కోటగిరి, డిసెంబర్ 5: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను పెంచాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కోటగిరిలో బీడీ కార్మికులు గురువారం ధర్నాకు దిగారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రూ.4 వేల పెన్షన్ ఇవ్వాలని తహసీల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.
అధికారంలోకి రాగానే పింఛన్లు పెంచుతామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారని, ఏడాది గడుస్తున్నా ఆ హామీని నిలబెట్టుకోలేదని బీడీ కార్మికులు మండిపడ్డారు. పెన్షన్లు పెంచకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశ్, బీడీ కార్మికులు కళావతి, లక్ష్మి, అనిత, గంగామణి, వనిత, జమున, మంగ, సావిత్రి, భాగ్య తదితరులు పాల్గొన్నారు.