ఖలీల్‌వాడి, డిసెంబర్ 30: ‘బాన్సువాడకు వేల కోట్ల నిధులు ఇచ్చిండు కేసీఆర్. ఆయన ఇచ్చిన నిధులు ముందు పెట్టుకుని ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి పోచారం శ్రీనివాసరెడ్డి. ఆయనకు మంత్రిగా, స్పీకర్‌గా పదవులు ఇచ్చింది కేసీఆర్. కానీ పార్టీ కష్టాల్లో ఉంటే బాధ్యత తీసుకోకుండా బరువు తగ్గించుకుని పక్కకు తప్పించుకున్నారని’ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. మంచి మనస్సుతో మనం క్షమించినా పోచారంను తెలంగాణ చరిత్ర క్షమించదన్నారు.
అలాంటి వారికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం బాన్సువాడ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో కవిత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాన్సువాడను బంగారు వాడలా మార్చిందే కేసీఆర్ అని అన్నారు. స్వతంత్ర దేశంలో ఎన్నడూ లేని విధంగా బాన్సువాడకు నిధుల వరద పారించింది కేసీఆర్. రూ.12 వేల కోట్ల నిధులు, 9 వేల ఇండ్లు ఇచ్చిండు. బాన్సువాడ ప్రజలు బాధ పడొద్దని ఊరూరా బీటీ రోడ్లు వేయించిండు. దవాఖానాలు, విద్యాసంస్థలు ఏర్పాటు చేసిండు. అన్నింట్లోనూ బాన్సువాడను అభివృద్ధి చేసిండని గుర్తు చేశారు.
కేసీఆర్ ఇచ్చిన నిధులను ముందు పెట్టుకుని ఎన్నికలు గెలిచిన వ్యక్తి పోచారం శ్రీనివాసరెడ్డి. ఆయనకు మంత్రి గా, స్పీకర్‌గా పదవులు ఇచ్చిం ది కేసీఆర్. కానీ ఇచ్చిన మర్యాదను ఆయన కాపాడుకుంటే బాగుండేది. రెక్కలు వచ్చిన తర్వా త తల్లిని వదిలేసిన బిడ్డలాగా.. గెలిచిన తర్వాత, పార్టీ కష్టాల్లో ఉంటే వెంటనే పార్టీ మారిండు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దడమంటే ఇదేనని కవిత అన్నారు.
పార్టీ అంటే తల్లి లాంటిది. లక్షలాది మంది కార్యకర్తలకు గుండె ధైర్యం లాంటిది. వాళ్లను కాపాడుకున్నాం కాబట్టే 25 ఏండ్లుగా బీఆర్ఎస్ ముందుకు సాగుతున్నదన్నారు. 25 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తిగా మొదలై రాష్ర్టాన్ని సాధించడం అంటే మామూలు విషయం కాదని తెలిపారు. ఒక్క రక్తం చుక్క కింద పడకుండా రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ సాధించుకోవాలని కేసీఆర్ ఆనాడే చెప్పిండు. అన్నట్లే తెలంగాణను సాధించిండన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణను దేశంలో నంబర్‌వన్ చేయాలన్న ఆలోచన ఉండేదని, రాష్ట్ర అభివృద్ధి కోసం అలాగే పని చేశామని కవిత చెప్పారు.
ప్రజల వద్దకు వెళ్లాలి, కార్యకర్తల వద్దకు వెళ్లి ధైర్యం చెప్పాలని పార్టీ నాయకులకు కవిత సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మన శక్తి ఏంటో చూపించాలన్నారు. బాన్సువాడకు మంచి ఇన్చార్జిని ఇచ్చేందుకు కృషి చేస్తామని, మీ విన్నపాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని కవిత తెలిపారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీల ఓట్లతోనే తాను ఎమ్మెల్సీగా గెలిచానని గుర్తు చేసిన ఆమె.. తాను బాన్సువాడకు కూడా ఎమ్మెల్సీనని చెప్పారు. మీరు మంచి కార్యక్రమం మొదలు పెట్టండి. తప్పకుండా బాన్సువాడకు వస్తానని పార్టీనాయకులకు సూచించారు. మీరంతా సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అయ్యే వరకూ కలిసి పోరాడదామని తెలిపారు. బాన్సువాడ ఇన్చార్జ్ జుబేర్, జడ్పీ మాజీ చైర్మన్ విఠల్‌రావు, సుమిత్రానంద్, ఇతర నాయకులు పాల్గొన్నారు.