Banswada | బాన్సువాడ, మార్చి 20 : బోగస్ మాటలు, ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, బాన్సువాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుభేర్ విమర్శించారు. గురువారం బాన్సువాడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు.
రైతుల సంక్షేమం కోసం బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదన్నారు. ముఖ్యంగా 2 లక్షల రుణమాఫీ ఎంత మంది రైతులకు చేశారో చెప్పాలని, ఉపాధి హామీ కూలీలకు 12 వేలు ఇస్తామని చెప్పి ఇప్పటికి ఇచ్చిన పరిస్థితి లేదని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా మహిళలకు ఉచిత బస్ పెట్టారని బస్సుల్లో సీట్లు దొరకక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వెంటనే బస్సులను పెంచాలని డిమాండ్ చేశారు.
రైతు భరోసా పథకంలో ఏడున్నర వేలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, కేవలం రూ. 6 వేలు కొంతమందికి వేసి చేతులు దులుపుకున్నారని ఎద్దెవ చేశారు. అంతేకాకుండా మహిళలకు కల్యాణ లక్ష్మీ పథకం లక్ష రూపాయలతో పాటు, తులం బంగారం అని చెప్పిన రేవంత్ సర్కార్ 15 నెలలు గడుస్తున్నా అమలు చేయలేదని మండిపడ్డారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం, ఆగ్రో చైర్మెన్ కాసుల బాలరాజు, ఏనుగు రవీందర్ రెడ్డిలు వారి వర్గ పోరు తప్పా, నియోజక వర్గానికి చేసిందేమీ లేదన్నారు. రైతుల పరిస్థితి తెలిసిన వ్యక్తి , గత ప్రభుత్వంలో రైతు మంత్రిగా, ప్రస్తుతం వ్యవసాయ సలహాదారుడిగా వ్యవహరిస్తున్న పోచారం నియోజక వర్గ ప్రజల స్థితిగతులపై ఎందుకు అసెంబ్లీలో నోరు విప్పడం లేదని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ పార్టీ లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరి, నియోజకవర్గ ప్రజలకు ఏమి చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గృహజ్యోతి పేరుతో పేదల ఇంటి కరెంట్ బిల్లుల కోసం ఆన్లైన్లో అప్లైకి పోతే, ఆన్లైన్ బంద్ ఉంటుందని ఆయన తెలిపారు. అంతేకాకుండా బాన్సువాడను జిల్లా చెయ్యాలని డిమాండ్‌తో నిరాహార దీక్షలు చేసిన ఆగ్రో చైర్మెన్ కాసుల బాలరాజు, ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వెంటనే బాన్సువాడను జిల్లాగా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సాయిబాబా, మోచి గణేష్, గాండ్ల కృష్ణ, అప్రోజూ, శంకర్, రాములు, బాలయ్య, అంజయ్య, మొగులయ్య, విట్టల్, జీవన్, అనిల్, రాజు కుమార్, నర్సింలు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.