సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు సోమవారం ఆందోళన కార్యక్రమాలతో దద్దరిల్లాయి. రూ.4వేల జీవనభృతి ఇవ్వాలని బీడీ కార్మికులు, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు, చెరుకు ఫ్యాక్టరీపై చర్యలు తీసుకోవాలని రైతులు, ఇండ్లు, గృహలక్ష్మి పథకం కింద రూ.2500 అందించాలని మహిళలు ధర్నా చేపట్టారు.
కామారెడ్డి/కంఠేశ్వర్, ఆగస్టు 5: సమాజంలో క్రియాశీలకంగా ఉన్న విద్యారంగంపై కాంగ్రెస్ ప్రభు త్వం నిర్లక్ష్యం చేస్తున్నదని పీడీఎస్‌యూ నాయకులు అన్నా రు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ల ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని విస్మరిస్తున్నదని అన్నారు. కేవలం ఒకశాతం మాత్రమే నిధులు పెంచి విద్యారంగంపై తన కపట నీతిని బహిర్గతం చేసిందని విమర్శించారు. విద్యారంగంపై దృష్టి సారించాలని, లేనిపక్షంలో పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు.
కామారెడ్డి,ఆగస్టు 5 :చెరుకు రైతులను మోసం చేసిన గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సీపీఐఎంఎల్ మాస్‌లైన్ నాయకులు, రైతులు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రభాకర్, జిల్లా కార్యదర్శి రామకృష్ణ మాట్లాడారు. రైతుల పేరిట క్రాప్‌లోన్ తీసుకొని రుణమాఫీ డబ్బులను కాజేసిన గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం నుంచి డబ్బులు రికవరీ చేసి రైతులకు ఇప్పించాలని డిమండ్ చేశారు. ఫ్యాక్టరీ యాజమాన్యంతోపాటు బ్యాంకు అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా నాయకులు ప్రకాశ్, సురేశ్, పరమేశ్, రమేశ్, లింబాద్రి, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
నవీపేట, ఆగస్టు 5: ఎన్నికలకు ముందు రూ.4 వేల జీవనభృతి ఇస్తామని చేసిన హామీని కాం గ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని బీడీ కార్మికులు డిమాండ్ చేశారు. ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా నవీపేట, డిచ్పల్లి తహసీల్ కార్యాలయాల ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ రాష్ట్ర వ్యాప్తం గా ఏడు లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారని, చాలీచాలని వేతనంతో కాలం వెళ్లదీస్తున్న తమకు సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.4వేల జీవనభృ తి ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీవనభృతి అంటూ మభ్యపెట్టి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని విమర్శించారు. అనంతరం తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు.