ఏర్గట్ల, మార్చి 26: తాగునీటి కోసం ఆ గ్రామస్తులు భగీరథ ప్రయత్నం చేయక తప్పడం లేదు. రెండు నెలలుగా గ్రామానికి శుద్ధ జలాలు సరఫరా కావడం లేదు. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా .. పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కనీస అవసరాలు తీర్చుకోవడానికి కష్టాలు తప్పడం లేదని వాపోతున్నారు. ఇవి ఏర్గట్ల మండలంలోని తొర్తి గ్రామస్తుల నీటి కష్టాలు. తొర్తి గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్నది. గ్రామంలో 40వేల లీటర్ల నీటి సామర్థ్యం ఉన్న మిషన్ భగీరథ ట్యాంకు నుంచి వేంకటేశ్వర గుడి వెనుకాల ఉన్న కొత్త ప్లాట్ కాలనీకి నిత్యం నీరు సరఫరా చేస్తారు.
ఈ కాలనీలో సుమారు 40 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. కానీ రెండు నెలలుగా మిషన్ భగీరథ నీరు రావడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉన్నదని, డబ్బులు పెట్టి నీరు కొనుక్కోవాల్సిన పరిస్థితి దాపురించిందని అంటున్నారు. వేసవి ఆరంభంలో ఇలా ఉంటే.. మొత్తం ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చుకుంటున్నామని తెలిపారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి నీటి సమస్యను తీర్చాలని వారు కోరుతున్నారు.
ఫిల్టర్ నీళ్లు కొనుక్కుంటున్నం..
రెండు నెలలుగా మిషన్ భగీరథ నీళ్లు వస్తలేవు. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలెం గ్రామం నుంచి ఫిల్టర్ నీళ్లు కొనుక్కొని, తెచ్చి తాగుతున్నం. అధికారులు స్పందించి మా నీటి గోస తీర్చాలె.
-తోకల ఈశ్వర్, తొర్తి
మినీ వాటర్ ట్యాంకు నుంచి తెచ్చుకుంటున్నం..
నల్లా నీళ్లు వస్తలేవు. కనీస అవసరాల కోసం మినీ వాటర్ ట్యాంకు నుంచి బకెట్, బిందెలతో తెచ్చుకుంటున్నం. ఎండలు ఎక్కువైతున్నయ్. నీళ్లు లేకుంటే ఎట్లనో..? ఎమో..?
-కచ్చకాయల గంగామణి, తొర్తి
మా గోసను అర్థం చేసుకోండి..
మిషన్ భగీరథ నీళ్లు రాక డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. మా గోసను అర్థం చేసుకొని నీళ్లు వచ్చేలా చూడాలి.
-పుత్తీ బేగం, తొర్తి