బీఆర్ఎస్ హయాంలో జీజీహెచ్‌కు కావాల్సిన యంత్రాలు, వసతులను కల్పించడంతో వైద్యులు ఉచితంగా అరుదైన శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఎంతో మందికి మోకాలి చిప్ప మార్పిడితోపాటు అరుదైన శస్త్రచికిత్సలు చేసి శభాష్ అనిపించుకున్నారు. కానీ కొన్ని నెలల క్రితం దవాఖానకు సంబంధించిన 22 మంది సీనియర్ వైద్యులు, ప్రొఫెసర్లు బదిలీ అయ్యారు.
ఇద్దరు వైద్యులు మాత్రమే భర్తీ అయ్యారు. రోగులకు సరిపడా వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో ప్రస్తుతం వైద్యసేవలు అందడం లేదు. మందుల కొరత కూడా వేధిస్తున్నది. ఇటీవల రోటరీ క్లబ్ ప్రతినిధులు జీజీహెచ్‌కు రూ. 28.30 లక్షల విలువచేసే రేడియాలజీ యంత్రాన్ని అందజేశారు. అయినా వైద్యసేవలు అంతంత మాత్రమే. అత్యాధునిక యంత్రాలు దవాఖానలో అందుబాటులో ఉన్నప్పటికీ వైద్యులు, సిబ్బంది లేకపోతే పేదలకు ఎలా వైద్యసేవలు అందుతాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఖలీల్‌వాడి, నవంబర్ 30 : గుండెజబ్బు… ప్రస్తుతం ఈ పదం వింటేనే అందరూ గడగడలాడుతున్నారు. ఇటీవల కాలంలో గుండెజబ్బులు తీవ్రమయ్యాయి. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది గుండెపోటుకు గురవుతున్నారు. గతంలో సుమారు 40 ఏండ్లు దాటిన వారికి మాత్రమే గుండె సంబంధిత వ్యాధులు వచ్చేవి. ఇటీవల వయస్సుతో సంబంధం లేకుండా యువత, చిన్నారులు కూడా
గుండెపోటుకు గురవుతున్నారు. గుండెజబ్బుల బారిన పడిన పేదలకు సకాలంలో వైద్య సేవలు అందాలని, ఇబ్బందులు ఎదుర్కోవద్దనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానకు ఖరీదైన, అత్యాధునిక టెక్నాలజీతో కూడిన క్యాథ్‌ల్యాబ్ యంత్రాన్ని అందజేశారు.
గుండెజబ్బు వచ్చిన వ్యక్తి పరిస్థితిని అంచనా వేసేందుకు, తీవ్రతను బట్టి సరైన వైద్యసేవలు అందించేందుకు ఈ యంత్రం ఉపయోగపడుతుంది. ఈ యంత్రాన్ని ఏర్పాటు చేయించడంతోపాటు కావాల్సిన గదులు, సామగ్రి అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికలు రావడంతో వైద్యసేవలు అందుబాటులోకి రాలేదు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా వైద్యసేవలు మాత్రం ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో జీజీహెచ్‌లోని వైద్యులు క్యాథ్లాబ్ గదికి తాళం వేశారు.
గత ప్రభుత్వం జీజీహెచ్‌లో గుండెజబ్బుల వైద్యసేవలను అందించేందుకు సుమారు రూ. 8 కోట్లతో అత్యాధునిక క్యాథ్లాబ్ మిషన్ అందజేసింది. దీని ఏర్పాటుకు జీజీహెచ్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గోడలను కూల్చి యంత్రం ఏర్పాటు చేయడంతోపాటు కంప్యూటర్ పరీక్షలు చేసేందుకు ప్రత్యేక గది, గుండె ఆపరేషన్ అనంతరం రోగిని పరిశీలనలో ఉంచేందుకు కొన్ని పడకలతో కూడిన ప్రత్యేక గదిని నిర్మించారు. ఇన్ని ఏర్పాట్లు చేసినా క్యాథ్‌లాబ్‌కు సంబంధించిన వైద్యులు, టెక్నీషియన్లు లేకపోవడం, ప్రభుత్వం పట్టించుకోకపోవడం, అడిగే అధికారులు లేకపోవడంతో వైద్యసేవలు ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు.
క్యాథ్‌ల్యాబ్ సేవలు అందిచడానికి ప్రభుత్వ దవాఖానలో అన్ని వసతులు ఏర్పాటు చేశాం. కార్డియాట్రిక్ డాక్టర్ లేకపోవడంతో దానిని మూసివేశాం. నోటిఫికేషన్ జారీ చేసినా డాక్టర్లు రాలేదు. లోకల్ వైద్యులు కూడా రావడంలేదు. ఈ విషయాన్ని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషనల్ డాక్టర్ వాణి దృష్టికి తీసుకెళ్లాం.ఇప్పటివరకు డాక్టర్ లేకపోవడంతో క్యాథ్‌ల్యాబ్‌ను ప్రారంభించలేదు. డాక్టర్ని నియమిస్తే వెంటనే ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాం.
– డాక్టర్ ప్రతిమారాజ్, జిల్లా ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్