నిజామాబాద్, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ ప్రతినిధి): మద్యం అక్రమ అమ్మకాలకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నది. విచ్చలవిడి విక్రయాలతో ఉభయ జిల్లాల్లోని పల్లెల్లో మద్యం ఏరులై పారుతున్నది. పచ్చని పల్లెలన్నీ చీకటి పడితే… బెల్టు దుకాణాల్లో దొరికే మద్యం బాటిళ్లతో ఆగమాగం అవుతున్నాయి. మద్యం దుకాణాల సంఖ్య మండలానికి ఒకటి నుంచి సరాసరి మూడు దుకాణాల వరకూ విస్తరిస్తే… బెల్టు దుకాణాలు మాత్రం అందుకు రెట్టింపు స్థాయిలో విస్తరించి అమ్మకాలు జరుపుతున్నాయి. మద్యం వ్యాపారంలో ఆరితేరిన వారు ఇందులో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. మద్యం దుకాణాల వేలంలో అవకాశం దక్కని వారంతా బెల్టు దుకాణాల ద్వారా అక్రమంగా అమ్మకాలు జరుపుతూ ప్రజలను నిలువు దోపిడీకి గురిచేస్తున్నారు. 10 నుంచి 15శాతం మేర అధికంగా ధరను ఆపాదించి బాటిళ్లు విక్రయిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పల్లెల్లో బెల్టు దుకాణాలన్నీ విచ్చలవిడిగా పెరిగినా పోలీసు, ఆబ్కారీ శాఖ అధికారులు మాత్రం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బెల్టు షాపులతో పేద కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయంటూ రేవంత్ రెడ్డి గతంలో తీవ్రంగా గొంతు విప్పారు. కానీ, సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విచ్చలవిడితనంపై నియంత్రణే చేయడం లేదు.
వైన్ షాపుల దుర్బుద్ధి…
మద్యం వ్యాపారం మూడు పువ్వులు… ఆరుకాయలు అన్న చందంగా మార్చుకునేందుకు వైన్స్ దుకాణాల యాజమాన్యాలు సిండికేట్‌గా మారినట్లుగానూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం స్థానిక పోలీసులు సైతం సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లుగా సమాచారం. తెర వెనుక ఆబ్కారీ శాఖ అధికారులు వంత పాడుతుండడంతో ఈ తంతు సాఫీగా సాగిపోతున్నది. మొన్నటి వేసవికాలంలో వైన్స్‌లో బీర్ల కొరత వేధించగా బెల్టుషాపుల్లో మాత్రం అధిక ధరలకు సులువుగా లభించాయి. బెల్ట్‌షాపు నిర్వాహకులను పావుగా మార్చుకొని విక్రయించిన బాటిళ్లపై కమీషన్ పొందుతున్నట్లుగా ఆరోపణలున్నాయి. మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ ధరలకే విక్రయించాల్సి ఉంటున్నందున కల్పిత కొరతతో అధిక లాభాలను బెల్టు దుకాణాల ద్వారా వ్యాపారులు ఆర్జిస్తున్నారు.
తెర వెనుక మద్దతు..?
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం విక్రయా లు జోరుగా పెరుగుతున్నాయి. సరాసరి ప్రతి నెలా రూ.వంద కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు వ్యాపారం నడుస్తున్నదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల సందడిలో భా గంగా గతేడాది డిసెంబర్లో 2లక్షల విస్కీ కేసులు, 2.67లక్షల బీర్ కేసులు అమ్ముడవ్వగా వీటి విలువ రూ.200కోట్లుగా ఉన్నది. ఇక ఈ ఏడాది ప్రారంభం జనవరిలో 1.40లక్షల విస్కీ కేసులు, 2లక్షల బీర్ కేసులు విక్రయాలు నమోదు కాగా వీటి మొత్తం విలువ రూ.136కోట్లు గా తేలింది. జూన్ నెలలో రూ.142కోట్లు మద్యం అమ్ముడైంది. ఇందులో 1.32లక్షల విస్కీ కేసులు, 3లక్షల బీర్ కేసులు విక్రయాలు జరిగాయి. జూలైలోనూ రూ.150 కోట్లు మేర వ్యాపారం జరిగినట్లుగా స్పష్టమవుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రూ.1200 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగాయి. వైన్‌షాపుల్లో నిర్ణీత వేళలోనే మద్యం అమ్మకాలు జరుగుతుండగా బెల్టు షాపులకు పరిమితి, నియంత్రణ అంటూ ఏదీ లేదు. ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు ఎంచక్కా కోరుకున్న బాటిల్ లభిస్తుండడం వెనుక ఆబ్కారీ శాఖ అధికారుల మద్దతు కూడా ఉన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
సమాచారం ఇస్తే దాడులు చేస్తాం..
ఎన్నికల సమయంలో ఈసీ ఆదేశాలతో విస్తృతంగా దాడులు నిర్వహించి బెల్టు షా పులను మూసేశాం. ఎక్కడైనా బెల్టు షాపులను తెరిస్తే మాత్రం ఊరుకునేది లేదు. దాడులు నిర్వహించి మూసేస్తాం. ప్రభు త్వం నుంచి లైసెన్సు పొందిన దుకాణాల్లోనే మద్యం అమ్మకాలు జరగాలి. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించే బెల్టు షాపులపై ప్రజలెవరైనా సమాచారం ఇస్తే తప్పకుండా దాడులు చేసి అరికడతాం.
– సోమిరెడ్డి, డిప్యూటీ కమిషనర్,ఆబ్కారీ శాఖ