సంక్షేమ పథకాల అమలులో ఎవరైనా డబ్బులు అడిగితే జైలుకు పంపిస్తానని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. బుధవారం బాన్సువాడలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. అధికారులు పనితీరు మెరుగుపర్చుకోవాలని సూచించారు.
– బాన్సువాడ రూరల్, ఫిబ్రవరి 22
బాన్సువాడ రూరల్, ఫిబ్రవరి 22 : గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం గతంలో మంజూరు చేసిన నిధులతో చేపట్టాల్సిన పనులు మందకొడిగా కొనసాగుతున్నాయని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. గ్రామాల్లో పెండింగ్ పనులు పూర్తి చేస్తేనే కొత్త పనులను మంజూరు చేస్తానని స్పష్టం చేశారు. బుధవారం బాన్సువాడ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ దొడ్ల నీరజా వెంకట్రాంరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో స్పీకర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాఖల వారీగా పనితీరును అధికారులు, ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఆయన సమీక్షించారు. వ్యవసాయ, పంచాయత్రాజ్శాఖల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మంజూరు చేసిన నిధులు, పనుల ప్రగతిని గ్రామాల వారీగా సమీక్షించారు. అనంతరం స్పీకర్ పోచారం మా ట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలను దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నదని తెలిపారు.
గ్రామాల అభివృద్ధికి ఎస్డీఎఫ్ కింద రూ. 10కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. కొన్ని గ్రామాల్లో చేపట్టిన పనులు ఇప్పటి వరకూ పూర్తికాకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. పాత పనులను త్వరితగతిన పూర్తి చేస్తేనే కొత్త పనులకు నిధులు మంజూరు చేస్తానని, లేనిపక్షంలో పాత పనులను రద్దు చేసేలా జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేస్తానని స్పష్టం చేశారు. ఎస్డీఎఫ్ కింద కొత్తగా మరో రూ. 10కోట్లు మంజూరు చేశానని, ఈ పనులను జూన్ మాసం నాటికి పూర్తి చేయాలని ప్రజా ప్రతినిధులకు సూచించారు. ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వందశాతం నల్లాలను బిగించి భగీరథ నీరును అందించాల్సిన బాధ్యత గ్రామాల సర్పంచులపై ఉందన్నారు. వందశాతం మిషన్ భగీరథ నీళ్లు అందిస్తున్న మండలంగా బాన్సువాడ మొదటి స్థానంలో ఉండాలన్నారు.
జాతీయస్థాయి అవార్డు..రాష్ర్టానికే గర్వకారణం
తల్లిపాల ప్రాముఖ్యతకు ఇచ్చే అంశంలో బాన్సువాడ మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి జాతీయస్థాయి అవార్డు రావడం రాష్ర్టానికి గర్వకారణమని సభాపతి పేర్కొన్నారు. బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే తల్లిపాలను మించింది మరొకటి లేదన్నారు. ఎల్లారెడ్డి నుంచి రుద్రూర్ వరకు జాతీయ రహదారి నిర్మాణానికి రూ. 540 కోట్లు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. గ్రామాల్లో రోడ్డుకు ఇరువైపులా 50 ఫీట్ల స్థలాన్ని వదిలేలా ప్రజలను ప్రజాప్రతినిధులు, నాయకులు ఒప్పించాలని సూచించారు.కొత్తగా ఏర్పడిన తండాల్లో రోడ్ల నిర్మాణానికి గిరిజన సంక్షేమశాఖ నుంచి నిధులు మంజూరయ్యాయని, పనులు ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో ఆర్డీవో రాజాగౌడ్. జడ్పీటీసీ పద్మ, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, తహసీల్దార్ గంగాధర్, ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి, వైస్ ఎం పీపీ హరిసింగ్, బాన్సువాడ, బోర్లం, బుడ్మి విండో చైర్మ న్లు ఎర్వాల కృష్ణారెడ్డి, సంగ్రాం నాయక్, గంగుల గం గారాం, సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
డబ్బులు అడిగితే జైలుకే..
బాన్సువాడ రూరల్, ఫిబ్రవరి 22 : డబుల్ బెడ్రూం ఇండ్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబాకర్ పథకాల అమలులో ఎవరైన డబ్బులు డిమాండ్ చేస్తే వారిని జైలుకు పంపుతానని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. బడుగు, బలహీనవర్గాల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నదని పేర్కొన్నారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రుద్రూర్, నస్రుల్లాబాద్, బాన్సువాడ మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి స్పీకర్ బుధవారం అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజాగౌడ్, తహసీల్దార్ గంగాధర్, ఎంపీపీలు దొడ్ల నీరజ, పాల్త్య విఠల్, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ఎర్వాల కృష్ణారెడ్డి, రాజేశ్వర్ గౌడ్, గంగుల గంగారాం తదితరులు పాల్గొన్నారు.