నిజామాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నిజామాబాద్ నగరంలో అభివృద్ధి ఐదేళ్లు వెనక్కు నెట్టవేయబడిందని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చారిత్రక నిజామాబాద్ ప్రాంతం అనాథగా మారిందన్నారు. బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ ఏం చేస్తున్నాడో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. షబ్బీర్ అలీ పూటకో మాట మాట్లాడుతూ అబద్ధపు ప్రచారాలతో కాలం గడుపుతున్నారని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్మీట్లో గణేష్ గుప్తా దుయ్యబట్టారు.
నిజామాబాద్ నగర కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. గతంలో గులాబీ జెండా ఎగిరేస్తామంటే కొంత మంది ఎగతాళి చేశారని… ఆ తర్వాత ఎన్నికల్లో మేయర్ పీఠం కైవసం చేసుకుని నిరూపించామన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని బిగాల ధీమా వ్యక్తం చేశారు. విజయం సాధించేందుకు తమకు అనేక వ్యూహాలు ఉన్నయాన్నారు. గోడలపై పిచ్చి రాతలు రాస్తూ కుల, మతాల మధ్య చిచ్చు పెట్టడాన్ని మాజీ ఎమ్మెల్యే తీవ్రంగా తప్పు పట్టారు. ఈ రాతలు మంచివా? కుల, మతాల మధ్య చిచ్చు పెట్టడం కరెక్టా? అని నిలదీశారు.
ఈ విషయంలో మీడియా స్పందించి నిలదీయాలన్నారు. ప్రతిపక్షానికి గొంతుకగా నిలిచి ప్రజా సమస్యలపై గొంతెత్తాలని హితవు పలికారు. నిజామాబాద్ నగరంలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు విలవిల్లాడుతున్నాయని వ్యాఖ్యానించారు. నగర ఓటర్లందరూ విజ్ఞతతో ఆలోచించి మంచి నిర్ణయాన్ని తీసుకోవాలని కోరారు. కేసీఆర్ దయతో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని కులాలకు భవనాలు కట్టించామని గుర్తు చేశారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు ఎన్ని కుల సంఘాలకు భవనాలు కట్టించారని ప్రశ్నించారు.
నిజామాబాద్ నగర ప్రజలు ఇచ్చిన నిర్ణయానికి కట్టుబడి దూరం నుంచి, దగ్గరి నుంచి రెండేళ్లుగా కాంగ్రెస్ పరిపాలనను క్షుణ్నంగా పరిశీలన చేశామని గణేశ్ గుప్తా చెప్పుకొచ్చారు. కేసీఆర్ చెప్పినట్లుగా కొంత సమయం ఇవ్వాలనే ఆలోచనతో తొందరపడొద్దనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అధికార పార్టీని, స్థానిక బీజేపీ ఎమ్మెల్యేను నిలదీయలేదన్నారు. వ్యక్తిగతంగా ఎవ్వరిపైనా ఆరోపణలు చేసే సంస్కృతి తనది కాదన్నారు. ప్రజల కోసం, సమస్యలపై గళం విప్పే పద్ధతి తన సొంతమన్నారు.
ప్రజలు మనల్ని ఎందుకు ఎన్నుకున్నారో? కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆలోచన చేయాలన్నారు. ప్రజా సేవ చేసేందుకా? కుల, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకా? అన్నది గమనించాలని హితవు పలికారు. ఎమ్మెల్యే ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు రాగానే కుల, మతాల మధ్య చిచ్చు పెట్టడం మంచిదా? అని బిగాల ప్రశ్నించారు. పదేళ్ల కాలంలో నాకు దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నానని ప్రతి క్షణం నగరాభివృద్ధికై పాటుపడ్డట్లుగా తెలిపారు. సమీకృత కలెక్టరేట్,
న్యాక్ భవనం, గిరిరాజ్ కాలేజీ రెండో బ్లాక్, ఐటీ హబ్, విజయ టాకీస్ పక్కన అండర్ పాస్ రోడ్డు, మినీ ట్యాంక్ బండ్, అధునాతనంగా మూడు వైకుంఠ ధామాలు, 25కిలో మీటర్లు డివైడర్లు, అడుగడుగునా చెట్లు, వీధి దీపాలు, 25 కిలో మీటర్లు పొడవునా విద్యుత్ స్తంభాలకు అలంకరణ లైట్లు పెట్టినట్లుగా చెప్పారు. వీటితో పాటుగా ఎస్టీపీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, రూ.6 కోట్లతో మైనార్టీ స్కూళ్లు నిర్మించి ప్రారంభించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నగరానికి దౌర్భగ్యకరమైన దుస్థితి వాటిల్లిందన్నారు.
