ఖలీల్‌వాడి, డిసెంబర్ 29 : జిల్లాకేంద్రంలోని బోర్గాం కమాన్ వద్ద హైవేపై దివంగత ప్రధాని స్వర్గీయ పీవీ నర్సింహారావు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గురువారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీవీ నర్సింహారావు మన దేశానికి తొమ్మిదో ప్రధానమంత్రిగా 1991 నుంచి 1996 వరకు పని చేశారని, ఆయన బహుభాషావేత్త, రచయిత, భారత ఆర్థిక సంస్కరణల పితామహుడని కొనియాడారు. కార్యక్రమంలో ధర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు, జిల్లా ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు బాజిరెడ్డి జగన్, స్థానిక జడ్పీటీసీ సభ్యురాలు బొల్లెంక సుమలతా గోపాల్‌రెడ్డి, ఎంపీపీ అనూషా ప్రేమ్నాయక్, వైస్ ఎంపీపీ అన్నం సాయిలు, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఈగ సంజీవ్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మీసాల మధుకర్‌రావు, కేసీఆర్ సేవాదళ్ కన్వీనర్ కోర్వ దేవేందర్, బ్రాహ్మణ కుల సంఘ నాయకులు పాల్గొన్నారు.
‘సత్యశోధక్’ విద్యార్థులకు అభినందన
సిరికొండ, డిసెంబర్29 : శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ బిగ్గెస్ట్ ఒలంపియాడ్స్-2022, రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌లో ప్రతిభ చూపిన సత్యశోధక్ పాఠశాలకు చెందిన విద్యార్థులను ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెలే బాజిరెడ్డి గోవర్ధన్, జిల్లా ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు బాజిరెడ్డి జగన్ గురువారం అభినందంచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతంలో చదువుతూ రాష్ట్రస్థాయి ఒలంపియాడ్, క్రీడల్లో రాణించడం అభినందనీయమని అన్నారు. ర్యాంకులు సాధించిన దీక్షిత్, హర్షవర్ధన్, సంజన, రోజిత్రెడ్డి, సిద్ధ్దార్థ, శ్రీనిత్, ప్రదీప్, వర్షిత్, ముజిబుల్ నవాజ్‌లను అభినందించి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఆర్.నర్సయ్య, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సాగునీటిని విడుదల చేయాలని వినతి
డిచ్పల్లి, డిసెంబర్ 29 : అలీసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా మండలంలోని ధర్మారం(బీ), బర్ధిపూర్ గ్రామంలోని పొలాలకు నీటిని త్వరగా విడుదల చేయాలని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు ఆయా గ్రామాల రైతులు గురువారం విన్నవించారు. ప్రస్తుతం వరి నాటువేసుకోవడానికి అనుకూలంగా ఉన్నాయని, రానున్న 20 రోజులు ఆటంకం లేకుండా నీరు అందించాలని విన్నవించారు. ఎమ్మెల్యే స్పందిస్తూ నీటి పారుదల ఉన్నతాధికారులతో మాట్లాడి గురువారం రాత్రి నుండి నీటిని విడుదల చేయిస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని రైతులకు సూచించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రామకృష్ణ, హరినాథ్, నాయకులు నిమ్మగడ్డ రాజా, గండు రాము, శ్రీనివాసరావు, నారాయణరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.