రుద్రూర్ / ఆర్మూర్ టౌన్, డిసెంబర్ 9 : కాంగ్రెస్ ప్రభుత్వం బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంతోపాటు ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ. 4,016 పెన్షన్ అందజేయాలని బీడీ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రుద్రూర్ మండల కేంద్రం, ఆర్మూర్ పట్టణంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ల ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీలు నిర్వహించి, తహసీల్ కార్యాలయాల వద్ద నిరసనలు తెలిపి, వినతిపత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీడీ కార్మికులకు చేతినిండా పని దొరకడం లేదని, నెలకు 8 నుంచి 12 రోజుల పని మాత్రమే దొరుకుతున్నదని, వేతనాలు కూడా తక్కువగా ఉన్నాయని వాపోయారు. బీడీ కార్మికులకు రూ.4,016 పెన్షన్ ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి ఏడాది కావస్తున్నా నేటికీ అమలు కావడం లేదన్నారు. రుద్రూర్లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశ్, ఆర్మూర్లో యూనియన్ నాయకుడు ముత్తెన్న, బీడీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.