కామారెడ్డి, అక్టోబర్ 27 : బీహార్ నుంచి వలస వచ్చిన ఓ కూలీ దళిత యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలోని ఫరీద్‌పేట గ్రామంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకోగా, న్యాయం చేయాలని కోరుతూ బాధిత కుటుంబ సభ్యులు, దళిత సంఘాల ప్రతినిధులు సోమవారం ఆందోళనకు దిగారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. బీహార్ నుంచి వచ్చిన వ్యక్తి ఫరీద్‌పేట్ సమీపంలోని రైస్‌మిల్‌లో కూలీగా పని చేస్తున్నాడు.
పత్తి చేనులో పని చేసుకుంటున్న మహిళ (45)ను గమనించిన సదరు కూలీ.. ఆదివారం సాయంత్రం ఆమెపై దారుణానికి ఒడిగట్టాడు. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని స్థానికులు గుర్తించి ఆమెను కామారెడ్డి దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. మరోవైపు, లైంగిక దాడి విషయం తెలిసిన దళిత సంఘాల నేతలు.. సోమవారం రైస్‌మిల్‌ను ముట్టడించేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, బాధితురాలి వైద్యానికి అయ్యే ఖర్చులు భరించాలని డిమాండ్ చేశారు. చివరకు రైస్‌మిల్ యజమాని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.