నాగిరెడ్డిపేట, ఫిబ్రవరి 10: కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కులగణన సర్వేలో బీసీల జనాభాను తగ్గించి చూపడంపై ఉమ్మడి జిల్లాలోని బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికే కాంగ్రెస్ పార్టీ పుట్టి పెరిగిందని గొప్పలు చెప్పుకునే సర్కారు..కుల గణన సర్వే పేరిట బీసీలను తీవ్ర అన్యాయానికి గురిచేసిందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. గడిచిన పదేండ్లలో రాష్ట్రంలో బీసీ జనాభా కేవలం 2 లక్షలు మాత్రమే పెరిగినట్లు చూపడంతో రేవంత్ సర్కార్ చేపట్టిన సర్వే తీరుపై అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఓసీల జనాభా పెరగడం, బీసీల జనాభాను తగ్గించి చూపడంతో ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నదంటూ బడుగు బలహీన వర్గాలు చర్చించుకుంటున్నాయి. తెలంగాణ ఏర్పడిన తరువాత 2014లో కేసీఆర్ సర్కార్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేతో పోల్చుకుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సర్వేలో బీసీ జనాభా గణనీయంగా తగ్గింది. బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీల జనాభా శాతం కూడా తగ్గించి చూపడం సర్కారు దొంగ లెక్కల తీరుకు అద్ధం పడుతున్నది. రూ.160 కోట్ల ఖర్చుతో చేపట్టిన సర్వేతో ప్రభుత్వం అభాసుపాలైందని విమర్శలు వెల్లువెత్తుతున్నా యి.
ఉమ్మడి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో సగం మంది బీసీ కుటుంబాలు బతుకు దెరువు కోసం పట్నం బాట పట్టగా.. గణన సర్వే సిబ్బంది సైతం కార్యాలయంలోనే కూర్చొని సర్వే పూర్తి చేసినట్లు ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. కులగణన సర్వే తీరుపై ఎక్కడ చూసినా విమర్శలే తప్ప, ప్రశంసించేవారు కనిపించడం లేదు. కుల గణన సమగ్రంగా, శాస్త్రీయంగా నిర్వహించలేదని, తిరిగి సర్వే చేపట్టి కులాల వారీగా జనాభా జాబితాను విడుదల చేయాలని బీసీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. కామారెడ్డిలో ఎన్నికల సాక్షిగా మాట ఇచ్చిన రేవంత్రెడ్డి బీసీల డిక్లరేషన్ ఎటు పోయిందని ప్రశ్నిస్తున్నారు.
కుల గుణనలో బీసీ సామాజిక వర్గానికి అన్యాయం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తే బీసీల ఐక్యత కోసం పోరాటం చేస్తాం. రాష్ట్రంలో చేపట్టిన గణన సర్వే అంతా తప్పుల తడకగా ఉంది. గతంలో ఆరు శాతం ఉన్న ఓసీలు నేడు 15 శాతం పెరిగితే, 52 శాతం ఉన్న బీసీలు నేడు 46 శాతానికి ఎలా తగ్గుతారు. దీని వెనుక కుట్ర దాగున్నదని తెలుస్తున్నది. బీసీ కులాలతోపాటు ఎస్సీ, ఎస్టీల జనాభా తగ్గడం రాజకీయ కుట్ర. సర్వేను తిరిగి శాస్త్రీయంగా, సమగ్రంగా చేపట్టాలి. లేకుంటే సబ్బండ బీసీ కులాలు ఏకమై పోరాటం చేసేందుకు ముందుకు వస్తాయి.
-పేరుపల్లి సాయిబాబా, ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం
బీసీలను అణగదొక్కడానికి కాంగ్రెస్ సర్కార్ కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నది. మెజారిటీ జనాభా ఉన్న బీసీలు, ఎస్సీ, ఎస్టీలు పదేండ్లలో తగ్గితే..ఓసీల జనాభా 6 నుంచి 15శాతం పెరగడం ఎలా సాధ్యమవుతుంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్రెడ్డి కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటించి ఇప్పుడు మాట తప్పడం సిగ్గు చేటు. కుల గణన సంపూర్ణంగా జరగలేదు. తిరిగి సర్వే చేపట్టాలి. ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.
– కృష్ణ, సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు, నాగిరెడ్డిపేట