నిజామాబాద్ నగరంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక శాంతి, భద్రతలు మంటగలిశాయని బిగాల గణేశ్ గుప్తా చెప్పారు. నడీ రోడ్డుపై కానిస్టేబుల్‌ను చంపేస్తే దిక్కూ లేదని, నిన్న కాక మొన్న ఎక్సైజ్ కానిస్టేబుల్‌ను గంజాయ్ స్మగ్లర్లు కారుతో ఢీ కొట్టినా సోయి లేదన్నారు. నగరంలో అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు. నాడు, నేడు అదే పోలీస్ వ్యవస్థ ఉన్నప్పటికీ ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ప్రస్తుతం రాజకీయ వ్యవస్థ సరిగా లేదని ఆరోపించారు. శంభుని గుడి వ్యాపార దుకాణాల తరలింపుపై బీఆర్ఎస్ హయాంలో అన్ని పార్టీలతో మాట్లాడి ముందుకు వెళ్లామన్నారు.
ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు. బీఆర్ఎస్ హయాంలో అడుగడుగునా కాళ్లలో కట్టె పెట్టిన ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే ఇప్పుడు ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు. మురికి కాలువలను చూసి పెడబొబ్బలు పెట్టిన నోటికి ఇప్పుడేమైందన్నారు. ఆ కాలువల్లో ఇప్పుడేమైనా సుగం ధం వెదజల్లుతున్నదా? అని ప్రశ్నించారు. నగరంలో మేం నాటిన మొక్కలకు నీళ్లు పోసే నాథుడు కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశా రు. సమావేశంలో మాజీ మేయర్ నీతూ కిరణ్, ను డా మాజీ ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సిర్ప రాజు, సుజిత్ సింగ్ ఠాకూర్, స త్య ప్రకాశ్ దండు శేఖర్, నీలగిరి రాజు తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా 2022, సెప్టెంబర్ 5న సీఎం కేసీఆర్ రూ.100 కోట్లు మంజూరు చేశారన్నారు. కానీ ఆ నిధులను మేమే తీసుకు వచ్చామంటూ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ చెప్పుకోవడం సిగ్గు చేటని గణేశ్ గుప్తా ఆరోపించారు. ఆ జీవో కాపీలు అన్నీ నా వద్ద ఉన్నాయని చెప్పారు.
టెండర్లు, అగ్రిమెంట్లు చేసుకున్న తర్వాత ఆ పనులకు శంకుస్థాపనలు సైతం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో కేవలం రూ.10కోట్లు మాత్రమే తెచ్చిందని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని నగరాభివృద్ధికి పాటుపడ్డామని తెలిపారు. కేటీఆర్ చొరవతో రూ.60కోట్లు నిధులు తీసుకు వస్తే వాటిని కూడా బీజేపీ ఎమ్మెల్యే తన ఘనతగా చెప్పుకోవడం హేయమైందన్నారు. వాటర్ సైప్లె కోసం అమృత్ పథకంలో రూ.300కోట్లు తెచ్చామంటూ షబ్బీర్ అలీ మరో అబద్ధాన్ని చెబుతున్నారని మండిపడ్డారు. అమృత్ స్కీమ్‌లో కేంద్రం వాటా 33శాతం ఉంటే రాష్ట్రం వాటా దాదాపుగా 57శాతం ఉంటుందన్నారు.
ఈ నిధులను తన హయాంలోనే తెచ్చామని గణేశ్ గుప్తా తెలిపారు. నిజామాబాద్ నగర అభివృద్ధి విషయంలో చర్చకు తాను సిద్ధమేనని అన్నారు. రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన సమీకృత మార్కెట్లు శిథిలావస్థకు చేరుతున్నప్పటికీ ప్రజలకు కేటాయించక పోవడం దారుణమన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందన్నారు. నగరంలో పార్కులు కళావిహీనంగా మారాయన్నారు. ఒపెన్ జిమ్ములకు రిపేర్లు లేవన్నారు.