నిజామాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బిగాల మహేశ్ గుప్తా ప్రముఖ ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఆ సమయంలో ప్రభుత్వ పాఠశాలలో సాధారణ సౌకర్యాలతోనే నడిచేవి. కానీ ఆ పాఠశాల ఇచ్చిన బలమైన పునాది వల్లే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. చదువు మనిషిని మారుస్తుంది. సమాజాన్ని మారుస్తుంది అనే సూక్తికి ఉదాహారణగా నిలిచారు. తన విజయాలు పాఠశాలకు కృతజ్ఞతగా తిరిగి ఇవ్వాలనే సంకల్పంతో బిగాల మహేశ్ తమ మాతృ విద్యాలయానికి సాయం అందించడం ప్రారంభించారు.
కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రారంభమైన మన ఊరు మన బడి కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని తాను విద్యనభ్యసించిన స్కూల్‌కు రూ.కోటి సాయం అందించారు. నాటి ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి రూ.4.70కోట్లు నిధులు తీసుకొచ్చారు. మొత్తం రూ.5.70కోట్లతో ఒక సాధారణ సర్కార్ బడిని కార్పొరేట్ పాఠశాలను తలదన్నేవిధంగా తీర్చిదిద్దారు. తన జీవితాల్లో అసాధారణ విజయాలు సాధించి పేరు ప్రఖ్యాతులు సాధించినప్పటికీ తన మూలాలను మరిచి పోకుండా తగువురున్న బడికి ఉదారవంతమైన సాయం అందించడం ద్వారా సమాజానికి మార్గదర్శకులుగా బిగాల మహేశ్ నిలిచారు.
మన ఊరు మన బడిలో భాగంగా మాక్లూర్ జిల్లా పరిషత్ హై స్కూల్ (జడ్పీహెచ్ఎస్), మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (ఎంపీపీఎస్)కు పునరుద్ధరణ చర్యలు ప్రారంభమయ్యాయి. 2021లో తెలంగాణ విద్యా సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టీజీఈడబ్ల్యూఐడీసీ) ద్వారా మాక్లూర్ ప్రైమరీ, హైస్కూల్ పునరుద్ధరణకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్వం ఇరుకు గదులు, చాలీచాలని బెంచ్‌లు, విద్యార్థుల సంఖ్యకు సరిపడా స్థలం లేక అవస్థలు ఉండేవి. మన ఊరు మన బడి స్ఫూర్తితో మాక్లూర్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను ఒకే గొడుగు కిందకు తీసుకు వచ్చి జీ ప్లస్ వన్ రూపంలో నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్లో 13,312 చదరపు అడుగుల విస్తీర్ణంలో 10 విశాలమైన తరగతి గదులను నిర్మించారు.
ఉపాధ్యాయుల కోసం స్టాఫ్ రూమ్‌లు 2, పరిపాలన గది ఒకటి, హెడ్ మాస్టర్ గదులు 2, లైబ్రరీ బ్లాక్ 1 చొప్పున న్రిమించారు. మొదటి అంతస్థులో 12,556 చదరపు అడుగుల్లో 10 తరగతి గదులు, స్టాఫ్ రూమ్ 1, కంప్యూటర్ ల్యాబ్ 1, బాటనీ/జూవలజీ ల్యాబ్ 1, ఫిజిక్స్/కెమిస్ట్రీ ల్యాబ్ 1 చొప్పున నిర్మించారు. రూ.58.51లక్షల వ్యయంతో అదనపు సౌకర్యాలను పాఠశాల ఆవరణలో నెలకొల్పారు. వంద మంది విద్యార్థులకు సరిపడేలా 1893 చదరపు అడుగుల వైశాల్యంతో డైనింగ్ హాల్, పాఠశాల మొత్తానికి విద్యుతీకరణ, మొదటి అంతస్థులో అందమైన టైల్స్‌ను అమర్చారు. రూ.36లక్షలతో 4 టాయిలెట్స్ బ్లాక్స్(బాల, బాలికలకు వేర్వేరుగా), రెండు కిచెన్ షెడ్లు, 288 మీటర్ల కంపౌండ్ వాల్ నిర్మించారు.
బిగాల మహేశ్ అందించిన సహకారానికి విద్యాశాఖ తగు చర్యలు చేపట్టింది. అధికారికంగా రూ.కోటి సాయం అందించారు. అనధికారికంగా వసతుల కల్పనకు మరో రూ.కోటిన్నర వరకు అదనపు ఖర్చులను బిగాల మహేశ్ గుప్తా భరించారు. ఈ మేరకు బిగాల మహేశ్ తండ్రి బిగాల కృష్ణమూర్తి, తాత బిగాల గంగారాం పేర్లను నూతన పాఠశాల భవనాలకు పెట్టింది.
జడ్పీహెచ్ఎస్ నూతన ప్రాంగణం ఇకపై బిగాల కృష్ణమూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగా, ఎంపీపీఎస్ ప్రాంగణం బిగాల గంగారాం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలగా మనుగడలోకి రానుంది. మొన్నటి వరకు కూలిన గోడలు, విరిగిన తలుపులు, కిటికీలు, చిక్కి శల్యమైన మైదానం, అందుబాటులో లేని మరుగుదొడ్లు, మూత్రశాలల వల్ల విద్యార్థులకు అవస్థలు ఎదురయ్యాయి. ఈ పరిస్థితిని చూసి చలించిన మహేశ్ బిగాల తనవంతుగా ఏదైనా కార్యం తలపెట్టాలని భావించి బడిని బాగు చేయాలని నడుం బిగించారు. బిగాల మహేశ్ గుప్తా సహకారం కేవలం డబ్బు మాత్రమే కాదు. పిల్లల భవిష్యత్తుకు పెట్టుబడిగా మారింది. తరగతి గదులు, ల్యాబ్‌లు, లైబ్రరీలు వంటివి నిర్మించబడటంతో విద్యార్థులకు ఎంతో ఉపయుక్తం కానుంది.