నిజామాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచార పర్వంలో ప్రతిపక్ష పార్టీలు నిర్వహిస్తున్న సభలకు స్పందన కరువైంది. జనాలు లేక బీజేపీ, కాంగ్రెస్ కార్యక్రమాలు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. మొన్న కామారెడ్డిలో కాంగ్రెస్ సభకు కర్ణాటక సీఎం అతిథిగా వచ్చినప్పటికీ జనాల నుంచి స్పందన కరువైంది. పీసీసీ చీఫ్ హాజరైన ఈ కార్యక్రమంలో ప్రజల కన్నా ఎక్కువగా ఖాళీ కుర్చీలే దర్శనమివ్వడం గమనార్హం.తాజాగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం బీజేపీ నిర్వహించిన సభా కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఏకంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరైన బహిరంగ సభకు ఇందూరువాసులు మొఖం చాటేశారు. నడ్డా ప్రసంగ సమయానికి సగాని కన్నా ఎక్కువ ఖాళీగానే కనిపించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి వరుస కట్టి వస్తున్న బీజేపీ నేతలకు ఇందూరు గడ్డపై పరాభవమే ఎదురవుతోంది. సాక్షాత్తు మోదీ వచ్చినప్పటికీ ఈ ప్రాంతంలో జనాల స్పందన అంతంత మాత్రంగానే ఉండగా.. ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడికి సైతం అదే స్థాయిలో స్పందన లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
గిరిరాజ్ కళాశాల మైదానంలో నిర్వహించిన బీజేపీ ప్రచార సభ కొద్దిపాటి ఏర్పాట్లతోనే నిర్వహించినప్పటికీ అందులోనూ జనాలు లేక వెలవెలబోవడం కనిపించింది. బీజేపీ అధ్యక్షుడు ప్రసంగం మొదలు పెట్టే సమయానికి మైదానంలో అతి తక్కువ మంది కనిపించారు. వెలవెలబోతున్న సభికులను చూసి నివ్వెర పోయిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు దిక్కుతోచని స్థితిలో నాలుగు మాటలతోనే ప్రసంగాన్ని పరిమితం చేసుకోవాల్సి వచ్చింది. హెలికాప్టర్లో వచ్చిన ఆయనకు జనాలే లేకపోవడాన్ని గమనించి స్థానిక నాయకుల దుస్థితిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. జాతీయ స్థాయి అధ్యక్షుడి సభకు జనాలను పట్టుకొచ్చే దమ్ము లేదా? అంటూ ప్రశ్నించినట్లుగా స్థానిక నాయకులే చెప్పుకుంటున్నారు. మొత్తానికి జేపీ నడ్డా సభ తుస్ మనడంతో కాషాయ శ్రేణులు ఆగమాగమవుతున్నాయి. ఆయనో జాతీయ పార్టీకి అధ్యక్షుడే అయినప్పటికీ ఇందూరు వేదికగా అన్నీ అసత్యాలు వల్లించాడు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కనీసం చిత్తశుద్ధిని ప్రదర్శించలేదు. కేంద్రం ద్వారా జిల్లాకు ఒరిగిన ఒక్క మేలును కీర్తించుకోలేక పోయారంటే కేంద్రం చేసిందేమీ లేదన్నది ప్రజలు గ్రహించారు.