైబై చెప్పే దమ్మున్న వారు కేసీఆర్‌తో జోడీ కట్టాలి.యువతను మత విద్వేషాల మత్తుతో కమ్మేస్తున్న ని‘షా’ల రాజకీయాలను ఎండగట్టే దమ్మున్న కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి తప్పనిసరిగా వెళ్లాలి.
– నోముల రవి, సర్పంచ్, బోదెపల్లి, బాల్కొండ మండలం
కేసీఆర్ ప్రస్థానం దేశం వైపు సాగాల్సిందే..
ఉద్యమ నేతగా చారిత్రక విజయం సాధించడంలో కేసీఆర్ విజన్, తెలంగాణ తెచ్చింది ప్రజలు కోసమేనని ప్రజా పథకాలతో నిరూపిస్తున్న సీఎం కేసీఆర్ విజన్ దేశం వైపు సాగాలి. కేంద్రం కక్ష, అసూయపూరిత వైఖరితో ఇబ్బందిపడుతున్న దేశ ప్రజల కోసం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో అడుగిడాల్సిందే..
– ఏనుగు పద్మ, సర్పంచ్, హాసాకొత్తూర్, కమ్మర్పల్లి మండలం
సబ్కా ప్యారా నేత ప్రధాని కావాలి
దేశాన్ని తాకట్టు పెట్టే నేతల దుమ్ము దులిపే నాయకులను, దేశాన్ని మత విద్వేషాల మంటల్లో కాల్చేస్తున్న రాజకీయాలను ఎక్కడికక్కడా ఎండగట్టే నేతను దేశంలో ఎవరైనా ప్రేమిస్తారు. అలాంటి నాయకుడు కేసీఆర్. ఆయన ప్రధాని కావాలని దేశం ఆహ్వానిస్తున్నది. ఆశీర్వదిస్తున్నది. ఇది దేశానికి శుభపరిణామం.
– మిస్బా, సర్పంచ్, పోచంపాడ్, మెండోరా మండలం
దేశానికి మార్గం చూపడం ఖాయం
మనది వ్యవసాయాధారిత దేశం అని చిన్నప్పటి పాఠాల్లో చదువుకు న్నాం. దేశంలో సాగునీటి అభివృద్ధి, సాగుకోసం కనీస ఆర్థిక మద్దతు, రైతు కుటుంబానికి భరోసా ఇస్తున్న రాష్ట్రం ఉన్నదా? తెలంగాణ ఉన్నది. రైతుకు అండగా నిలిచింది. ఇదే దేశమంతా జరగాలి. అందుకు మన తెలంగాణ నాయకుడు కేసీఆర్ దేశానికి మార్గం చూపనున్నాడు.
– పత్తిరెడ్డి ప్రకాశ్ రెడ్డి, సర్పంచ్, తడ్పాకల్, ఏర్గట్ల మండలం